పతనానికి ఇది ప్రారంభమా?

Yogendra Yadav Writes on Narendra Modi - Sakshi

విశ్లేషణ
దేశంలోని ఏ ఇతర నాయకుల కంటే ప్రజాదరణ విషయంలో మోదీ అగ్రస్థానంలో ఉన్నమాట నిజమే కానీ ఆశలు నిలుపని ఆర్థిక ఫలితాలతో ప్రజల ఆలోచనలు మార్పు చెందుతున్నట్లుంది. మోదీ మ్యాజిక్‌ మళ్లీ పనిచేస్తుందా అనే ప్రశ్నకు బలమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయమే సమాధానం.

పాఠశాలకు వెళ్లిన రోజుల్లో హిందీ భాషలో రాసే ఉత్తరాల్లో మేం వాడుతూ వచ్చిన ‘‘ఇక్కడ అంతా బాగుంది’’ అనే పదబంధం గురించి చాలా జోకులు వేసుకునేవాళ్లం. ఇక్కడ అంతా బాగుంది. అలాగే చిన్న మామయ్య కాలం చేశారు. ఈ వార్త వినగానే అమ్మమ్మ బాగానే కన్నుమూశారు. ఈ సంవత్సరం వానలు పడనందున పంటలు పండలేదు. ఈ ఏడు వానలు తక్కువ కావటంతో పంట ఎండిపోయింది. అలాగే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. పోతే, ప్రతిదీ బాగానే సాగుతోంది. మీరు కూడా బాగానే ఉన్నారని తలుస్తాను. నేటి మన దేశం గురించి ఎవరైనా ఒక ఉత్తరాన్ని ఈ శైలిలో తిరగరాస్తే, అది పై జోక్‌కు ఏమంత భిన్నంగా ఉండదు.

మన దేశంలో అంతా సజావుగా సాగుతోంది. ఆదాయమా.. పడిపోయింది. ఉత్పత్తా.. తగ్గిపోయింది. ఎగుమతులా.. క్షీణించాయి. జీవన వ్యయమా.. పెరిగిపోయింది కానీ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది. నిరుద్యోగిత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక సంక్షోభంలో చిక్కుకున్న రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వ్యాపారులకు ఆశాభంగం కలుగుతోంది కానీ ప్రజలు మాత్రం సంతృప్తిగానే ఉన్నారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా కొందరు శిశువులు చనిపోయారు. మురికినీటి కాలువలో అత్యంత విషవాయువుల కారణంగా కొందరు చనిపోయారు. కొందరు తమ వాణిని వినిపించిన కారణంగా చనిపోతున్నారు. భయం కారణంగా కొందరు చడీచప్పుడు లేకుండా చనిపోతున్నారు. ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయి కానీ ప్రజాదరణ కారణంగా ప్రభుత్వం దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళుతోంది.

ఇతర జోకులలాగే, దీంట్లోనూ ఒక నిగూఢ వాస్తవం ఉంది. దేశం ఒక అయోమయ దిశ గుండా సాగుతోంది. మన దేశానికి చెందిన వాస్తవం, అవగాహన అనేవి నేడు పూర్తిగా వ్యతిరేక ధ్రువాల్లో నిలుస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ఒక దిశను చూపుతుండగా, ఒపీని యన్‌ పోల్స్‌ పూర్తిగా వ్యతిరేక ధ్రువాన్ని చూపుతున్నాయి. దేశానికి సంబంధించిన క్షేత్ర వాస్తవాలు ప్రభుత్వం గురించి ఒక చిత్రాన్ని చూపుతుండగా, ఒపీనియన్‌ పోల్స్‌ చిత్రణ దానికి భిన్నమైనదాన్ని అత్యంత స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

ప్రతి ఆరునెలలకు ఒకసారి తాను చేపట్టే ఒపీనియన్‌ పోల్‌ను ఇండియా టుడే గత నెలలో విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు జూలైలో జరిపినట్లయితే పాలక ఎన్డీయే కూటమి 2014లో సాధించిన దానికంటే అధిక మెజారిటీని సాధిస్తుందని అది అంచనా వేసింది. సర్వే ప్రకారం, ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాదరణ అదే స్థాయిలో కొనసాగుతుండగా తక్కిన నాయకులు ఎవరూ ఆయనకు దరిదాపుల్లోకూడా లేరు. ప్రభుత్వ పనితీరుతో ప్రజలు బాగా సంతృప్తి చెందుతున్నారని ఆ సర్వే చెప్పింది. కానీ ప్రతిపక్షం మాత్రం ఆ సర్వే విశ్వసనీయతను ప్రశ్నించింది. అయితే, రెండు నెలల క్రితం ఏబీపీ న్యూస్‌ కోసం సీఎస్‌డీఎస్‌ సంస్థ నిర్వహించిన సర్వే కూడా దాదాపు అలాంటి ఫలితాలనే చూపించింది.

గత నెలలో, భారత ఆర్థికవ్యవస్థకు చెందిన పలు వాస్తవాలు ప్రజల దృష్టికి వచ్చాయి. రద్దయిన పెద్దనోట్లు ఏమేరకు బ్యాంకుల్లోకి వచ్చాయన్న ప్రశ్నను నెలలపాటు తొక్కిపెడుతూ వచ్చిన రిజర్వ్‌ బ్యాంకు ఎట్టకేలకు, రద్దయిన పెద్దనోట్లలో చాలావరకు బ్యాంకుల్లో జమ అయిపోయాయని ఒప్పుకుంది. అంటే ప్రభుత్వం నల్లధనాన్ని నిరోధించడంలో విఫలమైనట్లు తేలిపోయింది. కొత్తగా ఉద్యోగాలను సృష్టిస్తున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఉపాధి రేటు వాస్తవానికి తగ్గుముఖం పట్టిం దని ఉపాధిపై ప్రభుత్వ గణాంకాలే సూచించాయి. నిజం చెప్పాలంటే ఈ అంశంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం కంటే మోదీ ప్రభుత్వం పేలవమైన పనితీరును ప్రదర్శించింది.

వృద్ధి రేటు కేవలం 5.7 శాతం మాత్రమే నమోదైనట్లు జాతీయ ఆదాయ (జీడీపీ) గణాంకాలు సూచించాయి. ఒక సంవత్సరంలోనే 2 శాతం క్షీణత అంటే రెండు లేక మూడు లక్షల కోట్ల రూపాయలను ప్రజలు నష్టపోయారని లెక్క. పారిశ్రామికోత్పత్తి క్షీణించింది, ఎగుమతులు పడిపోయాయి. రుతుపవన వర్షాలు బాగానే కురిసి, పంటలు బాగా పండినప్పటికీ, రైతుల ఆదాయం క్షీణించిపోయింది. జీఎస్టీ ప్రవేశంతో చిన్న తరహా వర్తకులు బాగా దిగాలు పడిపోయారు. జీఎస్టీని ఆత్రంగా అమలు చేయడం వల్ల దానితో రావల్సిన లాభాలు ఇప్పుడు సాధ్యం కావని స్పష్టంగా తెలిసిపోయింది.

అదే సమయంలో, వినియోగదారులు దీని ప్రభావాన్ని మొత్తంగా భరించాల్సి వస్తోంది. ముడిచమురు ధరలు దాదాపు సగానికి పడిపోయినా పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. గత కొద్ది నెలలుగా తగ్గుముఖంలో ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభించింది.
ఆర్థిక వ్యవస్థలోని ఈ మాంద్యం పెద్దనోట్ల రద్దువల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో కలుగుతోందా అనేది అసలు ప్రశ్న కాదు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పెద్ద, సాహసోపేతమైన నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు లేక తర్వాతైనా తలెత్తకమానదు.

మోదీ ప్రభుత్వంపై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్నమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. పంచకులలో డేరా మద్దతుదారులు విధ్వంసం సృష్టించిన సమయంలో హర్యానా ప్రభుత్వ వైఫల్యం,  గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో చిన్నారుల మరణం, గుర్‌గావ్‌లో పిల్లాడి హత్య వంటివి దీనికి ఉదాహరణలు. ఈ సంఘటనలకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష బాధ్యత లేకున్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై మోదీ తన అపరాధ భావన, బాధ్యత నుంచి తప్పించుకోలేరు.

వాస్తవానికి, అవగాహనకు మధ్య ఉన్న ఈ అంతరం తగ్గేదెలా: మోదీ ప్రభంజనం ముగియనుందా? మోదీ ప్రభుత్వ వికాస పతనానికి ఇది ప్రారంభమేనా? దేశ ప్రజల మానసిక స్థితి మార్పు చెందుతూ, ఈ దేశ వాస్తవాన్ని చూడడం వైపు మొగ్గు చూపుతోందా లేక మోదీ మరోసారి తన మంత్రదండాన్ని ప్రయోగించి అసలు వాస్తవాలను ప్రజలు మర్చిపోయేలా చేయనున్నారా? భవిష్యత్తు మాత్రమే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. ప్రజల దృష్టిలో మోదీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం ఉంటుందా లేదా అనేదే ఈ ప్రశ్నకు సమాధానమిస్తుంది.

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు
మొబైల్‌ : 98688 88986, Twitter: @_YogendraYadav
యోగేంద్ర యాదవ్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top