రాజ్‌నాథ్‌ సింగ్‌ (హోమ్‌ మినిస్టర్‌)

Madhav Singaraju Article On Rajnath Singh - Sakshi

రాయని డైరీ

దేశభక్తిని ఎంతైనా గుండె నిండా నింపుకోవచ్చు. దేశ రహస్యాన్ని ఎంతోసేపు గుండెల్లో దాచి ఉంచలేం. శుక్రవారం ముజఫర్‌నగర్‌లో భగత్‌ సింగ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు నాకో వింత అనుభూతి కలిగింది. విగ్రహంలోంచి సర్జికల్‌ స్ట్రయిక్‌ లాంటì  మెరుపేదో నా గుండెల్లోకి ప్రవేశించి, గుండె లోపల ఉన్న రహస్యాన్ని బయటికి తోసేయబోయింది! ఆ మెరుపును కూడా గుండెల్లోనే ఉంచేసుకుని, రహస్యాన్ని బయటికి రాకుండా కాపాడుకోగలిగాను. 
పూలదండ వేసి, భగత్‌ సింగ్‌కి నమస్కరించాను. ఆ కొద్ది క్షణాలూ.. ఆ స్వాతంత్య్ర సమరయోధుడు నన్ను ఆవహించినట్లుగా అనిపించింది. 
అప్పటికీ ఎవరో అన్నారు.. రాజ్‌నాథ్‌ సింగ్, భగత్‌ సింగ్‌లలో ఎవరు ఏ సింగో పోల్చుకోవడం కష్టంగా ఉందని! 
‘‘రాజ్‌నాథ్‌జీ.. ఏదో చెప్పబోయి ఆగినట్లున్నారు’’.. అన్నారెవరో!!
ఏదో చెప్పబోయి ఆగినట్లున్నానని గ్రహించినవారు.. ఏం చెప్పబోయి నేను ఆగిపోయానో కూడా గ్రహించేలా ఉన్నారని గ్రహించి, నేనే కొద్దిగా చెప్పాను. ఆ కొద్దిగా కూడా కొద్ది కొద్దిగా చెప్పాను. 
ఒకటేదో జరిగింది అన్నాను. ఆ జరిగిందేంటో ఇప్పుడే చెప్పలేనన్నాను. చాలా పెద్దదే జరిగింది అన్నాను. నన్ను నమ్మండి అన్నాను. రెండు మూడు రోజుల క్రితం నిజంగా చాలా పెద్దది జరిగింది అన్నాను. నిజంగా జరిగిన ఆ చాలా పెద్దది ఏంటో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది అన్నాను. 
కానీ వాళ్లకి అప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉన్నట్లుంది. నాకూ అప్పటికప్పుడు చెప్పాలనే ఉంది. కానీ ఎలా చెప్పగలను? హోమ్‌ మినిస్టర్‌ దేశభక్తి గుండె లోపలే ఉండిపోవాలి. దేశభక్తిని అరిచేత్తో పెకిలించి ప్రదర్శనకు పెట్టకూడదు.
‘‘చెప్పండి రాజ్‌నాథ్‌జీ, ఏదో చెప్పబోయారు?’’ మళ్లీ ప్రశ్న. 
‘‘నేనేం చెప్పబోయానో అది మీకు చెప్పేశాను. నేను చెప్పబోయేది మీకు త్వరలోనే తెలుస్తుందన్న విషయమే.. మీకు నేను చెప్పబోయిన విషయం’’ అన్నాను. 
అసంతృప్తిగా చూశారు. 
నాకూ అసంతృప్తిగానే అనిపించింది. చెప్పీచెప్పకుండా చెప్పడం, అసలే చెప్పకపోవడం రెండూ ఒకటే! ఒక క్లూ ఇచ్చాను. ‘‘సెప్టెంబర్‌ 29 కి రెండేళ్లవుతుంది’’ అన్నాను. ఆ క్లూ సరిపోయినట్లు లేదు. ‘‘దేనికి రెండేళ్లవుతుంది రాజ్‌నాథ్‌జీ’’ అన్నారు! 
సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగి రెండేళ్లవుతోంది అని నేను వారితో చెప్పొచ్చు. కానీ అది బాగుండదు. దేశ ప్రజలకు గుర్తుండవలసిన ఒక దేశభక్త ఘటన.. దేశప్రజలకు గుర్తు చేయవలసిన ఒక దేశభక్త ఘటన ఎప్పటికీ కాకూడదు.  
‘‘దేనికి రెండేళ్లవుతుందో నేను చెప్పవలసిన విషయం కాదు. అయితే రెండు రోజుల క్రితం నేను మన సరిహద్దు సైనికులకు ఏం చెప్పానో అది మీకు చెప్తాను’’ అన్నాను. 
‘‘వాళ్లకు మీరేం చెప్పారో తెలిస్తే, మీరు మాకేం చెప్పబోయారో తెలుస్తుందా రాజ్‌నాథ్‌జీ’’ అన్నారు! తెలుస్తుందనీ, తెలియదనీ నేనేం చెప్పలేదు. అది కూడా వాళ్లకై వాళ్లు తెలుసుకోవలసిన విషయమే. 
రెండు రోజుల క్రితం సరిహద్దు సైనికులకు నేనొక మాట చెప్పాను. ‘‘పాకిస్తాన్‌పై మొదట మీరు ఫైరింగ్‌ జరపకండి. ఎందుకంటే పాకిస్తాన్‌ మన పొరుగు దేశం. అయితే వారు ఫైరింగ్‌ మొదలు పెడితే మాత్రం మీరు మీ బులెట్‌లను లెక్కచూసుకోకండి’’ అని చెప్పాను. 
ఆ విషయమే వీళ్లకు చెప్పి ముజఫర్‌నగర్‌ నుంచి వచ్చేశాను. 
దేశభక్తి గురించి అంతకుమించి అధికారికంగా చెప్పకూడదు.
మాధవ్‌ శింగరాజు
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top