నదుల అనుసంధానం ఎవరికోసం?

Ramalinga Reddy Writes on River Inter linking - Sakshi

అభిప్రాయం
నా చిన్నతనంలో కూడెళ్లి వాగు పొంగితే జాతరకు పోయినట్టు పోయి చూసి సంబురపడేటోళ్లు. కానీ ఆ నీళ్లు ఎటుపో తున్నయో మాకు సోయి లేకుండే. నీళ్లన్నీ అప్పర్‌మానేరు మీదుగా గోదావరిలో కలిసేవి. తెలంగాణ ఉద్యమ నేపధ్యం నీళ్ల గోసను విడమరిచి చెప్పింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. నీళ్లుంటేనే పల్లె పచ్చగా ఉంటుంది. నీళ్ల విలువేంటో తెలిసిన సీఎం కేసీఆర్‌.. వెళ్లిపోయిన కూడెళ్లి నీళ్లనే కాదు. గోదావరి నీళ్లనే మలుపుకొచ్చి తెలంగాణ రైతుల పాదాలు కడగాలని సంకల్పించారు. బడ్జెట్‌లో ఏటా 25 వేల కోట్ల నిధులను ప్రాజెక్టులకు కేటాయించి కోటి ఎకరాల మాగాణికి జీవం పోసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గోదావరిలో మనకొచ్చే 954 టీఎంసీల వాటాలో ఒక్క చుక్క వృథాగా పోకుండా జల ప్రాజెక్టులకు రూపం ఇచ్చారు. ఇప్పుడు నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను బలవంతంగా తీసుకుపోయి కృష్ణా, కావేరిలోకి మళ్లించి దిగువ రాష్ట్రాల్లో ఓట్ల సాగుకు మోదీ సర్కారు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణకు రావలసిన జలాలను కేటాయించడంలో మొద టినుంచి అన్యాయమే జరుగుతూ వచ్చింది. కనీసం ఉన్న గోదావరి జలాలనైనా పోతం చేసుకుందామంటే మోదీ ప్రభుత్వం తెర మీదకు తెచ్చిన నదుల అనుసంధానంతో మళ్లీ తెలంగాణను ఎండబెట్టేటట్టే కనబడుతోంది. మహానదిని గోదావరితో కలిపి, గోదావరిని కృష్ణానది మీదుగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కావేరి నదికి అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉండగా నిర్మించిన ప్రాజె క్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్ధ్యం కలిపి 684 టీఎం సీల జలాలే వాడుకుంటున్నారని, మిగిలిన 270 టీఎంసీల నీళ్లు మిగులు జలాలే అని కేంద్రం చెప్తోంది. ఇవి అన్యాయమైన లెక్కలు అని జలరంగ నిపుణులు దివంగత విద్యాసాగర్‌రావు బతికి ఉన్నంత కాలం నెత్తీనోరు బాదుకున్నారు.

ఇప్పుడు గోదావరి మీద కాళేశ్వరం, కంతనపల్లి, తుపాకుల గూడెం, దుమ్ముగూడెం, దేవాదుల ప్రాజెక్టులు రూపం పోసుకుం టున్నాయి. ఏ నది జలాలనైనా మరో 30 ఏళ్ల  నాటికి పెరగనున్న జనాభా, వారికి అవసరమైన నీటి పరిమాణాన్ని నిర్ధారించి లెక్క గట్టాలి. ఆ తరువాతే మిగులు జలాలను గుర్తించాలి. కానీ  కేంద్రం చెప్పే లెక్కలు 20 ఏళ్ల కిందట 75 శాతం నీటి లభ్యతతో తీసిన లెక్కలు చెప్తోంది. ఆ లెక్కలు ఇప్పటి నీటి లభ్యతతో ఎలా సరి పోలుతాయి? నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు మనకు అవసరపడతాయి. రాష్ట్రాల అభ్యర్ధనలను పరిగణనలోకి తీసు కోకుండా మొండిగా నదులను అనుసంధానం చేసి తెలంగాణ మాగాణాన్ని ఎండబెట్టి  గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు  పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు.

పశ్చిమ కనుమల్లో  వర్ష ప్రభావం ఎక్కువ. అంతా గుట్టలు, లోయలతో కూడిన ప్రాంతం కాబట్టి వ్యవసాయ భూమి, నివాస ప్రాంతాలు కూడా తక్కువే. ఏటా వందల కోట్ల క్యూసెక్కుల జల రాశులు వచ్చి చేరుతున్నాయి. ఇందులో 90 శాతం నీళ్లు పశ్చి మంగా ప్రవహించి వృథాగా అరేబియా మహా సముద్రంలో కలు స్తున్నాయి. వీటిలో పావు వంతు నీళ్లను ఒడిసి పట్టుకుని, వాటిని తూర్పు దిశగా తీసుకొచ్చి మహానదిలోకి మళ్లిస్తే ఆ జలాలు గోదా వరి, కృష్ణాల మీదుగా కావేరి నదిని తడుతాయి. అప్పుడు నాలుగు నదులు ఏమిటీ? దక్షిణ భారతంలోని నదులన్నిటినీ అనుసం ధానం చేయవచ్చు. మోదీ అటు దిశగా ఆలోచన చేయకుండా గోదావరిని కృష్ణా, కావేరితో అనుసంధానం చేస్తానంటే మాత్రం తెలంగాణ ప్రజలు మరో మహా ఉద్యమానికి సిద్ధపడతారు.

వ్యాసకర్త దుబ్బాక శాసనసభ్యులు ‘ 94403 80141
సోలిపేట రామలింగారెడ్డి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top