శరద్‌ పవార్‌ (ఎన్‌సీపి).. రాయని డైరీ

NCP Chief Sharad Pawar Rayani Diary By Madhav Singaraju - Sakshi

మాధవ్‌ శింగరాజు

ఇంట్లోంచి బయటికి వెళుతుంటే బయటి నుంచి ఇంట్లోకి వస్తూ కనిపించాడు ముంబై పోలీస్‌ కమిషనర్‌.
‘‘సంజయ్‌ బార్వే!’’ అన్నాను.
అవునన్నట్లుగా తల ఊపి, ‘‘పవార్‌జీ మీరు నన్ను సంజయ్‌ బార్వేగా గుర్తించడం అన్నది ఈ మధ్యాహ్నం నాకెంతో సంతోషాన్నిచ్చిన విషయంగా నాకెప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నాడు. 

‘‘చెప్పు బార్వే.. ఇంట్లోంచి నేను పూర్తిగా బయటికి వచ్చాక నన్ను అరెస్ట్‌ చేస్తావా? నేనింకా ఇంట్లోనే ఉండగానే నువ్వే ఇంటి లోపలికి వచ్చి నన్ను అరెస్టు చేస్తావా? ఏది గొప్పగా ఉంటుంది నీకు, మీ డిపార్ట్‌మెంట్‌కీ?’’ అని అడిగాను. 
పెద్దగా నవ్వాడు బార్వే. 

‘‘పవార్‌జీ.. నేనిప్పుడు లోపలికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్‌ చేసినా, మీరు బయటికి వచ్చే వరకు ఆగి అప్పుడు అరెస్ట్‌ చేసినా అది మీకే గొప్ప అవుతుంది కానీ.. నాకు, మా డిపార్ట్‌మెంటుకు గొప్ప అవదు. పవార్‌జీ..  మొదట మీకొక విషయం చెప్పడానికి మీరు నన్ను అనుమతించాలి.  నేను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చాను. ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ నుంచి కాదు’’ అన్నాడు.

నవ్వాను. ‘‘అయితే చెప్పు బార్వే, మహారాష్ట్ర ఎన్నికలయ్యే వరకు మహారాష్ట్రలోని ఏ ఒక్క ప్రాంతానికీ నేను కదిలే వీలు లేకుండా చేసే ఆలోచన ఏదైనా మీ ముఖ్యమంత్రి మనసులో ఉండి, ఆ ఆలోచనను చక్కగా అమలు పరిచే విషయమై 
నా సహకారాన్ని కోరేందుకు వచ్చావా?’’ అని అడిగాను. 

‘‘మిమ్మల్ని కదలకుండా చెయ్యడానికో, మిమ్మల్ని కదలకుండా చేసేందుకు ఏవైనా ఐడియాలుంటే చెప్పమని మిమ్మల్నే అడగడానికో నేనిప్పుడు రాలేదు పవార్‌జీ. మీ చేత ఒట్టు వేయించుకోడానికి వచ్చాను’’ అన్నాడు!
‘‘ఒట్టు దేనికి బార్వే’’ అన్నాను.
‘‘మీకై మీరుగా ఎప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయం మెట్లెక్కి వెళ్లి అరెస్ట్‌ కానని నా మీద ఒట్టు వెయ్యాలి పవార్‌జీ’’ అన్నాడు! 

‘‘కానీ.. వాళ్లు నన్ను పిలవాలని అనుకుంటున్నారన్న సంగతి తెలిసి కూడా వాళ్లు నన్ను పిలిచేవరకు నేను ఆగగలనని మీరంతా ఎందుకు అనుకుంటారు బార్వే. నేను బీజేపీ మనిషిని కానంత మాత్రాన నాక్కొన్ని ఎథిక్స్‌ ఉండకూడదా?!’’ అన్నాను.  

‘‘కానీ పవార్‌జీ.. మీరు ఎథిక్స్‌ కోసం అరెస్ట్‌ అయిన మరుక్షణం ముంబై తన ఎథిక్స్‌ అన్నింటినీ వదిలేస్తుంది. ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్‌లో మీ పేరు వినిపించడం కన్నా, ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్‌లో మీరు అరెస్ట్‌ అవడం పెద్ద విషయం. వెంటనే శాంతిభద్రతలు దెబ్బతింటాయి. వెంటనే ఈ మహానగరం వెంటిలేటర్‌ మీదకు వెళ్లిపోతుంది’’ అన్నాడు బార్వే. అని ఊరుకోలేదు. ఒట్టు వెయ్యాల్సిందే అన్నట్లు చెయ్యి చాచాడు. 

‘‘బార్వే..  అజిత్‌ పవార్‌ ఎవరో నీకు తెలిసే ఉంటుంది. మా పార్టీ ఎమ్మెల్యే. ఎందుకు రాజీనామా చేశాడో తెలుసా? స్కామ్‌లో తన పేరు ఉన్నందుకు కాదు. నా పేరు కూడా ఉన్నందుకు! అన్న కొడుకు. హర్ట్‌ అవడా మరి. అతడు హర్ట్‌ అవడం అతyì  ఎథిక్‌. నేను అరెస్ట్‌ అవాలనుకోవడం నా ఎథిక్‌’’ అన్నాను ఒట్టేయకుండా. 
వెయ్యాల్సిందే అన్నట్లు నిలుచున్నాడు.   

‘‘అయితే నువ్వూ నాకొక ఒట్టు వెయ్యాలి బార్వే’’ అన్నాను. 
‘‘మీరు ఈ ఒట్టేస్తే నేను ఏ ఒటై్టనా వేస్తాను పవార్‌జీ’’ అన్నాడు. 
‘‘అరెస్ట్‌ అవను అని నేను ఇక్కడ ఒట్టేశాక, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి వెళ్లి ‘అరెస్టు చేయం’ అని నువ్వు అక్కడ ఒట్టేయించు కోకూడదు. అలాగని ఒట్టేయ్‌’’ అన్నాను.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top