గళమెత్తిన పాత్రికేయ లోకం

గళమెత్తిన పాత్రికేయ లోకం

గౌరీ హత్యపై పెల్లుబికిన నిరసనలు 

కదలిన ప్రజా, విద్యార్థి, కార్మిక సంఘాలు 

పలుచోట్ల ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం

జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌

 

సాక్షి, హైదరాబాద్‌: కన్నడనాట లంకేశ్‌ పత్రిక సంపాదకురాలు గౌరీ లంకేశ్‌ దారుణ హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. జర్నలిస్టు సంఘాలు, ప్రజా, విద్యార్థి, కార్మిక సంఘాలు, మహిళా పాత్రికేయ సంఘాలు, కవులు, రచయితలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తూటాలకు, హత్యలకు జర్నలిజం ఎన్నటికీ తలవంచబోదంటూ నినదించారు. నిజాన్ని నిర్భయంగా రాస్తే చంపేస్తారా అంటూ నిలదీశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద ఐజేయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.



ఈ కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ... ‘‘ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. జర్నలిస్టుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తేవాలి. గోవింద్‌ పర్సారే, నరేంద్ర ధబోల్కర్, ఎంఎం కల్బుర్గీ, గౌరీ లంకేశ్‌ హత్యలన్నింటికీ ఒకే కారణం కనిపిస్తోంది. హంతకులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలి’’అని డిమాండ్‌ చేశారు. బీజేపీ అండతోనే మతతత్వ శక్తులు ఈ హత్యకు పాల్పడ్డాయని ఐజేయూ నాయకులు కె.శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు.



ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడేవారిపై దాడులు ఎక్కువయ్యాయని ‘సాక్షి’ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రకుమార్, ఐజేయూ కార్యదర్శి నరేందర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు కె.శ్రీనివాస్, ప్రగతిశీల మహిళా సంఘం నేత సంధ్య, పశ్య పద్మ, సామాజికవేత్త దేవి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.జీవన్‌కుమార్‌ పాల్గొన్నారు. 

 

గౌరీ స్ఫూర్తిని కొనసాగిస్తాం 

నెట్‌వర్క్‌ ఆఫ్‌ విమెన్‌ ఇన్‌ మీడియా ఇండియా (ఎన్‌డబ్ల్యూఎంఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. జర్నలిస్టులు ప్లకార్డులు పట్టు కుని గౌరీ హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖైరతాబాద్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.  



ఇందులో ఎన్‌డబ్ల్యూఎంఐ ప్రతినిధులు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు రాజమౌళిచారి, కార్యదర్శి ఎస్‌.విజయ్‌కుమార్‌ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు నరేందర్, రాజేశ్, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, తెలంగాణ ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షులు రమణ పాల్గొన్నారు. ఏపీలోనూ జర్నలిస్ట్‌ సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. 

 

మానవత్వానికే మచ్చ 

గౌరీ లంకేశ్‌ హత్య మానవత్వానికే మాయని మచ్చ అని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయ«ధీర్‌ తిరుమల్‌రావు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ, తెలంగాణ రచయితల వేదిక, అరసం, తెలంగాణ ప్రజాస్వామిక వేదికల సంయుక్త ఆధ్వర్యంలో గౌరీ హత్యను ఖండిస్తూ సంతాప సభ నిర్వహించారు. మరోవైపు గౌరీ లంకేశ్‌ హంతకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌), తెలంగాణ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్టు అసోసియేషన్‌(టీబీజేఏ), ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు(ఐఎఫ్‌డబ్ల్యూజే), హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్టు (హెచ్‌యూజే)ల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.



గౌరీ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని టీడబ్ల్యూజేఎఫ్‌ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్ట్‌ సంఘాల నేతలు జి.ఆంజనేయులు, మామిడి సోమయ్య, కోటేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ హత్యను తీవ్రంగా ఖండించింది. 

 

ఖండించిన సీపీఐ, సీపీఎం: ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే వందలాది మందిని వేధింపులకు గురిచేస్తున్నారని, దళితులపై దాడులు పెరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గౌరీ హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆరెస్సెస్‌ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చంపేస్తున్నారని డీవైఎఫ్‌ఐ ఒక ప్రకటనలో విమర్శించింది.

 

నేడు ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన 

గౌరీ లంకేశ్‌ హత్యను నిరసిస్తూ గురువారం సాయంత్రం 6 గంటలకు సోమాజీగూడలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top