చెప్పడం కాదు.. చేసి చూపించండి | Governor Narasimhan serious | Sakshi
Sakshi News home page

చెప్పడం కాదు.. చేసి చూపించండి

Apr 13 2016 2:57 AM | Updated on Nov 9 2018 5:56 PM

చెప్పడం కాదు.. చేసి చూపించండి - Sakshi

చెప్పడం కాదు.. చేసి చూపించండి

రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘కరువు’పై ఉన్నతాధికారులతో సమీక్షలో గవర్నర్  
♦ ఉపాధి నిధుల మళ్లింపుపై సీరియస్
♦ కరువు ప్రణాళిక రెండు నెలలు కొనసాగించాలి
♦ రుతుపవనాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలి
♦ ఆగమేఘాలపై రూ.683 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘చేస్తున్నట్లు చెప్పడం కాదు.. చేసి చూపించండి.. వాటి ఫలితాలు కనిపించాలి..’’ అని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల విడుదలను పెండింగ్‌లో పెట్టడంపై గవర్నర్ సీరియస్ అయినట్లు తెలిసింది. అదనపు పనిదినాలు కల్పించాల్సిన సమయంలో ఉన్న నిధులను ఇతర పద్దులకెలా మళ్లిస్తారని ఆయన నిలదీసినట్లు సమాచారం. ఈ నిధులను ఇతర పద్దులకు మళ్లించడం సరైంది కాదని, వెంటనే విడుదల చేయాలని గవర్నర్ పేర్కొన్నట్లు తెలియవచ్చింది.

కరువు చర్యలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులపై గవర్నర్ మంగళవారం రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌తో సమావేశమై కరువు దుర్భిక్ష పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా శాఖాపరంగా చేపట్టిన కరువు నివారణ చర్యలను గవర్నర్‌కు ఎస్పీ సింగ్ వివరించారు. కరువు నేపథ్యంలో కూలీలకు మరింత ఉపాధి కల్పించే నిమిత్తం రూ. 300 కోట్లతో అదనపు పనిదినాలను కల్పిస్తున్నామన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాది హామీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3 వేల కోట్ల దాకా నిధులు ఇవ్వనున్నాయని, ఈ మేరకు పనులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం ద్వారా అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు తాగునీటి వసతుల కల్పనకు రూ. 220 కోట్లు విడుదల చేశామని, స్థానికంగా నీటి లభ్యత లేని ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. తాగునీటికి సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని, ఈ విషయమై ప్రతి వారం సమీక్షిస్తున్నామన్నారు. పశువులకూ నీటి కొరత ఏర్పడకుండా గ్రామీణాభివృద్ధి విభాగం ద్వారా నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ ప్రభుత్వం చేస్తున్నట్లు చెబుతున్నవన్నీ ఆచరణలో అమలు కావాలని, ఫలితాలు కూడా కనిపించాలని ఆదేశించారు. కరువును ఎదుర్కొనే ప్రణాళిక తాత్కాలికంగా కాకుండా, కనీసం రెండు నెలలు కొనసాగించాలని సూచించారు. కనీసం రుతుపవనాలు వచ్చేంత వరకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 గవర్నర్ సమీక్షతో కదలిక...
 ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందని విషయమై స్వయంగా గవర్నరే జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉపాధి కూలీలకు వేతన చెల్లింపులు, అదనపు పనిదినాల కల్పన నిమిత్తం రూ. 683.87 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం రాత్రి గ్రామీణాభివృద్ధి శాఖ హడావిడిగా ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement