
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి 29 వరకు జరగనున్న పులులు, జంతు గణన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణకు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సర్వేను పక్కాగా చేపట్టాలని క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం సచివాలయంలో సర్వేపై అటవీ అధికారులు, సిబ్బందితో ఆ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గణన సందర్భంగా అటవీ, జంతువుల ఆవాసానికి నష్టం జరగకుండా చూడాలని, అదే సమయంలో సమగ్ర అటవీ సమాచారం నమోదు అయ్యేలా చూడాలని అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి పీకే ఝా సూచించారు. శాకాహార, మాంసాహార జంతువులు, అటవీ ప్రాంతంలో ఉన్న వృక్ష జాతులు, మొక్కల వివరాలతో పాటు, అడవుల్లో మానవ ఆవాసాలు, పెంపుడు జంతువులు, పశు సంపద సంచారాన్ని కూడా నమోదు చేయనున్నారు. సమావేశంలో పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) డాక్టర్ మనోరంజన్ భాంజా, వైల్డ్ లైఫ్ ప్రత్యేకాధికారి శంకరన్, అదనపు అటవీ సంరక్షణాధికారులు పృధ్వీరాజు, లోకేశ్ జైస్వాల్, డోబ్రియల్, సునీల్ కుమార్ గుప్తా, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.