
చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియా
ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది
హైదరాబాద్ : ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జూన్ 2, 2014 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ పరిహారం వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రోజూ ప్రతి జిల్లాలో ఏదో ఒక గ్రామంలో రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.
అసలే అప్పుల్లో వున్న కుటుంబాలు కుటుంబ పెద్దను కూడా కోల్పోవడంతో మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తున్న ఎక్స్ గ్రేషియాను ఆరు లక్షల రూపాయలకు పెంచిన ప్రభుత్వం ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు వర్తింపచేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీంతో మొదట ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా సవరించింది. కాగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ తెలంగాణలో వేర్వేరు జిల్లాల్లో 11మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.