వ్యవసాయం వ్యాపారం కావొద్దు

Do not trade agriculture - Sakshi

     సేంద్రియమే భూమికి, రైతులకు మేలు: మంత్రి ఈటల  

     కోటి ఎకరాలకు నీరివ్వడమే ప్రభుత్వ లక్ష్యం: హరీశ్‌ 

     వ్యవసాయ వర్సిటీలో ఉత్తమ రైతులకు పురస్కారాలు

రాజేంద్రనగర్‌: వ్యవసాయాన్ని వ్యాపారాత్మకంగా నిర్వహిస్తుండటంతో భూమి శక్తిని కోల్పోయి రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సేంద్రియ వ్యవసాయంతో భూమితోపాటు రైతులకూ మేలు జరుగుతుందని చెప్పారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం, విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ రైతు పురస్కార ప్రదానం, వ్యవసాయ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. దేశానికి రైతులు వెన్నెముక లాంటివారన్నారు. అన్నదాతలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. 

ఉత్తమ రైతులకు అవార్డులు  
ఉత్తమ రైతులకు మంత్రులు అవార్డులు అందజేశారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభాలు గడిస్తున్న యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ రైతు రజిత, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలానికి చెందిన రైతు శివయ్య (బీఎస్సీ అగ్రికల్చర్‌), వనపర్తి జిల్లా రైతు ఆర్‌.వి.ఆంజనేయ సాగర్, ఖమ్మం రైతు జి.సత్యనారాయణరెడ్డిలకు అవార్డులు ప్రదానం చేశారు.

ఫాంహౌస్‌ కాదు.. ఫార్మర్‌ హౌస్‌: హరీశ్‌రావు 
కృష్ణా, గోదావరి నీటితో పంటలు పండించేందుకు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని, ఎత్తిపోతలతో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి జనవరి 1 నుంచి 24 గంటల కరెంటు ఇస్తున్నామని, మిషన్‌ కాకతీయతో ప్రతి గ్రామంలోని చెరువులను బాగుచేస్తున్నామని తెలిపారు. సీఎం ఫాంహౌస్‌లోనే ఉంటారని కొందరు విమర్శిస్తున్నారని.. అది ఫాంహౌస్‌ కాదని ఫార్మర్‌హౌస్‌ అని చెప్పారు.

మంత్రి పోచారం మాట్లాడుతూ.. లాభాలొచ్చే పంటలను పండించేలా రైతులకు సూచనలివ్వాలని.. ఎకరాకు రూ.50 వేల మిగులు ఉండేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని చెప్పారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బృందం ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. డైరీతో పాటు టేబుల్‌ క్యాలెండర్, అ«ధికారుల ఫోన్‌ డైరీ, వ్యవసాయ శాఖ అధికారుల అసోసియేషన్‌ వెబ్‌సైట్‌ను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రవీణ్‌రావు, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం అ«ధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top