నిలోఫర్ ఘటన మీద ఐఏఎస్ అధికారితో విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : నిలోఫర్ ఘటన మీద ఐఏఎస్ అధికారితో విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ బొజ్జా కి విచారణ బాధ్యతలు అప్పగించింది. నిలోఫర్ ఘటన మీద ఇప్పటికే అంతర్గత విచారణ జరగగా, ముగ్గురు సభ్యుల విచారణకు డీఎమ్‌ఈ ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ విచారణ జరగనుంది.
మంగళవారం మీడియాతో మాట్లాడిన అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మరోసారి అధికారులతో భేటి అయ్యారు. నిలోఫర్ ఘటనను సీరియస్ గా తీసుకున్న మంత్రి, ఉన్నత అధికారులతో మరోసారి సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, అలాగని ప్రస్తుతం జరిగిన తప్పును గుర్తించి సరిదిద్దడం, తప్పు చేసినవాళ్ళను గుర్తించి శిక్షించడం తప్పనిసరిగా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒక ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తే, వాస్తవాలు వెలుగు చేస్తాయని, నిష్పాక్షికత ఉంటుందని భావించారు. ప్రజారోగ్యం తో, వారి ప్రాణాలతో ముడిపడి ఉన్న ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదని చెప్పారు. రోగుల ఆరోగ్య భద్రత కు మరింత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
దీనితో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాజేశ్వర్ తివారి వెంటనే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ బొజ్జా ని నిలోఫర్ ఘటన మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు. పరిపాలన మరియు సాంకేతిక అంశాలు పరిశీలించాలని చెప్పారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.