ఇల్లు మారిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో తన మకాం మార్చారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో తన మకాం మార్చారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 22లోని అద్దె ఇంటిలో ఉంటున్న చంద్రబాబు దాన్ని ఖాళీ చేశారు. వాస్తు పండితులు ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని చెప్పటంతో ఆ ఇంటిని ఖాళీ చేసి రంగారెడ్డి జిల్లా మదీనగూడలోని ఫాంహౌస్‌కు మారాలని నిర్ణయించుకున్నారు.
సామాన్లను మదీనగూడ చేర్చే పనిలో కుటుంబసభ్యులున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ పని పూర్తవుతుంది. విజయవాడలో ఉంటున్న చంద్రబాబు ఇక నుంచి హైదరాబాద్ వస్తే ఇదే ఫాంహౌస్‌లో ఉండనున్నారు. గతంలో చంద్రబాబు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 65లోని ఇంటిలో ఉండేవారు. దానిపక్కనే ఖాళీగా ఉన్న స్థలాన్ని కుమారుడు లోకే ష్ పేరిట కొనుగోలు చేసిన చంద్రబాబు అక్కడ భారీ భవంతిని నిర్మిస్తున్నారు. అది పూర్తయ్యే వరకూ చంద్రబాబు ఫాంహౌస్‌లోనే ఉంటారని వినికిడి.


