తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు.
ఆ వార్తలు అవాస్తవం మాజీ మంత్రి దానం నాగేందర్
బంజారాహిల్స్ : తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. తమ పార్టీలోనే కొందరు నేతలు పొమ్మనలేక పొగబెడుతూ అధిష్టానానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆరోపించారు. అధిష్టానం కూడా చెప్పుడు మాటలు వినడం మానేయాలని ఇలా వినడం వల్లే పార్టీ చాలా నష్టపోయిందని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకర్ష్ పథకాన్ని పక్కనబెట్టి ప్రజా సంక్షేమం వైపు దృష్టిసారించాలని హితవు పలికారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలోనే వాడవాడలా పర్యటిస్తామని చెప్పారు. నగరంలోని సీమాంధ్రులు వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కూడా గత తప్పిద నిర్ణయాలు తీసుకుంటే మరోమారు మోసపోక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబును గెస్ట్ అంటున్న అధికార పార్టీ, రేపు ఎన్నికలయ్యాక సీమాంధ్రులను కూడా అతిథులుగానే చూసి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి పార్టీని నిలువునా ముంచిపోయాడని ఆరోపించారు. దివంగత వైఎస్సార్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు తగిన ప్రాధాన్యం లభించిందని వెల్లడించారు.