పెద్దల చదువుల మర్మమేమి?

Madabhushi Sridhar Writes Guest Column On Controversy About Degree of Ramesh Pokhriyal - Sakshi

విశ్లేషణ

డాక్టర్‌ రమేష్‌  పోక్రియాల్‌ నిషాంక్‌ మన విద్యా శాఖ మంత్రి, కవి, సాహితీవేత్త. హిందీలో పేరెన్నికగన్న రచయిత. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మోదీ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కొలంబోలో ఉన్న ఒక అంతర్జాతీయ ఓపెన్‌ యూనివర్సిటీ ఆయనగారికి సాహిత్యంలో విశిష్టమైన సేవలందించారని ఒక డాక్టరేట్, అంతకుముందు శాస్త్రీయరంగంలో రచనలకు మరొక డాక్టరేట్‌ ఇచ్చింది. 

గ్రాఫిక్‌ ఎరా యూనివర్సిటీ ఒకటి,  ఉత్తరాఖండ్‌ సంస్కృత విశ్వవిద్యాలయం మరొక గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశాయి. అయితే విచిత్రమేమంటే శ్రీలంకలో అంతర్జాతీయ ఓపెన్‌ యూనివర్సిటీకి అసలు యూనివర్సిటీగా గుర్తింపు లేదు. శ్రీలంకలోని యూజీసీ కూడా దాన్ని గుర్తించలేదు. ఇతరదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకు యూజీసీ గుర్తింపు లేకపోతే మన యూజీసీ కూడా అంగీకరించదు. వారిచ్చే డిగ్రీలకు విలువ ఇవ్వదు.  అంతేకాదు. మన దేశంలో సిఎస్‌ఐఆర్‌ (సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసర్చ్‌ సెంటర్‌) 1998లో దేశంలోని అన్ని జాతీయ ప్రయోగశాలలకు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. 

ఈ శ్రీలంక విశ్వవిద్యాలయం ఇచ్చే డిఎస్సీ డిగ్రీలను గానీ, మరే ఇతర డిగ్రీలను గానీ యూజీసీ గుర్తించలేదని, కనుక ఆ డిగ్రీలు చెల్లవని చాలా స్పష్టంగా పేర్కొంది. ఇటువంటి అద్భుతమైన సంస్థ ఇచ్చిన డిగ్రీలను వాడుకోవడం, పేరు ముందు డాక్టర్‌ అని తగిలించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోగా, ఇచ్చిన యూనివర్సిటీ వారు తాము భారతదేశంలో ఉన్న ఒక పెద్ద ముఖ్యమంత్రిగారికి గౌరవప్రదమైన డాక్టరేట్‌ డిగ్రీ ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడమే కాకుండా, తమ అత్యున్నత ప్రమాణాలకు దీన్ని కొలమానంగా చూపుతూ ఫోటోగ్రాఫులకు విపరీతంగా ప్రచారం ఇచ్చి, మరికొంత మంది అమాయకులను వలలోవేసుకుంటాయి. పోక్రియాల్‌ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన పేరును డాక్టర్‌ రమేష్‌ పోక్రియాల్‌ అని చెప్పుకుంటూ ప్రమాణం చేశారు. 

డాక్టర్‌ రమేష్‌ గారి ప్రత్యర్థి అయిన మనోజ్‌ వర్మ డాక్టర్‌ అనే బిరుదును వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, కనుక ఆయన మంత్రి పదవి ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి విన్నవించుకున్నారు.  ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణ పత్రంలో తాను డాక్టర్‌నని చెప్పుకోవడం చెల్లదని, అందువల్ల ఆయన ఎన్నిక కూడా చెల్లదని మనోజ్‌ వర్మ వాదించారు. ఈ మనోజ్‌ వర్మ కాంగ్రెస్‌ నాయకుడు కాదు. కమ్యూనిస్టు అంతకన్నా కాదు. స్వయంగా ఆయన కూడా బీజేపీ నాయకుడే. ఒక ఎన్నికను రాష్ట్రపతి ఈ విధంగా రద్దు చేయడానికి ప్రకటనలు చేసే అధికా రం ఉండకపోవచ్చు. 

డాక్టర్‌ పోక్రియాల్‌కి ఇచ్చిన బీఏ ఎంఏ డిగ్రీలు కూడా అనుమానించతగినవే అని వాదిస్తూ రాజేశ్‌ మధుకాంత్‌ అనే పౌరుడు ఒకాయన, ఆ డిగ్రీలు, ఎప్పుడు ఇచ్చారో, ఇచ్చిన విశ్వవిద్యాలయాల ప్రమాణాలేమిటో తెలపాలని ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. విశ్వవిద్యాలయం వారు ఇవ్వను పొమ్మన్నారు. మొదట జనసూచన అధికారి, ఆ తరువాత మొదటి అప్పీలు అధికారి కూడా సమాచారం ఇవ్వలేదు. విధిలేక కేంద్ర సమాచార కమిషన్‌ ముందుకు రెండో అప్పీల్‌కు వెళ్లవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం వారు ఈ డిగ్రీల సమాచారం మూడో వ్యక్తి సమాచారం అవుతుందని కనుక దాన్ని ఇవ్వజాలమని వివరించారు. సమాచార కమిషన్‌ ముందుకూడా ఇది థర్డ్‌ పార్టీ సమాచారమని వాదించారు.  

సమాచార హక్కు చట్టం కింద మూడో వ్యక్తి సమాచారం అడగడానికి వీల్లేదని కొందరు వాదిస్తుంటారు. కాని చట్టంలో చెప్పేదేమంటే ఒకవేళ జనసమాచార అధికారి ఆ సమాచారం మూడో వ్యక్తి ఇచ్చినదైతే ఆ మూడో వ్యక్తిని సంప్రదించి మీరు ఇచ్చిన సమాచారం పత్రాలు కావాలని అడుగుతున్నారని దీనిపై మీ అభిప్రాయం ఏమి టని అడగవలసి ఉంటుంది. సెక్షన్‌ 11(1) కింద మూడో వ్యక్తిని సంప్రదించి ఆయన వద్దన్నప్పటికీ, ప్రజాశ్రేయస్సుకోసం అవసరం అనుకుంటే సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది.  సామాన్యుల డిగ్రీ వివరాలు అడిగిన వారికల్లా ఇచ్చే విశ్వవిద్యాలయాలు, రాజకీయ నాయకుల డిగ్రీ వివరాలు మాత్రం దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాయి. దీంతో ఈ పెద్దల చదువులు నిజమైనవి కాదేమో అని అనుమానం వస్తుంది. ఏమంటారు డాక్టర్‌ పోక్రియాల్‌ గారూ?


వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌,
బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top