ఇంటర్నెట్ కేబుల్ లేకుండానే భగీరథ పైప్‌లైన్లు | Bhagiratha pipelines without internet cable | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ కేబుల్ లేకుండానే భగీరథ పైప్‌లైన్లు

Jun 14 2016 3:04 AM | Updated on Sep 27 2018 4:02 PM

ఇంటర్నెట్ కేబుల్ లేకుండానే భగీరథ పైప్‌లైన్లు - Sakshi

ఇంటర్నెట్ కేబుల్ లేకుండానే భగీరథ పైప్‌లైన్లు

మిషన్ భగీరథ ప్రాజెక్టు పైప్‌లైన్‌తో పాటే ఇంటర్నెట్‌కు అవసరమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను వేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ పట్టాలెక్కలేదు.

- 3,500 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లను పూర్తిచేసిన ఆర్‌డబ్ల్యుఎస్
- ఆలస్యంగా మేల్కొన్న ఐటీశాఖ
- సమన్వయ లేమిపై కేటీఆర్ ఆగ్రహం
 
 సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు పైప్‌లైన్‌తో పాటే ఇంటర్నెట్‌కు అవసరమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను వేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ పట్టాలెక్కలేదు. భగీరథ ప్రాజెక్టు బాధ్యతలను నిర్వహిస్తున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్), ఫైబర్‌గ్రిడ్ బాధ్యతలను చేపట్టిన ఐటీ శాఖల మధ్య సమన్వయం కొరవడడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి మంచి నీటిని అందించే 9 నియోజకవర్గాల్లో సుమారు 3,500 కిలోమీటర్ల మేర ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు భగీరథ పైప్‌లైన్లు పూర్తిచేశారు. ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తవ్వకాల నిమిత్తం దాదాపు రూ.140 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. ప్రభుత్వం తమకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు తాము పైప్‌లైన్లు వేసుకుంటూ పోయామని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు అంటుండగా, నిధుల కొరత కారణంగా ఫైబర్ గ్రిడ్ పనులను సకాలంలో చేపట్టలేకపోయామని ఐటీశాఖ చెబుతోంది.

ఫైబర్ గ్రిడ్‌పై సోమవారం సమీక్షించిన ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు రెండు విభాగాల మధ్య సమన్వయ లేమిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే భగీరథ పైప్‌లైన్లు వేసిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన ఐటీశాఖ అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్లు పూర్తయిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం కోసం ఏరియల్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని ఐటీశాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫైబర్ గ్రిడ్‌కు భారత్‌నెట్ ద్వారా కేంద్రం నిధుల కోసం మంగళవారం ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ప్రభుత్వం ఢిల్లీకి పంపుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement