'గో'దారులన్నీ జామ్! | Heavy traffic jam on pushkar routes | Sakshi
Sakshi News home page

'గో'దారులన్నీ జామ్!

Jul 23 2015 6:40 AM | Updated on Sep 3 2017 6:02 AM

గోదావరి మహా పుష్కరాలకు భక్తులు మళ్లీ పోటెత్తారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
 గోదావరి మహా పుష్కరాలకు భక్తులు మళ్లీ పోటెత్తారు. మంగళవారం భక్తుల సంఖ్య కాస్త పలుచబడినప్పటికీ బుధవారం అనూహ్యంగా రద్దీ పెరిగింది. జిల్లావ్యాప్తంగా 30 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. భక్తుల తాకిడి పెరగడంతో ప్రధాన పుష్కర ఘాట్ల ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రానికి వెళ్లే భక్తులు 20 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కాళేశ్వరంలోనూ 17 కి.మీ., కోటిలింగాల ప్రాంతంలో 12 కి.మీ. మేర ట్రాఫిక్ జాం అయ్యింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీస్ యంత్రాంగం చెమటోడ్చింది. చాలాచోట్ల వాహనాలను వన్‌వేలోనే అనుమతిస్తున్నారు. వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో సాధారణ రోజుల్లో కరీంనగర్ నుంచి ధర్మపురికి వెళ్లడానికి గంటన్నర సమయం పడుతుండగా, బుధవారం 5 గంటలకుపైగా పట్టింది. కాళేశ్వరంలోనూ ఇదే పరిస్థితి. మహదేవ్‌పూర్ నుంచి కాళేశ్వరం వరకు 17 కిలోమీటర్లకు నాలుగు గంటల సమయం పట్టింది. కోటిలింగాలకు వెళ్లే వాహనాలు వెల్గటూర్ నుంచి 12 కిలోమీటర్ల మేర స్తంభించాయి. దైవ దర్శనాలకు సైతం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సివచ్చింది. మరో మూడు రోజులు జరిగే పుష్కరాలకు భక్తుల తాకిడి ఇలాగే ఉండే అవకాశముండడంతో ట్రాఫిక్, దర్శనాలకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది.
 జనమే.. జనం
 ధర్మపురికి జనప్రవాహం పోటెత్తింది. మధ్యాహ్నం 3 గంటల వరకే 8.25 ల క్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది. భక్తుల తాకిడితో రాయపట్నం, జగిత్యాల రూట్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రమయ్యాయి. వేలాది సంఖ్యలో వాహనాలు రావడంతో 20 కిలోమీటర్ల నిలిచిపోయాయి. భక్తులు ధర్మపురి చేరుకునేందుకు నానాపాట్లు పడ్డారు. డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి స్మితా సభర్వాల్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం రాక సందర్భంగా హెలిప్యాడ్ పరిశీలించారు. గోదావరి నీటి మట్టం పెరగడంతోపాటు రద్దీ ఎక్కువ కావడంతో స్నానఘట్టాల వద్దకు వాహనాలు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. చాలా మంది షవర్ల వద్ద స్నానాలు చేశారు. వీఐపీ ఘాట్‌ను బుధవారం రోడ్డు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, రాజ్యసభ మాజీ సభ్యుడు గిరీష్ సంఘీ, హీరో సంపూర్ణేశ్‌బాబు పుష్కర స్నానాలు చేశారు. కోటిలింగాలకు వచ్చే భక్తుల వాహనాలు వెల్గటూర్ నుంచి 12 కిలోమీటర్ల వరకు పూర్తిగా స్తంభించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఇదే పరిస్థితి. కోటిలింగాల కోటేశ్వర ఆలయానికి ప్రత్యేక దర్శనం ద్వారా రూ.20 లక్షల ఆదాయం చేకూరింది. 9వ రోజు కోటిలింగాలకు 2 లక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు.
 కాళేశ్వరుడి దర్శనానికి 2 కిలోమీటర్ల క్యూ
 కాళేశ్వరం తొమ్మిదో రోజు జన ప్రవాహంగా మారింది. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు కేవలం 17 కిలోమీటర్లు దూరం ఉండగా వాహనాల రద్దీతో నాలుగు గంటల సమయం పట్టింది. తిరుగు ప్రయాణంలో గంగారం మీదుగా వెళ్లిన భక్తులకు సైతం ట్రాఫిక్ సమస్య తప్పలేదు. సాధారణ దర్శనానికి రెండు కిలో మీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సాధారణ భక్తులకే జేసీ పౌసమిబసు ప్రాధాన్యత ఇచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు 8 లక్షల పైచిలుకు భక్తులు పుణ్య స్నానం ఆచరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ తదితరులు పుష్కరస్నానమాచరించారు. మంథనిలో రెండు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. జిల్లా జడ్జి నాగమారుతిశర్మ పుష్కర స్నానం చేశారు. గోదావరిఖని వద్ద గల రెండు పుష్కరఘాట్లలో 70 వేల మంది పుణ్యస్నానాలు చేశారు. గోదావరి ఒడ్డున మట్టితో తయారు చేసిన లక్ష లింగార్చన పూజల్లో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు. సుందిల్ల దేవస్థానం వద్ద గల పుష్కరఘాట్‌లో సింగరేణి సంస్థ మాజీ సీఎండీ, గవర్నర్ సలహాదారు ఏపీజీఎన్ శర్మ పుష్కర స్నానాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement