
సాక్షి, హైదరాబాద్ : ‘రైతు బంధు’ పథకం కింద అన్నదాతలకు చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత చెక్కుల పంపిణీని ఈనెల 19 లేదా 20న నిర్వహించేందుకు ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సీఎం ఏ జిల్లాలో ప్రారంభిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తొలిరోజు అన్ని జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు చెక్కులు అందజేస్తారు.
మొదటి విడతలో రాష్ట్రంలోని మూడో వంతు గ్రామాల్లో ఇవ్వనున్నందున అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామసభలు పెట్టి ఇస్తున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీని భారీ పండుగగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతలో 20.93 లక్షల మంది రైతులకు పెట్టుబడి సొమ్ము చెక్కులను అందజేస్తారు.
6 కాదు 8 బ్యాంకులు
రైతులకు ఆరు బ్యాంకుల ద్వారా పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయాలని మొదట భావించిన వ్యవసాయ శాఖ తాజాగా ఎనిమిది బ్యాంకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), ఆంధ్రా బ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఐవోబీ (ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు), సిండికేట్ బ్యాంకులకు తోడుగా ఇప్పుడు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులకు కూడా చెక్కుల ముద్రణ బాధ్యత అప్పగించింది. తొలి విడతకు సంబంధించి ఎస్‌బీఐకి 225 మండలాల్లోని 1,439 గ్రామాల రైతుల వివరాలు అందజేసింది.
ఆంధ్రా బ్యాంకుకు 126 మండలాల్లోని 756 గ్రామాల రైతుల వివరాలు, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకుకు 34 మండలాల్లోని 186 గ్రామాల రైతుల వివరాలు, కెనరా బ్యాంకుకు 22 మండలాల్లోని 162 గ్రామాలు, కార్పొరేషన్ బ్యాంకుకు 26 మండలాల్లోని 143 గ్రామాలు, ఐవోబీ బ్యాంకుకు 24 మండలాల్లోని 151 గ్రామాలు, సిండికేట్ బ్యాంకుకు 33 మండలాల్లోని 235 గ్రామాలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు 230 గ్రామాల రైతుల సమగ్ర సమాచారాన్ని అందజేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన వివరాలతో బ్యాంకులు చెక్కులను ముద్రిస్తాయి.
నమూనా చెక్కు విడుదల
రైతులకు పంపిణీ చేసే చెక్కుల నమూనాను వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. చెక్కుపై తెలంగాణ ప్రభుత్వం, రైతు బంధు పథకం అని ఇంగ్లిషులో రాసి ఉంది. రైతు యూనిక్ ఐడీ నంబర్‌తోపాటు అతని పేరు రాసి ఉంటుంది. సొమ్ము కాలం కింద రెవెన్యూ గ్రామం పేరు రాసి ఉంటుంది.
అలాగే వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్ డిజిటల్ సంతకం ప్రత్యేక కాలమ్‌లో ఉంటుంది. ఇన్ని రకాల సమాచారంతో ముద్రిస్తున్నందున ఒక్కో చెక్కుకు బ్యాంకులు ప్రభుత్వం నుంచి రూ.110 వసూలు చేస్తున్నా యి. సాధారణ చెక్కుకు అంత ధర ఉండదు. ఆర్డర్ చెక్కులను ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బ్యాంకు లు ముద్రిస్తాయి. దానికి తగ్గట్లే ధరను నిర్ధారించారు.