హవాలా మార్గంలో విదేశాలకు భారీగా నగదు తరలిస్తు పట్టుకున్న కేసును నారాయణగూడ పోలీసులు ఐటీ శాఖకు అప్పగించారు.
హైదరాబాద్ : హవాలా మార్గంలో విదేశాలకు భారీగా నగదు తరలిస్తు పట్టుకున్న కేసును నారాయణగూడ పోలీసులు ఐటీ శాఖకు అప్పగించారు. రెండు రోజుల క్రితం హిమాయత్ నగర్లో విదేశాలకు అక్రమంగా డబ్బు తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి రూ. 84.75 లక్షల నగదుతోపాటు 2 కార్లు, ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
హవాలా వ్యవహారం గురించి పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు హిమాయత్ నగర్ నుంచి కారులో డబ్బు తరలిస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్నారు. వీరిలో హిమాయత్ నగర్‌లోని హైదరాబాద్ హిరా గ్రూపుకు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో నలుగురు ఉన్నారు. చాంద్‌బాగ్‌కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి ఇవ్వడానికి వారు డబ్బు తరలిస్తున్నట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయంపన్ను శాఖ అధికారులకు అప్పగించారు.