ఆశలు రేపుతున్న ఎన్నారై విధానం

Manda Bhim Reddy article on telangana NRI policy - Sakshi

సందర్భం
సొంత గడ్డపై మమకారం ఉన్నప్పటికీ బతుకు కోసం దేశాలు పట్టిన తెలంగాణ వాసుల తీరని వ్యథలకు పరిష్కారం చూపే విధానమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్న ఎన్నారై పాలసీ. తెలంగాణ నుంచి గల్ఫ్‌కు వెళుతున్న వలస కార్మికుల చిరకాల ఆశలు దీంతో ఫలించనున్నాయి.

పనికి తగిన వేతనాలు లేక, సరైన జీవన ప్రమాణాలులేని నివాస సౌకర్యాలు, యజమానుల వేధింపులు, భద్రతలేని పనిప్రదేశాల వలన తరచూ ప్రమాదాలకు గురికావడం, అనారోగ్యం లాంటి సమస్యలను మన గల్ఫ్‌ వలస కార్మికులు తరచూ ప్రస్తావిస్తుంటారు. జైలు పాలయినప్పుడు న్యాయ సహాయంకోసం, చనిపోయినప్పుడు శవపేటికల రవాణాకు రోజులకొలది వేచిచూడడం సర్వసాధారణం. గల్ఫ్‌ దేశాలలో ఏర్పడే సంక్షోభాల ప్రభావం మనదేశ కార్మికలోకంపై పడుతున్నది. కంపెనీలు మూతపడి మూకుమ్మడిగా ఉద్యోగులను తొలగించడం, యుద్ధాలు, దురాక్రమణలు, అంతర్గత సంక్షోభం, గల్ఫ్‌ దేశాల్లో తరచుగా ప్రకటించే ‘ఆమ్నెస్టీ’ (క్షమాభిక్ష) పథకాలు, సౌదీ అరేబియాలో ఉద్యోగాల సౌదీకరణ, చమురు ధరల పతనం, ఇటీవలి ఖతార్‌ వెలి లాంటి సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారి వాటి ప్రభావం నేరుగా మన పల్లెలపై, ప్రవాసీ కుటుంబాలపై కనిపిస్తున్నది. మనవారు ఉద్యోగాలు కోల్పోయి అర్ధంతరంగా ఇంటికి చేరడం లాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి మనవారిని రక్షించడానికి, ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు కలిగి ఉంటే మేలు.

ప్రవాసీల సంక్షేమం, రక్షణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్న ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) కోసం రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా గల్ఫ్‌ వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘తెలంగాణ ప్రవాసుల సంక్షేమం’ పేరిట 2014 లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల క్రమంలో ఎన్నారై శాఖ మంత్రి కె. తారక రామారావు అధ్యక్షతన 27 జులై 2016న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి ఎన్నారై పాలసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని సూచనల ప్రకారం ముసాయిదా పత్రాన్ని తయారుచేసి వివిధ ప్రభుత్వ శాఖలకు పంపి వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించారు. విదేశాలకు వలసవెళ్లే కూలీలు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు, అనుసరించే వైఖరిని ఒక సమగ్రమైన రూపంలో తెలిపేదే ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం).

అల్పాదాయ కార్మికులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రవాస భారతీయుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కొంత ప్రభుత్వం, కొంత వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు తదితరుల నుండి విరాళాలు సేకరించి ఈ నిధికి జమచేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్దిపొందని పేదకార్మికులను ఆదుకోవడానికి, ఎక్స్‌గ్రే షియా చెల్లించడానికి ఈ నిధిని వినియోగిస్తారు. విదేశాల్లో మరణించినవారి శవపేటికలను హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాల వరకు రవాణాకు ఉచిత అంబులెన్సు సౌకర్యం. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్‌మెంట్‌ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు. కేంద్ర ప్రభుత్వ ‘ముద్ర’ పథకంతో అనుసంధానం. గల్ఫ్‌ నుండి వాపస్‌ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన. కొత్తగా వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి మార్జిన్‌ మనీ, రుణ సౌకర్యం కల్పించడం. జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం. హైదరాబాద్‌లో ఎన్నారై భవన్‌ ఏర్పాటు. తెల్ల రేషన్‌ కార్డులు. ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ రుణాలు, గృహనిర్మాణం వంటి పథకాల వర్తింపుకు చర్యలు. 24 గంటల హెల్ప్‌ లైన్‌. విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ కొరకు ‘ప్రవాసి తెలంగాణ’ వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు. ధనవంతులైన ఎన్నారైలు తమ గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహం. సంక్షేమానికి తగిన బడ్జెట్‌ కేటాయింపులు. ప్రవాసీల గణాంకాలు తయారుచేయడం. రాష్ట్ర విదేశీ ఉద్యోగాల కల్పనా సంస్థ ‘తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ను బలోపేతం చేయడం.

ప్రభుత్వ పరంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ముఖ్యమంత్రి చైర్మన్‌గా అత్యున్నత స్థాయి వ్యవస్థ తెలంగాణ ప్రవాస భారతీయుల మండలి ఏర్పాటు చేయనున్నారు. ప్రవాసుల సంక్షేమం గురించి ప్రభుత్వ విధానాలపై అన్ని విధాలా మార్గదర్శనం చేయడం ఈ కౌన్సిల్‌ ముఖ్యమైన విధి. ఎన్నారై శాఖ మంత్రి వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. ప్రవాసి తెలంగాణా సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, నిపుణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు రిజిస్టర్డ్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీల ప్రతినిధులను కూడా సభ్యులుగా చేర్చాలనే సూచనలు ఉన్నాయి. ‘సెంటా’ అంటే.. తెలంగాణా ప్రవాస భారతీయుల వ్యవహారాల కేంద్రం. దీనికి ఎన్నారై మంత్రి ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వ అధికారి అయిన సీఈఓ పరిపాలన అధినేతగా  వ్యవహరిస్తారు. ఈ కేంద్రం ఎన్నారైల సమస్యలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఒక కార్యనిర్వాహక సంస్థగా పనిచేస్తుంది. ‘డి–సెంటా’ అంటే.. తెలంగాణా ప్రవాస భారతీయుల వ్యవహారాల జిల్లా కేంద్రం. దీనికి జిల్లా కలెక్టర్‌ అధినేతగా ఉంటారు. జిల్లా కార్మిక సంక్షేమ అధికారి జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, కార్మిక,  ఉపాధి కల్పన శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు.

ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానికి వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి ‘ప్రవాసి తెలంగాణ దివస్‌’ ను జరుపుతారు. తెలంగాణ ఎన్నారైల సమస్యలను చర్చించడానికి, వారిని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలం దించిన తెలంగాణ ఎన్నారైలకు ‘ఉత్తమ తెలంగాణ ప్రవాసి’ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ పెట్టుబడుల సమావేశం ఏర్పాటు చేస్తుంది.

ఎన్నారై విధానం ప్రకటిస్తే ప్రవాసులకు ఊరట లభిస్తుంది. పలు కారణాలతో గల్ఫ్‌లో మరణించి శవపేటికల్లో ఇంటికి చేరుతున్నవారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసం రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వడం, తిరిగొచ్చినవారి కోసం పునరావాసం, ఏజెంట్ల మోసాలు అరికట్టడం, ప్రవాసుల పేర్లను రేషన్‌ కార్డుల్లో కొనసాగించి పలు సామాజిక పథకాలకు అర్హత పొందేలా చేయడం, నైపుణ్య శిక్షణ, జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్‌లతో కూడిన పథకం అందుబాటులోకి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రవాసులు.


మంద భీంరెడ్డి
వ్యాసకర్త వలస వ్యవహారాల విశ్లేషకులు ‘ 93944 22622

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top