‘అభయ హస్తం’ ఇక ఉచితం!

abhayahastam free - Sakshi

మహిళల వాటా చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే చెల్లించిన వారికీ వర్తింపు

సొమ్మును తిరిగి ఇవ్వనున్న సర్కారు

సాక్షి, హైదరాబాద్‌: మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లోని సభ్యులకు భరోసా కల్పించే అభయ హస్తం పథకం పూర్తిగా మారనుంది. సభ్యులకు, వారి భర్తలకు సైతం బీమా కల్పించేలా పథకంలో మార్పులు చేశారు. రాష్ట్రంలో 78 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త విధానంలో పథకాన్ని అమలు చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త తరహా అభయ హస్తం పథకం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది.

ఈ మేరకు ఏప్రిల్‌ నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందిస్తున్న అభయ హస్తం పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంఘాల్లోని సభ్యులు తమ వాటాగా చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే చెల్లించిన వారి మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని భావిస్తోంది. లబ్ధిదారులకు అందించే ప్రయోజనాలను పెంచుతోంది.

రాష్ట్రంలో మొత్తం 4.26 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 44.42 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం 20.15 లక్షల మంది మాత్రమే అభయ హస్తం పథకంలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులతో సంఘా ల్లోని మొత్తం సభ్యులు అభయ హస్తం పథకం పరిధిలోకి వస్తారు. సభ్యులుగా ఉన్న వారి భర్తకు కూడా బీమా పథకం వర్తించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీమా వర్తించే వారి సంఖ్య 78 లక్షలకు చేరనుంది.

వైఎస్‌ హయాంలో ప్రారంభం
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బీమా సౌకర్యం, వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభయ హస్తం పథకాన్ని ప్రారంభించారు. 18 నుంచి 60 ఏళ్లలోపు వారు అభయ హస్తం పథకానికి అర్హులు. రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.356 చెల్లిస్తే.. ప్రభుత్వం తన వంతుగా ఇంతే మొత్తాన్ని చెల్లిస్తోంది. పథకంలో సభ్యులకు 60 ఏళ్లు దాటిన తర్వాత కనీసం రూ.500 తగ్గకుండా పింఛను వస్తుంది.

తెలంగాణ ఏర్పడిన రోజు వరకు రాష్ట్రంలో 2,13,852 అభయ హస్తం పింఛనుదారులు ఉన్నారు. అనంతరం వీరిలో 1,16,848 మంది ఆసరా పింఛన్‌ లబ్ధిదారుల జాబితాలో చేరారు. మిగతా 97,004 మంది అభయ హస్తం పింఛను పొందుతున్నారు. అభయ హస్తం పింఛను నెలకు రూ.500 మాత్రమే ఉండగా.. అదే ఆసరా వృద్ధాప్య పింఛను నెలకు రూ.వెయ్యి అందుతోంది.

అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆసరా పింఛను ఇవ్వాలనే నిబంధన ఉంది. దీంతో వయస్సు పరంగా అర్హత ఉన్నా కుటుంబంలో మరొకరు ఆసరా లబ్ధిదారుగా ఉండటంతో 89,356 మందికి  అభయ హస్తం పథకం కింద రూ.500 మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు అభయ హస్తం పథకంలో చేరిన వారు ప్రతి రోజు రూపాయి చెల్లించడంపైనా మహిళల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పథకం మొత్తాన్ని కొత్తగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top