విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే దానికి అనుబంధంగా తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
హైదరాబాద్ : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే దానికి అనుబంధంగా తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా మరో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెదరాబాద్ వాతావరణశాఖ శుక్రవారం తెలిపింది. ఒకటి,రెండు చోట్ల ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అనేక చోట్ల ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రతీ వేసవి మార్చి, ఏప్రిల్ నెలల్లో క్యుములోనింబస్ మేఘాలు రావడం సహజమని.. దాని కారణంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం బలహీనపడ్డాక యథావిధిగా ఎండల తీవ్రత పెరుగుతుందని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది.
జూన్ రెండు లేదా మూడో వారం..
వచ్చే నెల ఒకటి,రెండు తేదీల్లో కేరళను రుతుపవనాలు తాకుతాయని వాతావరణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ తర్వాత రెండు లేదా మూడో వారంలో రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని పేర్కొన్నారు.