సంస్కరణలు జనంలోంచి రావాలి

Shekhar Gupta Article On Sabarimala Issue - Sakshi

జాతిహితం

కేరళలో హిందువుల విశ్వాసాలకు సంబంధించిన తొలి వివాదం నుంచి ఆరెస్సెస్‌/బీజేపీ లబ్ధిపొందే అవకాశం సుప్రీంకోర్టు తీర్పు వల్ల లభించింది. దీన్ని కాషాయపక్షం జనంలో తన పునాదులు విస్తరించుకోవడానికి విజయవంతంగా వాడుకోగలదా? లేక ప్రతిదీ సంశయాత్మక దృష్టితో చూసే మలయాళీలు హిందుత్వవాదుల ప్రచారాన్ని తిప్పికొడతారా? వివక్ష పాటించే మత సంప్రదాయాలను రద్దు చేయాల్సిన అవసరముంది. దురాచారాలను రూపుమాపాల్సింది సామాజిక, రాజకీయ సంస్కర్తలేగానీ న్యాయస్థానాలు కాదు. కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాలు పోవాల్సిందే. కానీ వాటిని ప్రజలు వదులుకోవాలంటే సంస్కరణలు జనం లోపలి నుంచే రావాలి.

కేరళ హిందుత్వ నాయకులు తెలివి తక్కువ వారై ఉండాలి. లేదా దుర్మార్గమైన హాస్య చతురత కలిగి ఉండాలి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి పది నుంచి 50 ఏళ్ల వయసున్న స్త్రీలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వారు నిరసన తెలుపు తున్నారంటే వారి ప్రవర్తనకు నేను ముందు చెప్పినవే కారణాలు. వాస్త వానికి తమకు పరోక్షంగా మేలుచేసిన సుప్రీంకోర్టు జడ్జీలకు ఈ నేతలు పుష్పగుచ్ఛాలు, ఆశీర్వాదాలు పంపాల్సింది. రాజ్యాంగ ధర్మాసనం 4–1 మెజారిటీ తీర్పు సదుద్దేశంతో ఇచ్చినా, హిందుత్వవాదులకు గొప్ప అవ కాశం కల్పించింది. కేరళలో ఎదగడానికి అవసరమైన పునాది నిర్మించు కోవడంలో రెండు తరాల ఆరెస్సెస్‌–జనసంఘ్‌–బీజేపీ నేతలు విఫలమ య్యారు. ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల హిందుత్వ నేతలు చివరి అడ్డంకి దాటి బలోపేతం కావడానికి ఆస్కారమిచ్చింది. తమిళనాడులో రెండు ప్రధాన పక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదైనా బీజేపీతో కలిసి సంకీ ర్ణంలో చేరగలవు. కేరళలో మాత్రం ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ రెండూ బీజేపీని సమానంగా వ్యతిరేకిస్తాయి. కేరళలో చోటు సంపాదించడానికి ఆరెస్సెస్‌ కార్యకర్తలు వామ పక్షాలతో ఘర్షణ పడుతున్న క్రమంలో హత్యలు జరు గుతున్నాయి.

రాజధాని తిరువనంతపురంలో తప్ప రాష్ట్రంలో ఇంకెక్కడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. 2014లో తిరువ నంతపురం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ సభ్యుడు శశి థరూర్‌ కంటే కేవలం 15 వేల ఓట్లు తక్కువ వచ్చాయి. కేరళలో హిందువుల విశ్వాసాలకు సంబంధించిన తొలి వివాదం నుంచి ఆరెస్సెస్‌/బీజేపీ లబ్ధి పొందే అవకాశం సుప్రీంకోర్టు తీర్పువల్ల లభించింది. దీన్ని కాషాయపక్షం జనంలో తన పునాదులు విస్తరించుకోవడానికి విజయవంతంగా వాడుకోగలదా? లేక ప్రతిదీ సంశయాత్మక దృష్టితో చూసే మలయాళీలు హిందుత్వవాదుల ప్రచా రాన్ని తిప్పికొడతారా? ఇక్కడ తమ పరిధి పెంచుకోవడానికి హిందుత్వ శక్తులకు మంచి అవకాశం దొరికిందనేది మనకు కళ్లకు కనిపించే వాస్తవం. కోర్టు తీర్పుపై నిరసన తెలపడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలను భారీ సంఖ్యలో సమీకరించాయి. ఈ స్త్రీలలో ఎక్కు వమంది సంస్కృత పదాలు, ఉచ్చారణతో కూడిన హిందీ మాట్లాడ డానికి కారణం వారంతా ఆరెస్సెస్‌ వ్యవస్థలో శిక్షణపొందడమే. నేడు పెద్ద సంఖ్యలో వారు శబరిమల చేరుకోవడంలో తప్పేమీ లేదు. హిందూ మితవాదశక్తులు కేరళలో బలపడే అవకాశం ఇచ్చిన ఉదారవాద న్యాయ మూర్తులకు కృతజ్ఞతలు చెప్పకతప్పదు.

‘సుప్రీం’ జోక్యంతో ఊహించని పరిణామాలు!
మతం సహా అన్ని విషయాలను చట్టం, రాజ్యాంగ సూత్రాలను బట్టి తీర్పు చెప్పే సుప్రీం కోర్టు జోక్యం ఫలితంగా ఊహించని పరిణామాలు ఎలా ఎదురౌతాయో శబరిమల వివాదం చక్కటి ఉదాహరణ. సుప్రీం కోర్టు విచారణ తీరు చూస్తే– అది ఏ మతం అయినా హేతుబద్ధమనే నమ్మకంతో సాగుతుందనిపిస్తోంది. దేవుడి అవతారాలపై విశ్వాసం హేతుబద్ధమేనా? లేక ఒకే దేవుడు లేదా దేవత వందలాది అవతారాలు కూడా హేతువుకు నిలుస్తాయా? ఏ దేవుడు లేదా దేవతకు సంబంధిం చిన అనేక అవతారాలను సమర్థిస్తూ శోధించి పరిశోధనా పత్రాలు సమర్పించగలరా? లేక కన్యకు బిడ్డ పుట్టాడని నిరూపించగలరా? శివుడు, విష్ణు అవతారమైన మోహినీ సంపర్కంతో అయ్యప్ప స్వామి పుట్టాడని తేల్చిచెప్పేవారున్నారా? ఏసు పునరుత్థానం సంగతి? మహ్మద్‌ ప్రవక్తకు అల్లా చెప్పిన విషయాలే పవిత్ర గ్రంథం ఖురాన్‌లోనివని చెప్ప డానికి సాక్ష్యం ఏదని ఏదైనా కోర్టు అడుగుతుందా? ఇంకా అనేక ఆది వాసీ విశ్వాసాలు, జంతువులను పూజించడం, సూర్య, చంద్రారాధన, జంతు బలుల సంప్రదాయాలు, ఆచారాలకు హేతుబద్ధమైన ఆధారాలు అడిగితే? ఎవరు చెప్పగలరు? ఓ చెట్టు మీదో, రాయి మీదో ఎవరైనా తెల్ల సున్నం లేదా కాషాయ రంగు వేసినా లేదా పాడుబడిన సమాధిపై కొన్ని ఆస్బెస్టాస్‌ రేకులతో షెడ్డు వేస్తే పెద్ద సంఖ్యలో జనం ఈ ప్రదే శాలకు వచ్చి ప్రార్థనలు, పూజలు చేయడం మొదలెడతారు. ఇలాంటి విషయాలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానాలు విచారిస్తాయా? రోమన్‌ క్యాథలిక్‌ పీఠంలో స్త్రీలకు సమాన హక్కులు, పదవులు ఇవ్వాలని ఆదేశించాలంటూ ఎవరైనా క్రైస్తవ మహిళ సుప్రీంకోర్టును అభ్యర్థిస్తే ఏమవుతుంది? క్రైస్తవ మతబోధకులను యూపీఎస్సీ తరహా సంస్థ ఎంపిక చేయాలని కోర్టు ఆదేశిస్తే? ఆరెస్సెస్‌లోని అన్ని పదవుల్లో స్త్రీలకు కూడా స్థానం కల్పించాలని ఆదేశించాలంటూ ఓ హిందూ మహిళ జడ్జీ లను అడగగలదా? అలాగే, ఆరెస్సెస్‌కు ఓ మహిళ నాయకత్వం (‘సర్‌ సంఘ్‌చాలికా’?) వహిస్తే నిజంగా బావుంటుంది. ఇది భవిష్యత్తులో జరగొచ్చేమో కూడా. అయితే, ఇది ఏదైనా కోర్టు ఆదేశాలపై మాత్రం జరగదని మాత్రం మీరు ఖాయంగా నమ్మవచ్చు.

భిన్న విశ్వాసాలతో మనమంతా మొత్తంమీద శాంతియుత సహ జీవనం కొనసాగించడానికి కారణం భారతీయులుగా మనం మన పొరు గువారిని ప్రశాంతంగా ఉండనివ్వడమే. మత విశ్వాసాల విషయానికి వస్తే మన ప్రభుత్వం (రాజ్యం) అత్యంత స్వల్పస్థాయిలోనే వాటిలో జోక్యం చేసుకునే సంప్రదాయం మొన్నటి వరకూ కొనసాగింది.. హిందూ కోడ్‌ బిల్లుపై విపరీతమైన చర్చ జరిగిందిగాని దానిపై వివా దాల కారణంగా అది చట్టం కాలేదు. పార్లమెంటులో చర్చలు, మెజారిటీ ద్వారానే హిందూ పర్సనల్‌ చట్టాలు, సంప్రదాయాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి సంస్కరణలను అత్యుత్తమ సుప్రీంకోర్టు బెంచ్‌లు కూడా గత కొన్ని దశాబ్దాల్లో చేయలేకపోయా యని నేను అత్యంత వినమ్రతతో చెప్పగలను.

అదే కోర్టు నేడు ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని ప్రకటించింది. ప్రస్తుత పాలకపక్షం రాజకీయాలు భిన్నమైనవి కావడం వల్ల ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, ఈ కారణంగా పోలీసులు వివిధ రాష్ట్రాల్లోని ఇళ్లలోకి ప్రవేశించి, పురుషులను అరెస్ట్‌ చేసి ప్రాసిక్యూట్‌ చేయడం మనం నిజంగా చూస్తున్నామా? అదే జరిగితే ఇప్పటికే భయంతో వణికిపోతున్న మతవర్గం మరింత భయోత్పాతా నికి గురికాదా? ముమ్మారు తలాక్‌ అనేసి విడాకులివ్వడం భరించరాని విషయమే. అనేక ముస్లిం దేశాలు ఈ పద్ధతిని రద్దుచేశాయి. భారత ముస్లింలు కూడా ముమ్మారు తలాక్‌కు మంగళం పాడాలి. ఇలాంటి సంస్కరణలు ఆయా సమాజాల లోపలి నుంచే రావాలి. అంతేగాని ‘ఉదారవాద’ తీర్పుతో లభించిన అధికారంతో పోలీసుల ద్వారా కాదు.

వ్యక్తిగత స్వేచ్ఛే శబరిమల తీర్పునకు కారణమా?
వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం కారణంగానే శబరిమల వివాదంపై ఇచ్చిన తీర్పును సమర్థించుకున్నారని అర్థమౌతోంది. పిల్లలు కనే వయ సులో ఉన్నారనే సాకుతో స్త్రీలను అయ్యప్ప గుడిలోకి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు? ఈ మహిళలు తమ స్త్రీత్వంతో బ్రహ్మచారి అయిన దేవుడి దృష్టికి ‘భంగం’ కలిగిస్తారని మనం ఎలా నమ్మాలి? స్త్రీలను శబరిమల గుడిలోకి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును ప్రశంసిస్తూ మీడి యాలో సంపాదకీయాలు, పొగడ్తల వర్షం కురిసింది. సమానత్వం సాధించడానికి సుప్రీం మంచి తీర్పు ఇచ్చిందన్న సామాజిక కార్యకర్తలు మరో అంశం పరిష్కార దిశగా ప్రయాణం ప్రారంభించారు. అమలు చేయడానికి సాధ్యంకాని కోర్టు ఉత్తర్వులపై ప్రజలు చర్చించారా లేక దానిపై పరిశోధనా పత్రాలున్నాయా? అంటే జవాబు లేదనే వస్తుంది. మతాలతో సంబంధం లేకుండా టూవీలర్లు నడిపే మహిళలంతా హెల్మెట్లు తప్పనిసరిగా పెట్టుకోవాలన్న కోర్టు ఉత్తర్వు సిక్కుల నిరస నలతో తర్వాత రద్దయింది. అయినా, భద్రత గురించి ఆలోచించే సిక్కు మహిళలు హెల్మెట్లు ధరించడం పెరుగుతోంది. వారిని జన సమూహా లేవీ అడ్డుకోవడం లేదు.
కొన్ని ముస్లిం తెగల్లో స్త్రీల మర్మాంగాల్లో కొన్ని భాగాలను తొల గించడం(ఎఫ్‌జీఎం)పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపు తోంది. కోర్టు ఈ దురాచారం చెల్లదని తీర్పు ఇవ్వవచ్చు. కానీ ఆ ఉత్త ర్వును అమలు చేయగలరా? ఈ తెగ ముస్లింలు నివసించే మహా రాష్ట్ర, గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వాలు కూడా పైన చెప్పిన నేరం చేసిన వారిని తమ పోలీసులతో ప్రాసిక్యూట్‌ చేయించగలవా? పోలీసులు అలా చేయలేమంటే ఏం చేస్తాయి? కొన్నిసార్లు జడ్జీల కన్నా రాజకీయ నేతలు తెలివిగా ప్రవర్తిస్తారు.

ట్రిఫుల్‌ తలాక్‌పై ఆగ్రహం ప్రకటించిన నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం సైతం స్త్రీల మర్మాంగాల కోత విషయంపై మౌనం పాటి స్తున్నారు. వారణాసిలోని ఓ ఖబరిస్తాన్‌లో షియా–సున్నీ వివాదంపై 40 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో సుప్రీం కోర్టు దాని అమలుపై స్టే ఇచ్చింది. ఎలాంటి వివాదాస్పద సంప్రదాయం లేదా దురాచారమైనా చెల్లదని ఇచ్చే తీర్పులు న్యాయపరంగా, సామాజిక, రాజకీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇలాంటి కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాలు పోవాల్సిందే. కానీ వాటిని ప్రజలు వదు లుకోవాలంటే సంస్కరణలు జనం లోపలి నుంచే రావాలి. కోర్టుల జోక్యం ద్వారా మాత్రమే పైన చెప్పిన సామాజిక రుగ్మతలను తొల గించడం సాధ్యం కాదు. కోర్టుల అనవసర జోక్యం వల్ల ఆశించని పర్యవసానాలు ఎదురౌతాయి. శబరిమల తీర్పుతో కేరళలో బీజేపీ బలపడే అవకాశాలు మెరుగవ్వడం వంటి పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top