సిట్టింగ్‌లకు ఫిటింగ్ | Fitting sitting | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌లకు ఫిటింగ్

Mar 10 2014 12:47 AM | Updated on Mar 18 2019 9:02 PM

సిట్టింగ్‌లకు ఫిటింగ్ - Sakshi

సిట్టింగ్‌లకు ఫిటింగ్

కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య కలహం ముదిరి పాకాన పడుతోంది. ఎమ్మెల్యేలను మార్చాలంటూ ఎంపీ.

కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య కలహం ముదిరి పాకాన పడుతోంది. ఎమ్మెల్యేలను మార్చాలంటూ ఎంపీ.. ఎంపీని మార్చాలంటూ ఎమ్మెల్యేలు ఎత్తుకు పై ఎత్తులు వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.

గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభల పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్‌లు అధిష్టానం వద్ద పావులు కదుపుతుండగా.. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అక్కడి ఎంపీ జైపాల్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభా స్థానం నుంచి తిరిగి పోటీ చేసే అంశం సందిగ్ధంగా ఉండటంతో.. ఆయా శాసనసభా నియోజకవర్గాల పరిధిలో అయోమయ పరిస్థితి నెలకొంది.
 

మల్కాజిగిరిలో పోటాపోటీ జాబితా

 మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని శాసనసభా స్థానాలకు ఎంపీ సర్వే సత్యనారాయణ తనదైన జాబితాను సిద్ధం చేశారు. అన్ని స్థానాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకుల పేర్లను ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఎల్‌బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్దగోని రాంమోహన్‌గౌడ్, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డికి ప్రత్యర్థి వర్గంగా ముద్రపడ్డ రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరిలో ఎమ్మెల్యే రాజేందర్‌ను వ్యతిరేకించే జీహెచ్‌ఎంసీ కో ఆప్షన్ సభ్యులు శ్రీధర్, కంటోన్మెంట్‌లో ఎమ్మెల్యే శంకర్రావు అంటే పడని బోర్డు వైస్ చైర్మన్ జయప్రకాష్, కుత్బుల్లాపూర్‌లో ప్రతాప్, కొలను హన్మంతరెడ్డిలలో ఒకరి పేర్లను సర్వే ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రతిపాదిస్తున్నారు. దీంతో తమ నియోకజవర్గాల్లో గ్రూపులకు కారణమైన ఎంపీ సర్వేను ఈ సారి తప్పక మార్చాల్సిందేనంటూ ఎమ్మెల్యేలు ఇటీవల  ఏఐసీసీ ప్రముఖులను కలిసి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. సర్వే స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరికిచ్చినా పరవాలేదని పేర్కొంటున్నట్లు సమాచారం.
 

 పావులు కదుపుతున్న అంజన్

 సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో తనదైన ముద్ర ఉండాలంటూ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ సిటింగ్‌లను ఎవరినీ కదిపే పరిస్థితి లేకపోవటంతో.. కనీసం పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలు లేని అంబర్‌పేట, ముషీరాబాద్, నాంపల్లి  స్థానాల్లో రెండు చోట్ల తాను సూచించే అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటూ అంజన్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో అంబర్‌పేట, ముషీరాబాద్‌లలో ఎక్కడ అవకాశం ఉన్నా తన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ పేరును ప్రతిపాదించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
 

 చేవెళ్లలో మొదలైన టికెట్ల హైడ్రామా
 

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో నగరానికి చెందిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఈ స్థానం నుంచి జైపాల్‌రెడ్డి తిరిగి పోటీ చేసే అంశం ఇంకా తేలకపోవటంతో కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో పూర్తి అయోమయం నెలకొంది. పార్లమెంటు పరిశీలకులు వచ్చిన సందర్భాల్లో జైపాల్‌రెడ్డి తరపున ఆయన అనుచరులు తిరిగి జైపాల్‌రెడ్డికే అవకాశం కల్పించాలని అర్జీలు ఇచ్చారు. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి తప్పుకొంటే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్లమెంటు స్థానానికి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ టికెట్‌పై పూర్తి ధీమాతో ఉన్నా, మరో నాయకుడు నాగేందర్ యాదవ్ టికెట్ కోసం నగరానికి చెందిన మంత్రిని నమ్ముకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement