రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. పలువురికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు మొత్తం 24 మందికి స్థానచలనం కల్పించింది.
24 మందికి స్థానచలనం, ప్రమోషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. పలువురికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు మొత్తం 24 మందికి స్థానచలనం కల్పించింది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు మొదలు జిల్లా ఎస్పీల వరకు మార్పుచేర్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం సాయంత్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర శాంతి భద్రతల అడిషనల్ డీజీగా అంజనీకుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నగర శాంతి భద్రతల అడిషనల్ కమిషనర్‌గా ఉన్నారు. ప్రస్తుతం అడిషనల్ డీజీలుగా ఉన్న సుదీప్ లక్టాకియా, తేజ్‌దీప్ కౌర్‌లకు డీజీగా పదోన్నతి కల్పించి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది.
ఐజీగా ఉన్న రాజీవ్ రతన్‌కు అదనపు డీజీగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం ఐజీ హోదాలో సైబరాబాద్ కమిషర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ను అదే స్థానంలో కొనసాగిస్తూ అడిషనల్ డీజీగా ప్రమోషన్ కల్పించింది. డీఐజీలు ఆర్‌బి నాయక్, టి.మురళీకృష్ణ, ఎం.శివప్రసాద్‌కు ఐజీలుగా, ఎస్పీలుగా ఉన్న రాజేశ్‌కుమార్, ఎన్.శివశంకర్‌రెడ్డిలకు డీఐజీలుగా పదోన్నతి కల్పించింది. డ్రగ్స్ కంట్రోల్ డెరైక్టర్‌గా ఉన్న డాక్టర్ అకున్ సబర్వాల్‌ను హైదరాబాద్ రేంజ్ డీఐజీగా నియమించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డెరైక్టర్‌గా ఆయనకు ఉన్న అదనపు బాధ్యతలను తొలగించింది. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ ఈ జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఎస్.బి.జాయింట్ కమిషనర్‌గా ఉన్న వై.నాగిరెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.