రాజకీయాల దిశ మారుతోందా?

shekar gupta article on change in politics - Sakshi

జాతిహితం
దేశంలోని రాజకీయాల దిశ ఇంకా మారలేదు. కానీ, ఏదో జరుగుతోందన్న భావన మాత్రం బలంగా వ్యాపిస్తోంది. 2013 తర్వాత మొదటిసారిగా మోదీ ఎదురొడ్డి పోరాడాల్సి వస్తోంది. ప్రతిపక్షాల పరిస్థితిని చూసి ప్రభుత్వం ఊరట చెందుతోంది. కానీ, ప్రజల ఆగ్ర హానికి గురైనప్పుడు ఎంతటి  జనాదరణగల నేతకైనా పతనం తప్పదని మనకు తెలుసు. ప్రభుత్వం తన జనసమ్మోహన శక్తిని తిరిగి సంపాదించాలంటే మరింత ఆకర్షణీయమైన ఆర్థిక గణాంకాలను చూపాలి. అవి తమ పాలనకు సంబంధించిన గణాంకాలై ఉండాలి.

ఇటీవల తరచుగా సంభాషణలు మొదలయ్యే తీరులో కొత్త పద్ధతి కనిపి స్తోంది. ప్రత్యేకించి వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులు ఉన్నప్పుడు సాగే సంభాషణల్లో అది వ్యక్తమౌతోంది. ఎవరో ఒకరు మిమ్మల్ని ఓ మూలన ఏకాంతంగా ఉండే చోటుకు తీసుకుపోయి ‘‘జనాంతికంగా (రహస్యంగా) మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా’’ అంటూ మొదలెడతారు. ‘‘నేను పాత్రికే యుణ్ణి, నేను మాట్లాడేదెప్పుడూ జనాంతికంగా ఉండదు సార్‌. కాబట్టి ఏం అడిగినా బహిరంగంగానే అడగండి’’ అంటాను నేను. ‘‘కాదండి, మీరు చెప్పేది సరే, కానీ ఇది చాలా సున్నితమైన ప్రశ్న కాబట్టి దయచేసి జనాం తికంగానే ఉంచండి’’ అంటూ మాట్లాడేవారు ప్రాధేయపడతారు.

సంభాషణ ఈ పద్ధతిలో కొంత సేపు సాగాక, మీతో మాట్లాడే వ్యక్తే వెర్రిమొహం వేసుకుని భయంభయంగా ఆ చిక్కుముడిని విప్పుతాడు. జనాంతికంగా మాట్లాడాలనుకుంటున్నది తానేనని ఒప్పుకుంటాడు. తానీ ప్రశ్న అడిగినట్టుగా ఎవరికీ తెలియకూడదని  ఆయన అనుకుంటారు. అలా అని మాటిచ్చాక, ప్రశ్న బయట పడుతుంది. ‘‘మీరేం అనుకుంటున్నారు, గాలి వీచే దిశ మారుతోందా?’’ ఆయన ప్రస్తావించేది ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న జనాదరణ గురించి. నేనిక్కడ రాస్తున్నట్టుగానే సరళంగా ‘నేను అలా అనుకోవడం లేదు’ అని ఆయ నతో నిజాయితీగా బహిరంగంగానే చెబుతాను.

మీరు వింటున్నవి పదవీకాలం మధ్యలో సాధారణంగా వినవచ్చే చప్పుళ్లే. అయితే ఎట్టకేలకు, ఈ ప్రభుత్వం ఆ మధ్యస్త కాలాన్ని దాటి పోయాక ఇప్పుడు కొంత గొడవ వినవస్తోంది కూడా అంటాను. ఈ వారాంతంలో తిరిగి ఇలాంటి సంభాషణ జరిగితే, నా ప్రతి స్పందన కొంత స్పష్టంగా ఉండవచ్చునేమో. అయినాగానీ, గాలి దిశ ఇంకా మారలేదు, కానీ ఏదో జరుగుతోందన్న భావన మాత్రం వ్యాపిస్తోంది అనే బహుశా చెప్పవచ్చు. యూపీఏ–2 హయాంలోని బాధాకరమైన కాలంలో, ఎన్నికలపరమైన ప్రక్షాళనా సమయంలో అనుభూతిలోకి వచ్చిన నిరాశావాదం, సందేహాలు ఇప్పుడు మనకు అనుభవంలోకి వస్తున్నాయి.

జనాదరణ తగ్గక పోయినా...
ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి నూతన సందే హాలు, నిరాశావాదం పెంపొందుతున్నాయి. ఈ ఆర్థిక ప్రతిష్టంభన యూపీఏ చివరి రెండేళ్ల పాలనా కాలంలో ప్రారంభమై ఉండొచ్చు, కానీ ఇప్పుడది మరీ సుదీర్ఘంగా సాగింది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా స్థూల జాతీయోత్పత్తి క్షీణత, రెండు 1,100 వోల్టుల విద్యుదాఘాతాల కుదుపులు (పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ), ఉద్యోగాలలో కోతలు, వేతనాల స్తంభన (7వ వేతన సంఘం సిఫా రసుల వల్ల ప్రభుత్వోద్యోగుల వేతనాలు పెరగడం మినహా) ప్రజలను బాధిం చడం ప్రారంభమైంది.

ఆర్‌బీఐ నివేదికలు, ద్రవ్యవిధానం, జీడీపీ, కరెంటు ఖాతా లోటు, వాణి జ్యలోటు, నిజ వడ్డీ రేట్లు, తదితర అసాధారణ పదజాలం చెప్పే సంక్లిష్ట విష యాలను చాలా మంది పట్టించుకోకపోవచ్చు. అయితే కుటుంబంలోని ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయి లేదా ఉద్యోగం దొరకక కలిగే వ్యధ, కుటుంబ వ్యాపా రమైన ఏ మిఠాయి దుకాణంలోనో పనిచేయక తప్పని స్థితికి నెట్టే యడం వల్ల కలిగే నిరాశాజనితమైన అసంతృప్తి బాగా బాధిస్తాయి.  గాజులు తయారుచేసే చిన్న వ్యాపారానికి పెద్ద నోట్ల రద్దు ఆరు నెలలపాటూ తూట్లు పొడవడం కూడా బాధకలిగించేదే. ఇక ఇప్పుడు జీఎస్‌టీకి సంబంధించిన చిక్కుముడు లతో కుస్తీ పట్టాల్సిరావడం పుండుకు కారం రాసినట్టే అవుతోంది. కానీ ప్రధాని జానాదరణ మాత్రం ప్రబలంగానే ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే, ఫలి తాలు 2014 నాటి కంటే చాలా భిన్నమైనవిగా ఉండేట్టేమీ కనబడటం లేదు. అయితే, మూడు విషయాలను మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఉన్నవారు చాలా సుదీర్ఘంగానే బాధలు పడ్డారు, సందేహాలు వారి మనసులను ముంచెత్తుతున్నాయి. పదవీ కాలంలో మూడింట రెండు వంతుల కాలం ముగిసేనాటికి అధికారంలో ఉన్న చాలా మందికి జనాదరణ క్షీణించడం జరుగుతుంటుంది. కానీ ప్రధాని జనాదరణ మాత్రం తగ్గలేదు. అయితే ఆయన ప్రాబల్యం పెంపొందుతుండటం మాత్రం నిలిచిపోయింది. వచ్చే ఎన్నికల వరకు, రెండేళ్లపాటూ రాజకీయాలు అలాగే కదలిక లేకుండా నిలిచిపోవు.

ఆందోళనకర సంకేతాలు
ఈ వారం ప్రధాని, కంపెనీ సెక్రటరీల సమావేశంలో ఉద్వేగభరితంగా చేసిన గంట ప్రసంగంలో ఆ ఆందోళన కనిపించింది. ఆర్‌బీఐ ఈ ఏడాది వృద్ధి అంచనాలను మరింతగా తగ్గించి, స్టెరాయిడ్‌లలా ఉత్ప్రేరణను కల్పించి ప్రభు త్వానికి ఊపిరి సలుపుకునే అవకాశాన్ని ఇవ్వనిరాకరించిన తర్వాత ఆయన ఈ ప్రసంగం చేశారు. అది మోదీ చేసిన అత్యుత్తమమైన ప్రసంగం. ఉద్రేకం, ఆగ్రహం, తీక్షణత, ఆత్మవిశ్వాసాలతో అది తొణికిసలాడింది. 2013 తర్వాత మొదటిసారిగా, ఆయన ఎదురొడ్డి పోరాడుతున్నారు. పోరాట స్ఫూర్తితోనే ఉన్నారు గానీ అది రక్షణాత్మకమైనది. తన మూడేళ్ల పాలనను ఆయన పదే పదే  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న చివరి మూడేళ్ల పాలనతో పోలిక తేవడంలో అది మీకు కనిపిస్తుంది. ఆ మూడేళ్ల కాంగ్రెస్‌ పాలన అత్యంత అధ్వానమైనది, అది ఆపార్టీ బలాన్ని లోక్‌సభలో 44 స్థానాలకు కుదించివేసింది. ఆ ప్రసం గంతో ఆయన మద్దతుదార్లందరూ తిరిగి నూత నోత్తేజం నింపుకుని ఇళ్లకు వెళ్లి ఉంటారని పందెం కాస్తాను. ఆయన మాటల ఆకర్షణశక్తి, ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలచుకోవడంలో ఆయనకున్న సాధికారత అలాంటివి. అయితే ఆయన మొహంలో ఆందోళన తొంగి చూసింది.

ఇటీవల ఆయన చేపట్టిన చర్యలు చాలా వాటిలో కూడా అది కనిపి స్తుంది. ‘‘నిరాశావాదాన్ని వ్యాప్తి చెందించే’’ వారిపై ఆయన చేసిన దాడి చురుక్కుమని గుచ్చుకునేది. ఇందిరా గాంధీ, తను సంక్షోభ పరిస్థితిలో ఉన్న నెలల్లో ‘‘ప్రతికూలాత్మకతను సృష్టించే’’ వారిని ఖండించడానికి అది సరితూ గుతుంది. ఇంతకు ముందు తాను రద్దు చేసిన ఆర్థిక సలహా మండలిని ప్రధాని తిరిగి తెచ్చారు. మోదీ, తాను చేసిన ఏదైనా ఒక యోచన నుంచి వెనక్కు మరలడం ఇదే మొదటిసారి. హార్వార్డ్‌లో విద్యాభ్యాసం చేసిన ఆర్థిక వేత్తలను దుమ్మెత్తిపోసిన కొన్ని నెలల్లోనే ఆయన వారిలో ఒకరిని (ప్రిన్సి టన్‌కు చెందిన సుర్జిత్‌ భల్లాను) తన సలహా మండలిలోకి తీసుకున్నారు. ఇకపోతే, పెట్రోల్, డీజిల్‌పై పెంచిన ఎక్సైజు సుంకాన్ని తగ్గించడం రెండవది.

అంతకు ముందు కొన్ని వారాలుగా ఆయన సీనియర్‌ మంత్రులు, అభివృద్ధికి అవసరమైన వనరుల సమీకరణకు అత్యంత ఆవశ్యకమైన చర్యగా ఆ పెంపు దలను దూకుడుగా సమర్థించారు. నూతన పర్యాటక మంత్రి, మోటారు వాహనాలున్న మధ్యతరగతివారు పన్నుల విధింపు గురించి వాపోవడం ఇక ఆపాలని చెప్పే సాహసం (ఇది వ్యంగ్యం కాదు, ఆయనతో నేను ఏకీభవి స్తున్నా) చేశారు. ఇప్పుడిక బీజేపీ నేతలు ‘‘పేదలకు అనుకూలమైన’’ చర్యను చేపట్టినందుకు ప్రధానిని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. వ్యాట్‌ను తగ్గిం చాల్సిందిగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాస్తానని ఆర్థికమంత్రి చెప్పారు. ఈ రెండు ఘటనల నడుమ కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన ‘‘దేశం పరిస్థితి’’ దసరా ఉపన్యాసంలో... ఉద్యోగాలు, ధరలు, వ్యాపా రస్తులు, ఆర్థికపరిస్థితి విషమంగా ఉండటం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉండగా ఆయన ఇలా మాట్లాడటం అసాధారణ మైన విషయం.

ఆశాజనకమైన ఆర్థిక గణాంకాలు అవసరం
ప్రతిపక్షాల పరిస్థితిని, వాటికి ప్రధానికున్న ఆకర్షణశక్తి, శక్తిసామర్థ్యాలు, దృష్టి కేంద్రీకరణకు సరితూగే నాయకుడు లేకపోవడాన్ని లేదా వాటికి ఉమ్మడి ఎజెండా లేకపోవడాన్ని చూసి ప్రభుత్వం ఊరట చెందుతోంది. కానీ, వ్యతిరే కంగా ఓటు చేసేంతగా ప్రజలు ఆగ్రహానికి గురైనప్పుడు.. ప్రత్యర్థి సంగతి ఎలా ఉన్నా, ఎంతటి అత్యధిక జనాదరణగల నేతకైనా పతనం తప్పదని మనకు తెలుసు. నేడు లోక్‌సభలో మోదీకి ఉన్న దానికంటే ఎక్కువ ఆధిక్యత ఉన్న రాజీవ్‌ గాంధీ 1989 నాటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు.

బలాబలాలను తలకిందులు చేసే ఆ స్థానం ఇంకా సుదూరంలోనే ఉంది. కానీ, ఇప్పుడు వీస్తున్న గాలిలో ఆసక్తికరమైన భవిష్యత్‌ సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై పరిహాసాలు పుట్టుకొస్తుండటం, ప్రాచుర్యం పొందుతుండటం ఏ నేత విషయంలోనైనా ఇబ్బందులను సూచించే తొలి సూచికలు అవుతాయి. ఇలాంటి కాలంలో ఆ పరిహాసం ఒకరి నుంచి ఒకరికి సోకుతుంటుంది. మోదీ ప్రభుత్వం విషయంలో ఇది ఆరు నెలల క్రితం మొదలై ఇప్పుడు ఊపందుకుంది. రెండు, ప్రతిపక్షాలు ఎంతగా దెబ్బతిని ఉన్నా, సామాజిక మాధ్యమ యుద్ధ వ్యూహ శాస్త్రం గుట్టును విప్పాయి. కాంగ్రెస్‌ను దాని మిత్రపక్షాలను మట్టి కరిపించడానికి బీజేపీ దాన్ని అద్భుతంగా ఉపయోగించింది. ఆ రంగంలో నేడు పోరాటం ఏక పక్షంగా సాగుతున్నట్టు కనబడటం లేదు.

వాస్తవానికి, ఈ ఎలక్ట్రానిక్‌ యుద్ధంలో బలాల మొగ్గులో మార్పు వస్తోంది. ఆప్‌ ఈ యుద్ధంలో ఎప్పుడూ ఆరితేరినదే. కాంగ్రెస్‌ కూడా దాన్ని నేర్చుకుంది. బలహీనంగానైనా ఇంకా అస్తిత్వంలో ఉన్న వామపక్ష– ఉదార వాదమేధావులు కూడా తమ బలాన్ని అందిస్తున్నారు. కాబట్టి బీజేపీకి ఇప్పుడు పోటీ ఉంది. సామాజిక మాధ్యమాలను అదుపులో ఉంచుకుని బీజేపీ గత ఎన్నికల్లో గొప్ప అనుకూలతను సాధించింది. ఆ నియంత్రణ నేడు క్షీణిస్తోంది. ఈ వారం ప్రధాని తన అత్యుత్తమ అనర్గళోపాన్యాసంతో ముంద డుగు వేశారు. ఈ రంగంలో ఆయనకు ఎదురే లేదు. కానీ అదే సరిపోదు. పార్టీని ఎన్నికలు గెలిచే యంత్రంగా తయారు చేయడం కోసం ఈ మూడే ళ్లుగా ఆయన చాలా ఎక్కువ శక్తిని వెచ్చించారు.

పరిపాలనపట్ల మరింత ఎక్కువ శ్రద్ధ అవసరమైన ఈ సమయంలోనే ముఖ్యమైన రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రభుత్వం క్షీణిస్తున్న తన విజయాల ఉరవడిని పునరు ద్ధరించుకోలేకపోతే, దిగువకు జారిపోయే ప్రమాదం ఉంది. అందుకు సందే శాన్ని మార్చడం మాత్రమే సరిపోదు. తమ సమ్మోహన శక్తిని తిరిగి సంపా దించుకోడానికి మోదీ ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన ఆర్థిక గణాంకా లను చూపడం అవసరం. యూపీఏ కాలపు వాటిని కాదు, తమ పాలనలోని గణాంకాలను చూపాలి.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top