హింసాత్మక భాషావరణం!

K Ramachandra Murthy Article On Early Election In Telangana - Sakshi

త్రికాలమ్‌  

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల నగారా మోగనే మోగింది. పోలింగ్‌ డిసెంబర్‌ 7న జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీని  రద్దు చేయాలని సెప్టెంబర్‌ మొదటివారంలో సిఫార్సు చేసినప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) పోలింగ్‌ నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో జరుగుతుందని అంచనా వేసుకున్నారు. ఓటర్ల జాబితాలో లక్షల పేర్లు గల్లంతైనాయంటూ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ చివరకు హైకోర్టులో విచారణకు రావడం, అక్టోబర్‌ 8వ తేదీన సమా ధానం చెప్పాలనీ, సవరించిన జాబితా సమర్పించాలనీ హైకోర్టు ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ ఆదేశాలు ఇవ్వడంతో ఓటర్ల జాబితా ప్రకటన తేదీని అక్టోబర్‌ 8 నుంచి అక్టోబర్‌ 12కు వాయిదా వేశారు. ఈ కారణంగానే పోలింగ్‌ తేదీ అధికార పార్టీ ఊహించిన దానికంటే మూడు వారాలు వెనక్కు పోయింది. ఆ మేరకు కేసీఆర్‌ లెక్క తప్పింది. కాంగ్రెస్‌కు ఊపిరిపీల్చుకునే వ్యవధి దొరికింది. ఏ లక్ష్యంతో ముందస్తు ఎన్నికల ఎత్తుగడ కేసీఆర్‌ వేశారో అది కొంతమేరకు దెబ్బతిన్నది. 

పరుష పదజాలం
ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. నెల రోజుల కిందటే 105మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కేసీఆర్‌ ప్రకటించారు. ఆ వెంటనే పెద్ద బహిరంగసభ నిర్వహించారు. కొద్ది విరామం అనంతరం నిజా మాబాద్‌ సభతో ప్రచారం పునరారంభించారు.  ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మహాకూటమి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మినహా తక్కిన పార్టీలను ఒకే తాటిమీదికి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో బద్ధశత్రువుగా భావించవలసిన టీడీపీతో సైతం పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఇంతవరకూ జరిగిన ఎన్నికల ప్రచార సభలలో కేసీఆర్‌ మాట్లాడిన తీరు గమనించినవారికి తెలం గాణలో ఎన్నికల పోరాటం ఆయనకూ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడికీ మధ్య జరుగుతున్నదనే అభిప్రాయం కలుగుతుంది. మొదటి రెండు సభలలో చేసిన ప్రసంగాలలో కొంత నిగ్రహం ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత జరిగిన సభలలో కేసీఆర్‌ నిప్పులు కురిపించారు.

భావంలో స్పష్టత, భాషలో కాఠిన్యం కేసీఆర్‌ ప్రత్యేకత. అంత తీవ్రంగా మాట్లాడకుండానే చెప్పదలచింది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగల నేర్పు కేసీఆర్‌కు ఉన్నది. ఓర్పు లేదు. ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నప్పుడు ప్రయోగించిన పరుష పద జాలం తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న తొలి ఎన్నికలలో ముఖ్య మంత్రి నోట వినిన విజ్ఞులు విస్తుపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సైతం అంతే పదునైన భాషలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు కొందరు కేసీఆర్‌పైన ఆయన శైలిలోనే దాడి చేశారు. రేవంత్‌రెడ్డి సంగతి చెప్ప నక్కరలేదు.  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ కూడా తక్కువ తినలేదు. ఆమె కూడా ప్రత్యర్థులను దుర్భాషలాడారు. కేసీఆర్‌కి ఉన్న వాగ్ధాటి చంద్రబాబుకి లేదు. ఆ కొరతను ఎత్తుగడలతో, వ్యూహరచనతో, తిమ్మిని బమ్మిని చేయడం, మసిపూసి మారేడుకాయ చేసే నైపుణ్యంతో భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాలలో ఫలానా ప్రాజెక్టు కట్టానని కానీ ఫలానా పరిశ్రమ తెచ్చాన ని కానీ, ఫలానా వాగ్దానం నెరవేర్చాన ని కానీ చెప్పి ప్రజలను మెప్పించే అవకాశం చంద్రబాబునాయుడికి లేదు. అరచేతిలో స్వర్గం చూపించడంలోనే పుణ్యకాలం గడిచిపోయింది. బీజే పీతో నాలుగేళ్ళు సహజీవనం చేసి సాధించింది పూజ్యం. అనవసరమైన విదేశీ యానాలూ, అస్మదీయులకూ, బినామీలకూ అక్రమంగా దోచిపెట్టారనే ఆరోప ణలూ, అవధులు లేని దుబారా, హద్దు మీరిన ఆర్భాటం, అంతులేని స్వోత్కర్ష (నేను సీజన్డ్‌ పొలిటీషియన్‌ని, సీనియర్‌మోస్ట్‌ స్టేట్స్‌మన్‌ని, మోదీ కంటే సీనియర్ని) మినహా చెప్పడానికి చేసిన మంచిపని ఏమీ లేదు. సాధించిన ఘన కార్యాలు చూపించి ఓట్లు అడిగే అవకాశం లేదు కనుక బీజేపీనీ, నరేంద్రమోదీనీ ఆంధ్రులకు పరమశత్రువులుగా అభివర్ణించి, మోదీపైన యుద్ధం చేస్తున్న తిరు గుబాటు వీరుడిగా, ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రతీకగా  ప్రజలను నమ్మించాలని ఎన్‌డీఏ నుంచి వైదొలిగినప్పుడే నిర్ణయించుకున్నారు. అప్పుడు తన అసమర్థ తనూ, వైఫల్యాలనూ చర్చనీయాంశాలు కాకుండా చేయవచ్చునని ప్రణాళిక.   నిజానికి చంద్రబాబుకి అంతకంటే మరో మార్గం లేదు. మోదీ సహకరించి ఉంటే టీడీపీ అధినేత వ్యూహం ఫలించేది.

అమరావతి భూముల కుంభకోణంపైనో, పోలవరం అవినీతిపైనో, వేలకోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను నామినేషన్‌ పద్ధతిలో అస్మదీయులకు కట్టిపెట్టడంపైనో విచారణ జరిపించాలని మోదీ నిర్ణయిస్తే బాధితుడిగా అభినయించి ప్రజల సానుభూతి పొందే అవకాశం చంద్రబాబుకి ఉండేది. కోట్లకు పడగలెత్తిన నారాయణ, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి సన్నిహితులపైన కేసులు పెట్టినా రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ గగ్గోలు పెట్టేవారు. ఆ పనులేవీ మోదీ చేయడం లేదు. మోదీ, అమిత్‌షాలు తమ శక్తియుక్తులన్నీ వింధ్యపర్వతాలకు ఆవలే వినియోగిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తాము చేయగలిగింది ఏమీ లేదని వారికి స్పష్టంగా తెలుసు.  కానీ మోదీని ఒక భయంకరమైన శత్రువుగా చిత్రించడం, అటువంటి బలమైన, క్రూరమైన శత్రువుతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరుడిగా ప్రజలను మెప్పించడం చంద్రబాబుకి అత్యవసరం. అందుకే బాబ్లీ ప్రాజñ క్టు నిర్మాణంనాటి పాత కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంటు (ఎన్‌బీడబ్ల్యూ) పంపిస్తే దాన్ని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ కలసి కుట్ర చేసి పంపించినట్టు నానా యాగీ చేయడం.

శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధర్మాబాద్‌ కోర్టుకు వెళ్ళడమా, మానటమా అనే అంశంపైన చర్చ జరపడం నిరర్థక రాజకీయానికి నిదర్శనం. ఉత్తరతెలంగాణ మీదుగా ధర్మాబాద్‌కు కార్లలో భారీ ఊరేగింపుగా వెడితే ఎన్నికల ప్రచారం చేసినట్టు కూడా ఉంటుందని ఒక మంత్రి సలహా ఇచ్చారట. ఎవరైనా వ్యాపారి లేదా పారి శ్రామికవేత్త పన్ను చెల్లించని పక్షంలో ఆదాయంపన్ను శాఖ లేదా వాణిజ్యపన్ను శాఖ అధికారులు సోదా చేయడం సర్వసాధారణం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఫిరాయించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలలోనూ, కార్యాలయాల లోనూ ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఇవి మామూలుగా జరిగే సోదాలేననీ, వారికి అనుమానం వస్తే సోదా చేస్తారనీ, అనుమానాలు నివృత్తి చేస్తే సమస్య ఉండదనీ ఏ మాత్రం ఆవేశం లేకుండా ఆయన విలేఖ రులకు వివరించారు. కేసీఆర్‌ ఆ విషయంపైన స్పందించ లేదు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారపక్షంతో, ప్రతిపక్షంతో సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తుల ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ సోదాలు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ శాఖ అయిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అనేక సందర్భాలలో ప్రభుత్వాధికారుల ఇళ్ళపైన దాడులు చేశారు. రవాణాశాఖలో పని చేస్తున్న ఒక కానిస్టేబుల్‌ ఇంట్లో ఇరవై కోట్ల విలువైన ఆస్తుల వివరాలు లభించినట్టు వార్తలు వచ్చాయి. 

గాలిమరపై యుద్ధం
గుడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (జీఎస్‌టీ) కట్టలేదనే కారణంగా ఆదాయంపన్ను శాఖ నిర్వహించిన సోదాలను ‘ఐటీ పంజా’ అంటూ పత్రికలు సంచలనా త్మకమైన శీర్షికలు ఇచ్చి ప్రచారం చేశాయి. ముఖ్యమంత్రి హడావిడిగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.  ‘రాష్ట్రంపైన ప్రధాని మోదీ పగబట్టారు. కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. మూకుమ్మడి ఐటీ దాడులు ఇందులో భాగమే. కేంద్రం దుర్మార్గాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. కేంద్ర వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలి’ అంటూ మంత్రులకు ముఖ్యమంత్రి ఉద్బో« దించారు. లేని కోటలో లేని శత్రువును ఊహించుకొని యుద్ధం చేయడం చూస్తుంటే చిన్నతనంలో చదివిన నవలలో కథానాయకుడి పాత్ర గుర్తు కొస్తున్నది. 17వ శతాబ్దం అరంభంలో స్పానిష్‌ రచయిత సర్వెంటెస్‌ (Cer-vantes) రచించిన డాన్‌ క్విక్జోట్‌ (Don Quixote) అనే నవలలో తనను తాను మహాయోధుడుగా ఊహించుకునే డాన్‌ క్విక్జోట్‌ రోజీనాంటీ (Rosinante) అనే గాడిదలాగా కనిపించే ముసలి గుర్రంపైన శాంకోపాంజా (Sancho Panza) అనే శిష్యుడితో కలసి స్వారీ చేస్తూ ఒక సత్రానికి వెడతాడు. దాన్ని కోటగా భ్రమిస్తాడు. అక్కడ ఉన్న వేశ్యలను రాచకుటుంబానికి చెందిన మహిళలుగా భావించి వారికి అర్థం కాని ఉదాత్తమైన భాషలో ప్రసంగిస్తాడు.

యుద్ధం చేసి తన సత్తా నిరూపించుకోవాలి కనుక ఒక అట్టకత్తి ధరించి గాలిమరతో పోరాటం చేస్తాడు. అదే తరహాలో తనను శత్రువుగా గుర్తించడానికి నిరాకరించే మోదీతో మహాసమరం చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేందుకు మీడియా సహకారంతో టీడీపీ అధినేత ఎంత హంగామా చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆదా యంపన్ను శాఖ అధికారులకు భద్రత ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబు కానీ లోకేశ్‌ కానీ హైదరాబాద్‌ సందర్శిస్తే తెలంగాణ ప్రభుత్వం రక్షణ ఇవ్వనంటే ఏమి చేస్తారు? రేపు ధర్మా బాద్‌ కోర్టుకు వెడితే అక్కడ చంద్రబాబునాయుడికి భద్రత కల్పించరాదని మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఏమి చేస్తారు? ముఖ్యమంత్రికి జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ అవసరం లేదని దేశీయాంగ శాఖ నిర్ణయిస్తే ఏమి చేస్తారు? సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగించే వైఖరి ఇది. చిన్న సంస్థలపైన ఆదాయంపన్ను శాఖ అధి కారులు సోదాలు నిర్వహిస్తే దానిని రాష్ట్రానికీ, కేంద్రానికీ మధ్య యుద్ధంగా, ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికీ మధ్య పోరాటంగా ఏకపక్షంగా ప్రచారం చేసు కోవడం అసాధారణమైన విషయం. దేశంలో మరే నాయకుడూ ఇటువంటి హాస్యాస్పదమైన విన్యాసాలు చేయలేదు. 

తెలంగాణ ఫలితం కీలకం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా ఆరు మాసాల వ్యవధి ఉన్నది. దానికి డ్రెస్‌ రిహార్సల్‌గా తెలంగాణలో ఎన్నికలు ముందుగానే ఏర్పాటు చేశారు కేసీఆర్‌. చంద్రబాబునాయుడు సహాయసహకారాలతో తెలంగాణలో మహాకూటమి గెలిస్తే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయాలు సాధిస్తే 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని నిలువరించవచ్చునని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆశ. అందుకు చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు దోహదం చేస్తారని అంచనా. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ నిర్ణయించడంతో కేసీఆర్‌ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లు కలిసి గబ్బర్‌సింగ్‌ అనో, సన్నాసులనో, దద్దమ్మలనో విమర్శించవచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌వారిని తెలంగాణ ద్రోహులంటూ టీఆర్‌ఎస్‌ నేతలు నిందించినా ప్రజలు విశ్వసించరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ అనే సంగతి ప్రజలకు తెలుసు.

 కానీ చంద్రబాబుపైన ఎన్ని బాణాలు వేసినా, ఎంత బలంగా దాడి చేసినా ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకు? చంద్రబాబునాయుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయనకు తెలంగాణలో ఏమి పని? సీలేరు ప్రాజెక్టుతో సహా ఏడు మండలాలు తెలంగాణ నుంచి ‘లాక్కున్న’ వ్యక్తి, కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరాలు చెబుతూ కేంద్రానికి అదే పనిగా లేఖలు రాసిన నేత, ‘వోటుకు కోట్ల’కేసులో ఫోన్‌లో మాట్లాడుతూ లడ్డూలాగా దొరికిపోయి హైదరాబాద్‌ని వదిలిపెట్టి అమరావతికి వెళ్ళిపోయిన నాయకుడిని తెలంగాణ ద్రోహిగా, అవినీతిపరుడుగా నిందించడం తేలిక. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఒకవైపు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానవర్గానికీ, మరోవైపు అమరావతిలో చంద్రబాబుకీ గులాములంటూ వాక్బాణాలు సంధించడం, ప్రజలను నమ్మిం చడం సులువు. కాంగ్రెస్, టీడీపీల కలయిక అనైతికమంటూ కేసీఆర్‌ దుయ్య బడతారు. కేసీఆర్, నరేంద్రమోదీకి మధ్య రహస్య ఒప్పందం  ఉన్నదనీ, వారు కుట్రపన్ని తననూ, తన పార్టీనీ వేధిస్తున్నారనీ చంద్రబాబు అంటారు. అదే ఆరోపణ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ ఎస్‌లు ఒకే తానులో ముక్కలంటూ టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ దాడి చేస్తారు. ఏది సత్యమో, ఏది అసత్యమో చెప్పడం కష్టం. స్పష్టాస్పష్ట దృశ్యం, దబాయింపు రాజకీయం, విశృంఖల ప్రచారం సత్యాన్ని మబ్బులాగా కమ్మేసినప్పుడు సత్య దర్శనం అసాధ్యం. రెండు మాసాల తర్వాత కానీ (డిసెంబర్‌ 11న) జన హృదయం బోధపడదు.

కె. రామచంద్రమూర్తి
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top