రాజ్యాంగేతర పాలన పోవాల్సిందే!

Katti Padma Rao Article On Union Government Financial Policies - Sakshi

అభిప్రాయం

భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం లోకి వచ్చిన బీజేపీ, క్రమంగా విశ్వ హిందూ పరిషత్, ఆరెస్సెస్, భజ రంగ్‌దళ్‌ తదితర సంస్థల ద్వారా ఉన్మాద చర్యలను రెచ్చగొట్టి, లౌకికవాద పునాదుల నుంచి తప్పు కున్న కారణంగానే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో  ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో చావుదెబ్బ తిన్నది. రాజ్యాంగం మీద విశ్వాసం లేని నరేంద్రమోదీ రాజ్యాంగేతర శక్తిగా మారారు. మనుస్మృతిలో వున్న భావజాలాన్ని నమ్మి విశ్వ విద్యాలయాల్లో దళితుల విద్యను ధ్వంసం చేయ డానికి పూనుకున్నారు. హేతువాదుల గొంతునొక్కి, మైనార్టీల హక్కులను కాలరాశారు. ప్రపంచం మొత్తం విజ్ఞానం వైపు పరుగులు తీస్తుంటే భారత్‌ మౌఢ్యంలో ఇరుక్కోవడానికి మోదీనే కారణం. 

ఒక వైపు ప్రపంచ విజ్ఞాన శాస్త్రం, వైద్య శాస్త్రం, మనిషి ఆయుప్రమాణాన్ని పెంచుతుంటే ఆరెస్సెస్‌. బీజేపీలు మంత్ర తంత్ర వ్యవస్థను విస్తరింపజేసి పూజలు, యాగాలు, యజ్ఞాలు, అభిషేకాలు ఫలాల నిస్తాయని వైద్యశాలలు, శస్త్రచికిత్సలు, వైద్య పరిశో ధనలు, భారతీయ వైద్య శాస్త్రానికి భిన్నమైనవని ప్రచారం చేస్తూ ప్రజల్ని యోగులకు, బాబాలకు, స్వాములకు బానిసలు చేస్తూ వెళ్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ వెళ్తు న్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే దేశంలో విద్య కోసం, విజ్ఞానం కోసం, చట్టరక్షణ కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఇక ఈ వ్యవస్థ లన్నీ వ్యర్థం, కోడిగుడ్డు పస్తీ వేసి దొంగల్ని పట్టు కుంటాము అంటే రాజ్యాంగానికి అర్థమేముంది? 

మరోవైపున ఆర్థిక వ్యవస్థ కుదేలు అవ్వడానికి మోదీయే కారణం. దేశంలో ఆర్థిక పతనం పెరిగి పోయింది. రూపాయికి విలువ పోయాక ప్రపంచ స్థాయిలో మన దేశం ఎక్కడుంటుందని ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మనదేశంలో ప్రమాద కర సన్నివేశం ఆవిష్కృతమవుతోంది. రూపాయి విలువ రోజురోజుకూ దిగజారుతోంది. అవినీతి లేని దేశాల్లో ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతు న్నారు. వీరికితోడు బ్యాంకులకు డబ్బు ఎగవేసే పెట్టుబడి దారుల సంఖ్య పెరిగింది. 

రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసినప్పుడు ఒక్కసారిగా ప్రజలు విలవిలలాడారు. అప్పుడు కూడా ఆయన బాధపడలేదు, సమర్ధించుకున్నాడు. కూరగాయలు అమ్మేవాళ్ళు, చిన్న చిన్న కొట్లవాళ్ళు, రోజు కూలీలు, వృద్ధులు ఒక సందర్భంలో టీ నీళ్ళు లేక, తింటానికి అన్నం లేక పస్తులున్నారు. అయినా మోదీ బాధపడలేదు. ఇదంతా వారి కర్మ అనుకునే స్వభావం ఆయనది. మోదీలో ఈ నాలుగున్నర ఏళ్లలో ఎక్కడా మానవతా స్ఫూర్తి కనపడలేదు. స్త్రీలపై కనికరం కనబడలేదు. ఢిల్లీ నడిబొడ్డులో స్త్రీలు మానభంగాలకు గురయ్యారు. ఎన్నో పవిత్ర హత్యలు కులం పేరుతో జరిగాయి. నాయకులకు నీతి నిజాయితీ లోపించాయి. తాగుబోతులుగా, వ్యభిచారులుగా, జూదగాళ్ళుగా, దోపిడీదారులుగా రాజకీయ నాయకులు మారారు. ఇటువంటి శక్తుల న్నింటిని అమిత్‌షా, మోదీ ప్రోత్సహిస్తూ వచ్చారు.  

కాన్షీరావ్‌ు కాంగ్రెస్‌ను బ్రాహ్మణవాద పార్టీలో మొదటిదని, బీజేపీని బ్రాహ్మణవాద పార్టీలో రెండ వదని చెబుతూ ఉండేవారు. దళితులు, బహుజ నులు ఓటు శక్తిని తెలుసుకోవాలి. ఓటును అమ్ముకో వడం అంటే గుండెను అమ్ముకోవడమన్నంత చైత న్యం రావాలి. దళితులకు అంబేడ్కర్‌ ఇచ్చిన బంగారు కానుక ఓటు. దాన్ని కేవలం మందుకు, మాయమాటలకు, డబ్బుకు అమ్ముకోవడం దళి తుల వెనుకబాటుతనానికి నిదర్శనం. దళిత బహు జనులు తమ ఓటు తాము నిజాయితీగా వేసుకున్న రోజున వారికి సంపదలో భాగస్వామ్యం వస్తుంది. అంబేడ్కర్‌ బానిసత్వాన్ని వదిలించుకొనే శక్తి నీకే రావాలని బోధించాడు. ఇతరులు మీకు బానిస త్వాన్ని నేర్పుతారు. బానిసత్వాన్ని వదిలించరు. బానిసత్వం అనేది ఒక వ్యసనం. అలసత్వం అనేది ఒక వ్యాధి. ఈ రెండింటి నుంచి దళితులు బయ టపడాలి.

అంబేడ్కర్‌ ఎంతో పోరాడి తెచ్చిన ఓటును వివేచనా రహితంగా అమ్ముకోవడం వల్ల భార తదేశంలో రాజకీయ పరిణామం ఆలస్యమైపో తుంది. అందుకే మహాత్మాఫూలే, అంబేడ్కర్‌ భావ జాలంతో కూడిన రాజ్యాధికార శక్తులు ముందుకు రావాలి. వామపక్షాలు వీరితో చేతులు కలపాలి. ఏది ఏమైనా చరిత్రలో మార్పు అనివార్యం. ప్రజలు ఆలోచిస్తున్నారనడానికి మోదీ తిరోగమనమే నిద ర్శనం.

వ్యాసకర్త : 
డా‘‘ కత్తి పద్మారావు,  సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు‘ 98497 41695

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top