Sakshi News home page

ఉస్మానియా ట్విన్ టవర్స్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్

Published Tue, Jul 21 2015 3:03 AM

ఉస్మానియా ట్విన్ టవర్స్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ట్విన్ టవర్స్ నిర్మాణానికి సీఎం కె.చంద్రశేఖరరావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, డీఎంఈ డాక్టర్ రమణిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఉస్మానియా భవనం దుస్థితిపై ఇటీవల ‘సాక్షి’లో ‘హా..స్పత్రి’.., ‘మళ్లీ కూలిన పైకప్పు’ వంటి శీర్షికలతో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దీనికితోడు వైద్యులంతా సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడం, ఆ తర్వాత ఉద్యోగ సంఘాలన్నీ కలసి ఉస్మానియా పరిరక్షణ కమిటీ పేరుతో జేఏసీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో సమావేశమై బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

ఆస్పత్రిని హెరిటేజ్ పరిధి నుంచి తొలగించే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఈ మేరకు ప్రస్తుత భవనం స్థానంలోనే మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు, ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో బహుళ అంతస్తుల భవనానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షుడు బొంగు రమేశ్, ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాగేందర్‌లు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement