గ్రేట్‌ పోలీస్‌ | Sakshi
Sakshi News home page

గ్రేట్‌ పోలీస్‌

Published Mon, Aug 14 2017 11:23 PM

గ్రేట్‌ పోలీస్‌

ఐదుగురికి కేంద్ర పోలీసు పతకాలు
చిక్కడపల్లి ఏసీపీకి ఇండియన్‌ పోలీసు మెడల్‌
మరో ఇద్దరు అధికారులకు ‘స్వాతంత్య్ర పతకాలు’
మహిళా జైలు చీఫ్‌ వార్డర్, ఎస్‌ఐలకు ప్రెసిడెంట్‌ మెడల్స్‌


నగరానికి చెందిన ముగ్గురు సీనియర్‌ పోలీస్‌ అధికారులు, ఒక మహిళా జైలు వార్డర్, ఎస్‌ఐలు  అత్యున్నత స్థాయి మెడల్స్‌ సాధించి శభాష్‌ అన్పించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్రం సోమవారం ప్రకటించిన ప్రెసిడెంట్‌ పోలీసు మెడల్‌ (పీపీఎం), ఇండియన్‌ పోలీసు మెడల్స్‌ (ఐపీఎం)కు మెట్రో రైల్‌లో అదనపు డీసీపీగా పని చేస్తున్న ఎ.బాలకృష్ణ, చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య, సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏసీపీ పి.గిరిరాజు, చంచల్‌గూడ మహిళా జైలు చీఫ్‌ వార్డర్‌ ప్రమీలాబాయి, ఎస్‌ఐ నారాయణరెడ్డి ఎంపికయ్యారు.
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు వీరికి మెడల్స్‌ దక్కాయి.


సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్రం సోమవారం ప్రకటించిన ప్రెసిడెంట్‌ పోలీసు మెడల్‌ (పీపీఎం), ఇండియన్‌ పోలీసు మెడల్‌ (ఐపీఎం) పతకాల్లో నగర పోలీసు విభాగానికి ఐదు దక్కాయి. మెట్రో రైల్‌లో అదనపు డీసీపీగా పని చేస్తున్న ఎ.బాలకృష్ణ, చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య, సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏసీపీ పి.గిరిరాజు, చంచల్‌గూడ మహిళా జైలు చీఫ్‌ వార్డర్‌ ప్రమీ లాబాయికి పతకాలు లభించాయి. తమకు ఈ పతకాలు రావడం ఎంతో ఆనందంగా ఉందని, తమ బాధ్యతల్ని మరింత పెంచి, విధులకు పునరంకితమయ్యేలా చేసిందని ఆ అధికారులు ‘సాక్షి’తో అన్నారు. ఆ వివరాలు....

ఎ.బాలకృష్ణ: హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో అదనపు ఎస్పీగా పని చేస్తున్న ఎ.బాలకృష్ణకు పీపీఎం దక్కింది. అనంతపురానికి చెందిన ఈయన 1985లో ఎస్సైగా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. నగరంలోని బేగంబజార్, మహంకాళి ఠాణాల్లో పని చేశారు. ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి తర్వాత ఎనిమిదేళ్ళ పాటు అవినీతి నిరోధక శాఖలో ఆపై నిఘా విభాగం, నగర స్పెషల్‌ బ్రాంచ్, బేగంపేట ట్రాఫిక్‌ల్లో విధులు నిర్వర్తించారు. ఏసీపీగా పదోన్నతి పొందిన తర్వాత ట్రాఫిక్‌ విభాగంలో సెంట్రల్‌ జోన్‌కు పనిచేశారు. ఆపై మెట్రో రైల్‌ సంస్థలోకి డిప్యుటేషన్‌పై వెళ్ళిన బాలకృష్ణ అక్కడ ఉండగానే అదనపు డీసీపీగా పదోన్నతి పొందారు. మెట్రో రైల్‌ నిర్మాణంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల్ని ఈయన అధ్యయనం చేసి అమలయ్యేలా చూశారు. బాలకృష్ణకు 1996లో పోలీసు సేవా పతకం, 2000లో ఉత్తమ సేవా పతకం, 2009లో ఇండియన్‌ పోలీసు మెడల్, 2010లో జనరక్షక్‌ అవార్డ్, 2012లో మహోన్నతి పోలీసు సేవా పతకం లభించాయి.

జె.నర్సయ్య: చిక్కడపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న జోగుల నర్సయ్యకు ఐపీఎం దక్కింది. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపూర్‌కు చెందిన నర్సయ్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన తర్వాత 1991లో ఎస్సైగా ఎంపికయ్యారు. బంజారాహిల్స్, అంబర్‌పేట, గాంధీనగర్, కాచిగూడల్లో ఎస్సైగా, మహబూబ్‌నగర్‌లోని ఆత్మకూరు, నగరంలోని పంజగుట్ట, టప్పాచబుత్ర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్, ఆసిఫ్‌నగర్‌ల్లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఏసీపీగా పదోన్నతి పొందిన తర్వాత సంతోష్‌నగర్‌లో పని చేసి ప్రస్తుతం చిక్కడపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1993లో జరిగిన బాంబుల శివారెడ్డి హత్య, 2011 నాటి డీఆర్‌డీఓ సైంటిస్ట్‌ కుమారుడు ప్రణవ్‌ కిడ్నాప్, హత్య, సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్య కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. టాస్క్‌ఫోర్స్‌లో ఉండగా నగర చరిత్రలోనే తొలిసారిగా 300 గ్రామలు కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈయన సేవలకు 2010లో పోలీసు సేవా పతకం, 2015లో ఉత్తమ సేవా పతకం లభించాయి. వీటితో పాటు 32 మెరిటోరియస్‌ సర్వీస్‌ ఎంట్రీలు, 350 రివార్డులు, 20 అభినందన పత్రాలు సొంతమయ్యాయి.

పి.గిరిరాజు: సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏసీపీ పి.గిరిరాజు ప్రసుత్తం డిప్యుటేషన్‌పై డీజీపీ కార్యాలయంలో డీఎస్పీ స్టోర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 1991లో ఎస్సైగా పోలీసు విభాగంలోకి వచ్చిన ఆయన 2010లో ఏసీపీగా పదోన్నతి పొందారు. ప్రధాన మంత్రుల భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీగా సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన  పీవీ నర్సింహారావు నుంచి మన్మోహన్‌సింగ్‌ వరకు ప్రధానులుగా పని చేసినప్పుడు వారి వద్ద విధులు నిర్వర్తించారు. గిరిరాజు అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉండగా ఆయన వద్దా పని చేశారు. అటల్‌ ప్రధాని హోదాలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు.

ఆ సమయంలో గిరిరాజు పైలెట్‌ డ్యూటీలో ఉండి కాన్వాయ్‌లోని మొదటి వాహనంలో ఉన్నారు. ఈ కాన్వాయ్‌ ప్రయాణిస్తూ ఓ రైల్వే ట్రాక్‌ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో ఎడమ వైపు నుంచి ఓ రైలు ఇంజన్‌ దూసుకురావడాన్ని గుర్తించిన గిరిరాజు అప్రమత్తమై కాన్వాయ్‌ను ఆపి పెను ప్రమాదం తప్పించారు. 2007లో జరిగిన స్టేట్‌ పోలీసు డ్యూటీ మీట్‌లో పిస్టల్‌ ఫైరింగ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు.

ప్రమీలాబాయి: చంచల్‌గూడ: చంచల్‌గూడ మహిళల జైల్లో చీఫ్‌ హెడ్‌ వార్డర్‌గా విధులు నిర్వహిస్తున్న అనుముల ప్రమీలాబాయికి రాష్ట్రపతి పురస్కారం దక్కింది. 1986లో ఆమె జైళ్ల శాఖలో వార్డర్‌గా ఎంపికై ఉద్యోగంలో చేరారు. ఆమె వరంగల్, హైదరాబాద్‌ జైళ్లలో పనిచేశారు. ప్రమీల భర్త సారయ్య కూడా జైళ్ల శాఖ ఉద్యోగి. వరంగల్‌ జైల్లో హెడ్‌ వార్డర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్యకు అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వారి సొంత ఊరు ఖాజీపేట. 1989లో ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రమీలాబాయికి పతకం రావడం పట్ల జైలు సూపరింటెండెంట్‌ బషీరాబేగం, జైలర్‌ అమరావతి, సిబ్బంది అభినందనలు తెలిపారు.

ఎస్‌ఐ నారాయణరెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో సురక్ష ప్లాజా అధికారిగా పనిచేస్తున్న ఎస్‌ఐ ఆర్‌.నారాయణరెడ్డికి రాష్ట్రపతిఅవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా డోన్‌ ప్రాంతానికి చెందిన ఆయన.. 18 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోలీస్‌ విభాగంలో తన సేవలను గుర్తించి అవార్డునకు ఎంపిక చేసినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అవార్డునకు ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

Advertisement
Advertisement