ఏ లాకైనా.. ఓపెన్ కావాల్సిందే! | High-tech robbery in Nalgonda | Sakshi
Sakshi News home page

ఏ లాకైనా.. ఓపెన్ కావాల్సిందే!

Oct 25 2016 3:14 AM | Updated on Sep 4 2017 6:11 PM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని హైటెక్ పద్ధతుల్లో కొంతకాలంగా కార్లను చోరీ చేస్తున్న ముఠా.....

నల్లగొండలో హైటెక్ చోరీ ముఠా గుట్టు రట్టు
యూట్యూబ్ సాయంతో సెన్సార్ లాకింగ్ వాహనాలు సైతం చోరీ

 
సాక్షి, నల్లగొండ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని హైటెక్ పద్ధతుల్లో కొంతకాలంగా కార్లను చోరీ చేస్తున్న ముఠా గుట్టును నల్లగొండ పోలీసులు రట్టు చేశారు. కారు పోయిందని ఫిర్యాదు వచ్చిన వారం రోజుల్లోనే కూపీ లాగిన పోలీసులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 100కు పైగా కార్లు, బైక్‌లను దొంగతనం చేసి జల్సాలు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్, మంచిర్యాల, నల్లగొండలకు చెందిన ఆరుగురిని నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు.. వారం, పది రోజులుగా ప్రశ్నిస్తున్నారని, దర్యాప్తులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని పోలీసు వర్గాలంటున్నాయి.
 
సెన్సార్ లాక్.. చిటికెలో ఓపెన్:
 
వాస్తవానికి ఈ నెల ఆరో తేదీన నల్లగొండ జిల్లా జైలు సమీపం నుంచి ఓ ఇన్నోవా కారును దొంగలు తీసుకెళ్లారు. సెన్సార్ లాక్ ఉన్న ఈ వాహనాన్ని అతి చాకచ క్యంగా తీసుకెళ్లిన వారు.. దాన్ని వేగంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలన్న ఆదుర్దాలో చిట్యాల సమీపంలో యాక్సిడెంట్ చేశారు. ఇన్నోవా మూడు పల్టీలు కొట్టినా అత్యంత పకడ్బందీగా, ఎలాంటి గాయాలు లేకుండా బయటపడి తప్పించుకుని వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అయితే.. అదే రోజు తన వాహనం పోయిందని నల్లగొండ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాహనం ప్రమాదం జరగడంతో పోలీసులు ఈ కేసుపై దృష్టి సారించారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ కేసు దర్యాప్తులో పెద్ద దొంగల ముఠానే బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన మొయిద్, జహీర్, హాజీ, షెఫాహత్‌లతో పాటు మంచిర్యాలకు చెందిన ఆమీర్, నల్లగొండకు చెందిన అర్బాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో అర్బాజ్ గ్యాంగ్‌స్టర్ నయీమ్ అల్లుడని పోలీసులు భావిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించడం లేదు. ఈ వాహనాల దొంగతనం కేసులో నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు కూడా 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలుస్తోంది.  ఈ దొంగలు జిల్లా జైలు సమీపం నుంచి వాహనాన్ని చోరీ చేసిన సమయంలో పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా హ్యాకింగ్ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. వారు వెళ్లిన ప్రదేశం గుండా ఉన్న సీసీకెమెరాలు మొత్తం బ్లర్ అయ్యాయని, వాటిని కూడా హ్యాకింగ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

‘కార్ల దొంగతనం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమే.  పూర్తిస్థాయిలో విచారించి వీరిని కోర్టులో హాజరుపరుస్తాం’ అని  నల్లగొండ డీఎస్పీ ఎస్.సుధాకర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement