రమ్య కేసులో శ్రావిల్‌కు చుక్కెదురు | Bail Petition Beatings High Court | Sakshi
Sakshi News home page

రమ్య కేసులో శ్రావిల్‌కు చుక్కెదురు

Aug 24 2016 1:45 AM | Updated on Aug 31 2018 8:31 PM

రమ్య కేసులో శ్రావిల్‌కు చుక్కెదురు - Sakshi

రమ్య కేసులో శ్రావిల్‌కు చుక్కెదురు

మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి చిన్నారి రమ్యతో పాటు ముగ్గురి మృతికి కారణమైన విద్యార్థి ఆర్.శ్రావిల్‌కు హైకోర్టులోనూ చుక్కెదురైంది.

బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి చిన్నారి రమ్యతో పాటు ముగ్గురి మృతికి కారణమైన విద్యార్థి ఆర్.శ్రావిల్‌కు హైకోర్టులోనూ చుక్కెదురైంది. బెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ తీర్పు వెలువరించారు. బెయిల్ కోసం శ్రావిల్ రెండు సందర్భాల్లో పిటిషన్లు దాఖలు చేయగా, నాంపల్లి కోర్టు వాటిని కొట్టేసింది. దీంతో అతను హైకోర్టులో ఇటీవల బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు.
 
304 పార్ట్ 2 కింద కేసు మార్చడం సబబే...  
పిటిషనర్ తరఫు న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ... పోలీసులు నమోదు చేసిన కేసులన్నీ బెయిలబుల్ నేరాలేనన్నారు. మొదట నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు 304ఎ కింద పోలీసులు కేసు నమోదు చేసి ఆ తరువాత దానిని 304 పార్ట్ 2 కింద మార్చారన్నారు. ఇది పిటిషనర్లకు వర్తించదన్నారు. ఈ వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, అదనపు పీపీ రామిరెడ్డి తోసిపుచ్చారు. శ్రావిల్‌వల్ల ముగ్గురు మరణించారని, ఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 304 పార్ట్ 2 కింద కేసు పెట్టారన్నారు.

పిటిషనర్, అతని మిత్రులు మద్యం తాగినట్లు సాక్ష్యాలున్నాయన్నారు. అంతేకాక పిటిషనర్‌కు తగిన లెసైన్స్ కూడా లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. అధిక వేగంతో నిర్లక్ష్యంగా, అది కూడా మద్యం మత్తులో కారు నడిపి వేరొకరి మృతికి కారణమైనప్పుడు అతనిపై సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు పెట్టవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కాబట్టి పిటిషనర్‌పై 304 పార్ట్ 2 కింద కేసు పెట్టడం చెల్లదన్న వాదన సరికాదని తేల్చి చెప్పారు. 304ఎను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న వాదనలను ఈ దశలో ఆమోదించలేమన్నారు. దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉం దని, అందువల్ల ఈ దశలో బెయిల్ మం జూరు చేయడం సాధ్యం కాదంటూ, శ్రావిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement