కుమార్తె అకాల మరణంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుమార్తె అకాల మరణంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్శిగుట్ట సంజీవపురంనకు చెందిన పి. బాలకృష్ణ (30), లలిత దంపతులకు పవిత్ర (09). ప్రత్యుష (08) అనే కుమార్తెలున్నారు. అస్వస్థతకు గురైన పవిత్ర గతనెల 12వ తేదిన మృతి చెందింది. అప్పటి నుంచి బాలకృష్ణ మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. మరో కుమార్తె ప్రత్యూషతోపాటు ఆత్మహత్య చేసుకుందామని భార్య లలితతో తరచూ అనేవాడు. ఈ క్రమంలో ఈనెల 13వ తేదీన లలిత తన కుమార్తెను తీసుకుని రాంనగర్‌లో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాలకృష్ణ లిఫ్ట్ చేయకపోవడంతో 14వ తేదీ ఉదయం ఇంటికి వచ్చింది. లోపలకు తలుపు గడియపెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా భర్త చున్నీతో సీలింగ్‌ఫ్యాను ఉరివేసుకుని వేలాడుతు కనిపించాడు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, కుమార్తె మృతితో మనస్తాపానికి గురై బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.