పదేళ్లలో కేన్సర్‌ను జయిస్తాం

Cancer will be removable in next ten years - Sakshi

     ప్రఖ్యాత కేన్సర్‌ పరిశోధకుడు ప్రేమ్‌కుమార్‌రెడ్డి

     ఇమ్యూనోథెరపీ ఓ అద్భుత ఆవిష్కరణ 

     క్రిస్పర్‌తో కేన్సర్‌ చికిత్సకు ప్రయోజనం ఉండదు 

     హోమియో, ఆయుర్వేదాలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కేన్సర్‌పై విజయం సాధించే రోజు ఎంతో దూరం లేదని, ప్రస్తుత పరిశోధనలు పరిశీలిస్తే పదేళ్లలోనే ఇది సాధ్యమవుతుందని ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్‌ పరిశోధకుడు ప్రేమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం కేన్సర్‌ సోకితే మరణమే అనుకునే వారని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, ఒకట్రెండు రకాలు మినహా ఇతర కేన్సర్ల విషయంలో రోగులు 15–20 ఏళ్లు జీవిస్తున్నారని వివరించారు. కేన్సర్‌కు ఒకట్రెండు జన్యుమార్పులే కారణమని ఒకప్పుడు అనుకునేవారని, తాజా పరిస్థితులు గమనిస్తే వందకుపైగా మ్యూటేషన్స్‌ వ్యాధిని ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.

ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆన్‌ సెల్‌ బయాలజీ–2018లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ప్రేమ్‌కుమార్‌.. ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వైద్య రంగంలో ఇమ్యూనోథెరపీ ఓ అద్భుతమైన ఆవిష్కరణ అని.. మందులు, ఇమ్యూనోథెరపీ కలిపి వాడితే వ్యాధిని జయించవచ్చని పేర్కొన్నారు. క్రిస్పర్, జన్యు చికిత్స విధానాలతో పెద్దగా ప్రయోజనం ఉండదని.. కేన్సర్‌ సోకిందని గుర్తించే సమయానికే శరీరంలో 10 కోట్లకుపైగా కేన్సర్‌ కణాలు ఉంటాయని, అన్ని కణాల్లోని జన్యువులను మార్చ డం దాదాపు అసాధ్యమని చెప్పారు. పైగా జన్యు మార్పు లున్న కణాలు గుర్తించడమూ పెద్ద సమస్య అవుతుందని వివరించారు. అయితే కొన్ని రకాల వ్యాధులు.. ముఖ్యంగా జన్యువుల్లో వచ్చే మార్పులను సరి చేసేందుకు ఈ చికిత్స ఉపయోగపడొచ్చని పేర్కొన్నారు. కేన్సర్‌ చికిత్సకు సంబంధించి పురాతనమైన పద్ధతులపై ప్రయోగాలు చేయాల్సిన అవసరముందని ప్రేమ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.

పౌష్టికాహారంతో నివారణ..
పౌష్టికాహారం కేన్సర్‌ను నయం చేయకపోవచ్చుగానీ.. నివారణకు మాత్రం మెరుగ్గా ఉపయోగపడుతుందని ప్రేమ్‌కుమార్‌ చెప్పారు. కేన్సర్‌ చికిత్సకు అందించే ట్యాక్సాల్‌ ఔషధం శరీరంలో వేగంగా విభజితమవుతున్న కణాలను చంపేస్తుందని, ఈ ప్రక్రియలో కొన్ని ఆరోగ్యకర కణాలూ నాశనమవుతూంటాయని పేర్కొన్నారు. ఈ చికిత్స ఫలితంగా వెంట్రుకలు ఊడిపోతాయని.. కడుపు, పేగుల గోడలపై ఉండే పొర కణాలూ దెబ్బతింటాయని, తెల్ల రక్త కణాలు కూడా తగ్గిపోవడంతో రోగులు బలహీన పడతారని వివరించారు. కడుపు, పేగుల్లోని కొన్ని రకాల బ్యాక్టీరియా కేన్సర్‌పై ప్రభావం చూపుతాయని.. అందుకే బ్యాక్టీరియా, కేన్సర్‌ల మధ్య సంబంధం తెలుసుకోడానికి ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయన్నారు. హోమియోపతితో పోలిస్తే ఆయుర్వేదం విస్తృతంగా అర్థం చేసుకున్న విధానమన్నారు. కొన్ని వ్యాధుల విషయంలో హోమియో పనిచేస్తుందని నమ్ముతానని చెప్పారు. ఈ రెండు విధానాలనూ అర్థం చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top