నిఖా.. దగా..

నిఖా.. దగా.. - Sakshi


పెళ్లి పేరుతో అమ్మాయిని వంచించిన అరబ్‌ షేక్‌

- మరో బాలికతో షేక్‌ సోదరుడి నిఖా యత్నం

- ఇద్దరు షేక్‌లు, మరో ఇద్దరు మధ్యవర్తుల అరెస్టు




సాక్షి, హైదరాబాద్‌/మైలార్‌దేవ్‌పల్లి: నిఖా (పెళ్లి) పేరుతో హైదరాబాదీ అమ్మాయిలను వంచించేందుకు కుట్రపన్నిన ఇద్దరు దుబాయ్‌ సోదరులతో పాటు మరో ఇద్దరు మధ్యవర్తులను సైబరాబాద్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దుబాయ్‌కు చెందిన సలీం ఒబేద్‌ సయీద్‌ సల్మాన్‌ అల్‌జబీ (52).. ఈ నెల 10న హైదరాబాద్‌కు వచ్చి చాంద్రాయణగుట్ట బండ్లగూడ పెళ్లిళ్ల దళారి మహమ్మద్‌ షఫీని సంప్రదించాడు. అందమైన అమ్మాయితో నిఖా జరిపిస్తే రూ.70 వేలు ఇస్తాననడంతో.. మైలార్‌దేవ్‌పల్లి అక్బర్‌ కాలనీకి చెందిన షఫీ అహ్మద్‌ కూతురు నాజియా బేగంను షఫీ నిఖాకు ఒప్పించాడు.



బాధితురాలికి రూ.40 వేలు ముట్టజెప్పి, మిగిలిన రూ.30 వేలు తను తీసుకున్నాడు. అయితే వీరి నిఖాను స్థానిక హాజీతో చేయించాల్సి ఉన్నా.. షఫీ తనకు నమ్మకస్తుడైన, జల్‌పల్లి ఎర్రకుంటకు చెందిన మహమ్మద్‌ హబీబ్‌ అలీతో 6 రోజుల క్రితం జరిపించాడు. ఇందుకోసం హబీబ్‌ అలీ రూ.10 వేలు తీసుకున్నాడు. నిఖా ధ్రువీకరణ పత్రం ఆమోదం కోసం దంపతులను ముంబై పంపించినట్లు బాధిత కుటుంబాన్ని నిందితు లు నమ్మించారు. ఈ ఆరు రోజులు బాధితురాలితో గడిపిన సలీం ఇబేద్‌.. దుబాయ్‌ పారిపోయేందుకు సన్నాహాలు చేసుకున్నాడు.  



బాలికలే కావాలని షరతు..

సలీం ఒబేద్‌ సోదరుడు ఇబ్రహీం సయూద్‌ సల్మాన్‌ అల్‌జబీ కూడా బాలికల కోసం దుబాయ్‌ నుంచి ఇటీవల హైదరాబాద్‌ వచ్చాడు. దళారి షఫీని ఫోన్‌లో సంప్రదించి తనకు బాలికల్ని చూపించాలని షరతు విధించాడు. గత మంగళవారం రాజేంద్రనగర్‌కు వచ్చిన ఇబ్రహీం.. షఫీని కలుసుకున్నాడు. షఫీ తన వద్ద ఉన్న బాలికల ఫొటోలు చూపగా అందు లో ఓ బాలికను ఎంచుకున్నాడు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం రాత్రి నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి అక్రమాలు చేశారా.. అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు.



షఫీ వద్ద 60 ఫొటోలు..

షఫీ వద్ద యువతులు, బాలికలకు సంబంధించి 60 ఫొటోలను పోలీసులు గుర్తించారు. తనకు మ్యారేజ్‌ బ్యూరో ఉండటంతో ఆ ఫొటోలున్నాయని దర్యాప్తులో షఫీ పోలీసులకు వివరించాడు. ఇద్దరు అమ్మాయిలకు నిఖా చేసి విదేశాలకు పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో షఫీ ఒప్పుకున్నట్లు తెలిసింది. దుబాయ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, హైదరాబాద్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని బాధితురాళ్లు అతడిని ఫోన్‌లో వేడుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. షఫీని తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top