పాత్రికేయ వృత్తిలో శిఖర సమానుడు | Sakshi
Sakshi News home page

పాత్రికేయ వృత్తిలో శిఖర సమానుడు

Published Wed, Feb 20 2019 12:21 AM

Pendyala vaman Rao Is Legendary Journalist - Sakshi

జర్నలిజాన్ని కేవలం వృత్తిగా కాకుండా ఒక పవిత్ర కర్తవ్యంగా భావిం చిన అరుదైన పాత్రికేయుల్లో పెండ్యాల వామన్‌ రావు ఒకరు. వార్తలను నివేదించడంలో సమగ్రత, అంకితభావం, వస్తుగత తత్వం అనేవి కథనాలకు విశ్వసనీయతను తెచ్చిపెడతాయి. జర్నలిజంకి సంబంధించిన ఈ ప్రాథమిక లక్షణాల తోటే ఆయన కేఎమ్‌ మున్షీ, స్వామి రామానంద తీర్థ, పీవీ నరసింహారావు, పలువురు ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల గౌరవాన్ని, విశ్వాసాన్ని పొందారు. ఇలాంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు నెరిపినందువల్లే కావచ్చు.. తన 70 సంవత్సరాల వృత్తి జీవి తంలో కళ్లారా చూసిన చారిత్రక ఘటనలకు ఆయన అత్యంత వస్తుగతమైన, నిజాయితీతో కూడిన చిత్రణను అందిస్తూ వచ్చారు. హైదరాబాద్‌లో పోలీస్‌ చర్య, నిజాం పతనం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావం, రాజ్యాధికార విరామకాలంలో జరిగిన రెండు హింసాత్మక ఆందోళనలు వంటివి ఆయన నివేదించిన కీలక ఘట్టాలు. 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీసు చర్య కాలంలో దక్కన్‌ చరిత్రలో సంభవించిన ఒక కీలక అధ్యాయం గురించి ప్రస్తుత తరం జర్నలిస్టులకు తెలిసింది చాలా తక్కువ. మేధావులు, రాజకీయ నేతలు ఆ ఘటనను తమ తమ దృక్పథాలకు అనుగుణంగా విమోచన అనీ, స్వాధీనపర్చుకోవడం అనీ, దురాక్రమణ అనీ వ్యాఖ్యానించవచ్చు. కానీ వామనరావు హిందూ పత్రిక కరస్పాండెంట్‌గా ఆ సంక్షుభిత కాలంలో నిష్పాక్షిక కథనాలను సమర్పించారు.

పాత్రికేయుల జీవితం కష్టాలతో కూడినది. ప్రభుత్వ లేక నిజాం అనుకూల జర్నలిస్టులు వార్తాపత్రికల్లో లేక ప్రెస్‌ కాన్ఫరెన్సుల్లో కనీసపాటి విమర్శను కూడా సహించేవారు కాదు. ఆ రోజుల్లో పత్రికాప్రపంచం గట్టి నిఘాలో ఉండేది. ప్రెస్‌ కాన్ఫరెన్సుల్లో నిజాంకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రశ్న సంధించినా, నిజాం విశ్వసనీయ బ్రిగేడ్‌ నుంచి తీవ్రమైన హెచ్చరికలకు, మందలింపులకు గురికావలసి వచ్చేది. ప్రభుత్వం నుంచి ఎంతో కొంత గౌరవాన్ని అందుకుంటూ ఉన్న ది హిందూ పత్రికను సైతం ప్రతి రోజూ స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు చదివి, అనుమతించిన తర్వాత మాత్రమే ప్రచురణకు, పంపిణీకి పంపే పరిస్థితి ఉండేదని వామన్‌రావు చెప్పేవారు. తమకు వ్యతిరేకంగా రాస్తున్న జర్నలిస్టులతో ప్రభుత్వం నేరుగా వ్యవహరించేది కాదు. ఆ పనిని పోలీ సులు సంఘవ్యతిరేక శక్తులకు బదలాయించేవారు. తర్వాత వారు అలాంటి జర్నలిస్టులను చితకబాదేవారు. నిఖార్సైన కాంగ్రెస్‌ వాదిగా ఉండి గవర్నర్‌గా మారిన మీర్‌ అక్బర్‌ ఆలీ, ఆనాడు కైరోలో భారత రాయబారిగా ఉండిన సయ్యద్‌ హుస్సేన్, సీనియర్‌ పాత్రికేయులు ఎల్డీ నటరాజన్‌ వంటివారు వీరి ఆగ్ర హజ్వాలల్ని చవిచూశారు కూడా. 

బంజారాహిల్స్‌లో ఉన్న ఆయన నివాసం రాక్‌ హౌస్‌ని నిత్యం సందర్శించే వాడిని. చారిత్రక ఉపాఖ్యానాలను, ఘటనల సారాంశాన్ని వివరించే అగ్రశ్రేణి కథకుడిగా వామన్‌రావు నాకు కనిపించేవారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. తన సైన్యం లొంగుబాటు గురించి హైదరాబాద్‌లోని భారత ఏజెంట్‌ జనరల్‌ కేఎమ్‌ మున్షీతో దక్కన్‌ రేడియోలో ఉమ్మడి ప్రసారంలో నిజాం ప్రకటించిన ఘట్టాన్ని వివరిస్తూ, నిజాం ఆ సందర్భంలో ఆందోళనా స్వరంతో కేఎంజీ, మున్షీజీ అంటూ తొట్రుపాటు పడటాన్ని కూడా వామన్‌రావు నమోదు చేశారు. కొన్ని సందర్భాల్లో అయితే కేఎమ్‌ మున్షీ వామన్‌రావును వార్తలు సకాలంలో పంపించడానికి తన కారులో స్వయంగా తీసుకెళ్లేవారు. భోజనానికి ఆహ్వానించేవారు. తన పరిచయస్తుల నుంచి వామన్‌రావు సాధించిన విశ్వాస స్థాయి అలాంటిది. వామన్‌రావుకు హన్మకొండలో పీవీ నరసింహారావు సీనియర్‌గా ఉండేవారని చాలామందికి తెలీదు. బిర్లాల ప్రతినిధిగా వ్యవహరిస్తూ, నౌబత్‌ పహాడ్‌పై బిర్లా మందిర్‌ నిర్మాణంలో ఆయన అందించిన తోడ్పాటు కూడా చాలా కొద్దిమందికే తెలుసు. వృత్తి జీవితంలో అనేకమంది జర్నలిస్టులు ఆయన సహాయాన్ని, ఔదార్యాన్ని పొందినవారే. వామన్‌రావు నా స్నేహితుడు, ఫిలాసఫర్, మార్గదర్శకుడు కూడా. ఆయన తోడ్పాటు వల్లే పదవీ విరమణ తర్వాత ఎన్నో రచనలు చేయగలిగాను. ఆయన నా బంధువే కానీ, అంతకంటే మించి మా మధ్య 50 సంవత్సరాలపాటు వృత్తిగత బాంధవ్యం కొనసాగింది. పెద్దాయన కనుమరుగైన తర్వాత కూడా ఆయన బాటలో నేను నడుస్తూనే ఉంటాను.

వ్యాసకర్త ది హిందూ మాజీ డిప్యూటీ ఎడిటర్‌/బ్యూరో చీఫ్, హైదరాబాద్‌
దాసు కేశవరావు 

Advertisement
Advertisement