ఆదిలాబాద్‌ బాలికకు కర్నూలు చిన్నారి గుండె | critical heart transplantation done by continental hospital doctors | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ బాలికకు కర్నూలు చిన్నారి గుండె

Aug 17 2017 7:27 PM | Updated on Mar 19 2019 9:20 PM

తీవ్రమైన హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ పన్నెండళ్ల బాలికకు కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు.

సాక్షి, హైదరాబాద్‌ సిటీబ్యూరో: తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ పన్నెండళ్ల బాలికకు కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఆదిలాబాద్‌కు చెందిన బాలికకు కర్నూలు జిల్లాకు చెందిన మరో బాలిక గుండెను అమర్చారు. ఆరోగ్యశ్రీ పథకం సహకారంతో బాలికకు విజయవంతంగా చికిత్స చేశారు. ఈ మేరకు గురువారం హోటల్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఓఓ హరీష్‌ మన్యన్‌, పీడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌ స్వయిన్‌ చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో..
అదిలాబాద్‌ జిల్లాకు చెందిన దినసరి కూలీలు వికాస్‌, సంధ్యా మండల్‌ల కుమార్తె త్రిషమండల్‌(12) గత రెండేళ్ల నుంచి తీవ్రమైన హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న వైద్యులకు చూపించి తాత్కాలికంగా మందులు వాడారు. అయినా ఫలితం లేకపోవడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పీడియాట్రిక్‌ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ సునీల్‌ స్వయిన్‌ బాలికకు పరీక్షలు చేయించి గుండె పంపింగ్‌ సామర్థ్యం 10-15 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. దీనికి గుండె మార్పిడి చికిత్స తప్ప మరో మార్గం లేదని వైద్యులు స్పష్టం చేశారు. వైద్యులు సూచన మేరకు గుండె దాత కోసం జీవన్‌దాన్‌లో త్రిషపేరు నమోదు చేయించారు.

కర్నూలు అమ్మాయి గుండె దానం
ఇదే సమయంలో అవేర్‌గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక బ్రెయిన్‌డెడ్‌ స్థితికి చేరుకున్నట్లు జులై 18 సాయంత్రం జీవన్‌దాన్‌కు సమాచారం అందింది. బాలిక అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో అప్పటికే జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని కాంటి నెంటల్‌ ఆస్పత్రిలో గుండె మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తున్న అదిలాబాద్‌ జిల్లాకు చెందిన త్రిష బంధువులకు, సంబంధిత వైద్యులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్‌ సందీప్‌ అవతార్‌, డాక్టర్‌ సునీల్‌ స్వయిన్‌, డాక్టర్‌ సమీర్‌, డాక్టర్‌ ప్రశాంత్‌పాటిల్‌, డాక్టర​అంజూ దయాల్‌, డాక్టర్‌ రమేష్‌బాబు, డాక్టర్‌ అనిల్‌కుమార్‌రెడ్డిలతో కూడిన వైద్య బృందం రెండు బృందాలుగా విడిపోయింది.

50 నిమిషాల్లో 64 కిలోమీటర్లు ప్రయాణం
వెంటనే ఓ వైద్య బృందం దాత చికిత్స పొందుతున్న అవేర్‌ గ్లోబల్‌కు చేరుకుని దాత నుంచి రాత్రి11 గంటలకు గుండెను సేకరించారు. ప్రత్యేక గ్రీన్‌ఛానల్‌ సహాయంతో 64.3 కిలో మీటర్ల దూరంలో గచ్చిబౌలిలోని ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌లో ఉన్న కాంటినెంటల్‌ ఆస్పత్రికి 50 నిమిషాల్లో గుండెను తరలించారు. ఇదే సమయంలో మరో వైద్య బృందం త్రిషను ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించి చికిత్సకు సిద్ధం చేశారు. సుమారు 15 మందితో కూడిన వైద్య బృందం సుమారు రెండున్నర గంటల పాటు శ్రమించి త్రిషకు విజయవంతంగా చికిత్స చేశారు. లక్ష మంది పిల్లల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుందని,  ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉందని డాక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ స్వయిన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement