‘అక్రమ ఉద్యోగుల’ క్రమబద్ధీకరణ!

నిషేధ సమయంలో దొడ్డి దారిలో చేరిన ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌

పైగా వారికి వేతన సవరణ చేసేందుకూ రంగం సిద్ధం  

అంగట్లో కూరగాయల్లాగా ఉద్యోగాలను అమ్మేశారు.. పోస్టులు లేకున్నా ఎడాపెడా నియామకాలు చేపట్టారు. నియామకాలపై నిషేధం ఉన్నా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,731 మందిని దర్జాగా నియమించేశారు. ఈ విషయం ఇటీవల వెలుగు చూసేసరికి ‘అరే.. ఇదేం విడ్డూరం’అంటూ ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. ఆ నియామకాలన్నింటినీ సక్రమం చేసేందుకు ఫైలు కదిలింది.. పైగా నజరానాగా ఆ అక్రమ ఉద్యోగులందరికీ వేతన సవరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. దళారులు తలుచుకుంటే జరగనిదేముంది... అదీ అక్రమాలకు నిలయంగా మారిన దేవాదాయశాఖలో మరింత సులభమని మరోసారి రుజువైంది.

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నో అవినీతి ఆరోపణలతో పరువుపోగొట్టుకున్న దేవాదాయశాఖలో తాజాగా జరుగుతున్న తంతు విస్మయం కలిగిస్తోంది. నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నందున కొత్త నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం నిషేధం విధించిన కాలంలో దొడ్డిదారిన చేరిన అక్రమ ఉద్యోగులను క్రమబద్ధం చేసేందుకు రంగం సిద్ధమైంది. దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వం ఇటీవల వేతన సవరణ చేసింది. వేతన సవరణ కసరత్తు సమయంలో దేవాదాయశాఖలో నియామకాలపై నిషేధం ఉన్న సమయంలో 1,731 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారన్న విషయం బయటపడింది. దీంతో కంగుతున్న ఉన్నతాధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

దీంతో అక్రమంగా నియమితులైన వారికి వేతన సవరణ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన సర్కారు వారికి వేతన సవరణను వర్తింపచేయొద్దని ఆదేశించింది. డిసెంబర్‌ నుంచి కొత్త వేతనాలు రావాల్సి ఉన్నందున వారిని పక్కనపెట్టి మిగతా వారికి వేతనాలు పెంచి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసింది. దీంతో ఆ అక్రమ ఉద్యోగులపై చర్యలు తప్పవనుకున్నారు. 2004లో దేవరయాంజాల్‌శ్రీరామచంద్రస్వామి భూముల అక్రమ ధారాదత్తం వెలుగు చూసినప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దేవాదాయశాఖలో పెద్ద సంఖ్యలో అక్రమంగా ఉద్యోగుల నియామకం జరిగినట్లు తేలింది. దీనికి ఓ కమిషనర్, కొందరు అధికారులు బాధ్యులని గుర్తించిన ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంది. అక్రమంగా నియమితులైనట్లు తేలిన కొందరు ఉద్యోగులను కూడా తొలగించింది.

దళారుల మాయ...

దేవాదాయశాఖలో తాజాగా బయటపడిన అక్రమ ఉద్యోగులను ఇప్పుడు కూడా ప్రభుత్వం తొలగిస్తుందన్న ప్రచారం జరిగింది. అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నందున జీతాల రూపంలో దేవాదాయశాఖపై ఆర్థికభారం కూడా పడుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్న వార్తలు వచ్చాయి. కానీ ఇదే సమయంలో కొందరు దళారులు రంగప్రవేశం చేశారు. అక్రమ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు భారీగా డబ్బు వసూలు చేశారు. ఆ తర్వాత తెరవెనక ఇంకేం మతలబులు చోటుచేసుకున్నాయోగానీ అక్రమ ఉద్యోగులకు కూడా వేతన సవరణ చేసేందుకు అడ్డుగా ఉన్న అంశాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ నిర్ణయించింది.

ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఆ ఉద్యోగులకు కూడా వేతన సవరణ చేయాలంటూ డిమాండ్‌ చేసిన దేవాదాయశాఖ అర్చక ఉద్యోగ సంఘాలకు ఆ మేరకు సమాచారం కూడా అందింది. ఈ నెలాఖరు వరకు ఆ తంతు పూర్తవుతుందని భావిస్తున్నారు. మార్చి నుంచి వారికి కూడా వేతన సవరణ అమలవుతుందని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే అక్రమార్కులకు భరోసా లభించి భవిష్యత్తులో వారు మరిన్ని అక్రమాలకు తెగబడేలా ప్రోత్సహించినట్లు అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top