సంప్రదాయంలో ‘స్వయంప్రకాశం’

Guest Column By Shekar Gupta Over Sushma Swaraj - Sakshi

దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆరెస్సెస్‌ మూలాలు మరవని సుష్మా స్వరాజ్‌ 11 సార్లు రాష్ట్రాల, పార్లమెంటు ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థులతో తలపడి నిలిచి గెలిచారు. 2009లో అడ్వాణీ స్థానంలో నరేంద్రమోదీకి బదులుగా ఆయనకంటే చిన్న వయస్కురాలైన సుష్మా స్వరాజ్‌ను బీజేపీ అధినేతగా ఆరెస్సెస్‌ నిర్ణయించి ఉంటే ఆ పార్టీ చరిత్ర మరొక మలుపు తిరిగి ఉండేదనటం నిర్వివాదాంశం. కానీ క్రికెట్‌లో లాగే అందరు స్టార్లూ కపిల్‌ దేవ్, సచిన్‌ టెండూల్కర్‌లు కాలేరనీ రాహుల్‌ ద్రావిడ్‌లు కూడా ఉంటారన్నది రాజకీయాల్లోనూ సత్యమే. వారసత్వ రాజకీయాలకు దూరంగా బీజేపీ వంటి పితృస్వామిక సంస్థలో స్వయం ప్రకాశంతో విజయాలు సాధించిన విశిష్టమైన మహిళా నాయకురాలుగా సుష్మాస్వరాజ్‌ వెలుగొందారు. ఆమె నిష్క్రమణ ఆమె సొంత నిర్ణయమే.

జాతిహితం

భారతీయ జనతాపార్టీ వంటి పితృస్వామిక సంస్థలో స్వయం ప్రకాశంతో విజ యాలు సాధించిన విశిష్టమైన మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్‌. ఆమె నిష్రమణతో అనేక అంశాల్లో ముందువరుసలో నిలిచి చరిత్రకెక్కిన గొప్ప భారతీయ మహిళా రాజకీయవేత్తను బీజేపీ కోల్పోనుంది. రాష్ట్రపతి భవన్‌లో నూతన మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేస్తున్న వారు కూర్చున్న స్థానాలను దాటి అత్యంత విశిష్ట సందర్శకులు కూర్చున్న చోటికి సుష్మా స్వరాజ్‌ నడిచి వెళుతున్న దృశ్యం సంచలనం కలిగిం చింది. అక్కడ కూర్చుని ఉన్న సందర్శకుల్లో చాలామందికి ఆమె నూతన మంత్రివర్గంలో చేరవచ్చనే ఆశ అప్పటికీ చావలేదు. తన తొలి మంత్రివర్గంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి లేకుండా నరేంద్రమోదీ తన రెండో దఫా పాలన సాగించడం బహుశా కష్టమే కావచ్చు.

సుష్మాకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు రహస్యం కాదు. తాను కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్నానని ట్విట్టర్‌లో స్వయంగా ప్రకటించడం ద్వారా సుష్మా భారత రాజకీయ నాయకులు ప్రజా జీవితంపై కొనసాగుతున్న ముసుగును బద్దలు చేసిపడేశారు. తర్వాత ఆమె వేగంగా కోలుకున్నారనుకోండి. తన శరీరంలో కొత్తగా ఏర్పర్చుకున్న కిడ్నీతో ఆమె రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తూ వచ్చింది. దాని బలంతోనే ఆమె ఐక్యరాజ్యసమితిలో తన పాకిస్తానీ ప్రత్యర్థులతో తలపడ్డారు, ప్రపంచవ్యాప్తంగా తోటి విదేశీ కార్యాలయాలతో సమావేశాలు ఏర్పరుస్తూ వచ్చారు. అసాధారణమైన గౌరవాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చారు. ఆమె పెదాలనుంచి ఒక్కటంటే ఒక్క తేలికపాటి పదం కానీ వ్యక్తీకరణ కానీ ఎవరూ చూడలేకపోయారు. అలాగే ఆమె ఆగ్రహాన్ని కూడా ఎవరూ చూడలేకపోయారు. 

ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ శాఖ మంత్రులను కలవడంలో వ్యవహారాలు నడపడంలో సుష్మా పూర్తిగా భిన్నమైన ఒక వినూత్న దౌత్య ప్రక్రియను పాటించారు. నరేంద్రమోదీ విదేశీవిధానాన్ని పూర్తిగా తానే నడుపుతూ వచ్చారని సుష్మా పాత్ర ఏమీ లేదని విమర్శకులు దాడి చేశారు. పాస్‌పోర్ట్, వీసా వలస సమస్యలను ట్విట్టర్‌లో పరిష్కరించడం తప్ప ఆమె చేసేందుకు ఏమీ లేదని కూడా విమర్శలు వచ్చాయి. కానీ తనపై వస్తున్న ఇలాంటి ఆరోపణలన్నింటినీ ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. మోదీ మంత్రివర్గంలో ఏ మంత్రి కూడా నిజానికి పెద్దగా పొడిచిందంటూ ఏమీ లేదు. సుష్మా బాధ్యత చాలా కష్టభూయిష్టమైంది. ఒకవైపు తన ప్రధాని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటుండగా ఆమె ఏమాత్రం లోటుగా భావించకుండా ఆయనకు దారి కల్పించారు. మీడియాలో ప్రచారం కోసం ఆమె ఎన్నడూ ప్రయత్నించలేదు. వెనుక గదిలో తన పాత్ర పోషించడానికి ఆమె సిద్ధపడ్డారు. మోదీని ప్రశంసించడం తప్ప ఆయన గురించి ఒక్క పదం కూడా చెడుగా మాట్లాడలేదు.

అతి చిన్నపట్టణమైన చండీఘర్‌లో మేమిరువురం 1977లో ఏకకాలంలో మా వృత్తి జీవితాలను ప్రారంభించాం. దేవీలాల్‌ నేతృత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వంలో పాతికేళ్ల ప్రాయంలో సుష్మా నవ, యువ కేంద్రమంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. నేను ఆ సమయంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో సిటీ రిపోర్టరుగా పనిచేసేవాడిని. ఆ కాలంలో చాలా మంది రాజకీయ నేతల కంటే ఆమె ఎక్కువ ఆత్మగౌరవంతో మెలిగేవారు. అలాంటిది.. తన పార్టీ ఇప్పుడు రెండో దఫా ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఒక సందర్శకురాలిగా ఉంటూ అక్కడ ఉన్న వారి అభినందనలు అందుకున్న సందర్భంలో 42 ఏళ్ల పాటు సాగిన ఆమె రాజకీయ జీవితం ఇక ముందు ఎలా సాగనుంది అనే విషయంలో నాకు ఇప్పటికీ అంత స్పష్టత కలగడం లేదు. విదేశాంగ శాఖ కార్యదర్శిగా సుష్మా ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు పనిచేసిన ఎస్‌ జయశంకర్‌ ఇప్పుడామె స్థానంలో విదేశీవ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ నేపథ్యంలో తన అసాధారణమైన అంతర్గత శక్తి సహా యంతో ఆమె తన రాజకీయ నిష్క్రమణను తాత్వికంగా స్వీకరించవచ్చు. ఆమె ప్రజాజీవితంలో జరిగిన ఈ మలుపు కేవలం మలుపు కాదు.. ఆమె విశిష్టమైన రాజకీయ ప్రయాణంలో ఇది బహుశా ముగింపు లాంటి మలుపు కావచ్చు.  1970ల నాటి భారత రాజకీయాల్లో స్వయంప్రకటిత మహిళా నేతగా ఎదిగిన సుష్మా 27 ఏళ్ల వయసులో ఆమె హర్యానా జనతాపార్టీ అధ్యక్షురాలయ్యారు. అయితే 1979లో జనతాపార్టీ విచ్చిన్నమయ్యాక ఆమె జనసంఘ్‌ గ్రూప్‌ వైపు అడుగులేశారు. అప్పటినుంచి ఆమె వంశ పారంపర్యతకు దూరంగా స్వయం సిద్ధ రాజకీయనేతగా ఎదుగుతూ వచ్చారు.

జాతీయ క్యాలెండర్లలోంచి నాట్యం చేస్తున్న అజంతా అప్సర చిత్రాలను తొలగించాలని, అశ్లీలతతో కనిపిస్తున్న కండోమ్‌ ప్రకటనలను నిషేధించాలని, స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ సినిమాలోని సెక్సీ రాధా పాటను తొలగించాలని, దీపా మెహతా సినిమా ఫైర్‌లో షబానా ఆజ్మీ, నందితాదాస్‌ మధ్య లెస్బియన్‌ ప్రేమ దృశ్యాలను ప్రదర్శించకూడదని, అత్యాచార బాధితురాలిని సజీవ శవంగా భావించాలని తన జీవితం పొడవునా ప్రకటిస్తూ వచ్చిన సుష్మా బీజేపీ సాంప్రదాయతత్వానికి తాను తలొగ్గినట్లు మనతో నచ్చబలికేవారు. అంతమాత్రాన ఆమెను ఒక మామూలు బీజేపీ సాంప్రదాయిక భావాలు మాత్రమే కలిగిన నేతగా భావించరాదు.
ఆమె ఒక విభిన్నమైన మహిళ అని చెప్పడానికి ఆమె జీవితం నుంచి డజన్‌ ఉదాహరణలను ఎత్తి చూపవచ్చు.

ఆమె ఫక్తు మధ్యతరగతి జీవితాన్ని ప్రధానస్రవంతి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఈ మూలాలే ఆమె వ్యక్తిగత ఎంపికలను నిర్ణయిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ఆమె తన మాతృసంస్థ అయిన ఆరెస్సెస్‌కి చెందిన పితృస్వామిక వారసత్వాన్ని దూరం పెడుతూ వచ్చారు కూడా. ఈ క్రమంలోనే ఆమె మంగళూరులో కొంతమంది యువతులను అనైతిక కార్యకలాపాలకు దిగుతున్నారని ఆరోపిస్తూ బార్‌ల నుండి హిందూ ఛాందసవాద శక్తులు బయటకు లాగి అవమానించినప్పుడు ఆ చర్యకు వ్యతిరేకంగా మాట్లాడటానికి సుష్మా ఏమాత్రం భయపడలేదు. ఒక ఆధునిక, స్వతంత్ర మహిళగా, ఒక యువతికి తల్లిగా ఆమె ఎంతో స్వతంత్రంగా వ్యవహరించేవారు. మాట్లాడేవారు. దీంతో ఆమె సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తానొక విభిన్నమైన మహిళ అని గుర్తించినందుకే ఆమె అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

రాజకీయ జీవితం నుంచి తాను నిష్క్రమించబోతున్నానని, ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీపడటం లేదని ఆమె సరైన సమయంలో ప్రకటించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 11 సార్లు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో పోరాడిన సుష్మా బలమైన పోటీని, ప్రత్యర్థులతో తలపడటాన్ని ఆమె ఎన్నడూ తప్పించుకోలేదు. కానీ ఇప్పుడామెకు 66 ఏళ్లు. పైగా ఆరోగ్యం ఇప్పుడామె ప్రధాన సమస్యగా మారింది. మధుమేహం తొలి దశ ప్రభావ ఫలితమిది. అయితే చివరవరకు వేచి ఉండకుండా కొత్త మంత్రివర్గంలో తాను చేరబోవడం లేదనే విషయాన్ని ఇంకాస్త ముందుగా ఆమె ప్రకటించి ఉండాల్సిందని నా సూచన. 
ఏది ఏమైనా ఆమె తన కెరీర్‌ను ఒక విజేతగానే, పార్టీకి అత్యంత విశ్వసనీయురాలిగానే ముగించారని ఆమె ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు.

ఆమె తొలినుంచి అడ్వాణీ ఆరాధకురాలు. కానీ 2009లో కొత్త తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి  అడ్వాణీ తిరస్కరించినప్పుడు సుష్మా ఏమాత్రం తొట్రుపాటు చెందకుండా పార్టీకి చెందిన సద్బుద్ధి కలిగిన ‘గ్యాంగ్‌ ఆఫ్‌ ఫోర్‌‘ (వెంకయ్యనాయుడు, అనంతకుమార్, అరుణ్‌ జైట్లీ )తో చేతులు కలపడమే కాదు పార్టీకి యువ అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటూ ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ను కోరారు కూడా. దాంతో నితిన్‌ గడ్కరీ వెలుగులోకి వచ్చారు.గత అయిదేళ్లకాలంలో ప్రధాని కార్యాలయం ఆమెను పక్కనబెట్టి ఉండవచ్చు, కొన్ని అంశాల్లో ఆమె ప్రాధాన్యం తగ్గించి ఉండవచ్చు. కానీ జైట్లీతో భేదాభిప్రాయాలు ఏర్పడిన సమయంలో మోదీ సుష్మాను తన వైపు ఉండాలని ఎంచుకున్నారు.

ఆ సమయంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాలో ఉండటంతో ఆమెను ఢిల్లీలోనే ఉండాలని మోదీ కోరారు. అప్పటికే ఆమె దుబాయ్‌కు వెళ్లవలిసి ఉంది. సుష్మా విశ్వాసాన్ని, పరిణతిని మోదీ గుర్తించారనడానికి ఇది చక్కటి తార్కాణం. పైగా అది ఆమె రాజకీయ కెరీర్‌లో కీలకమైన దశ. అద్వాణీకి బదులుగా యువనేతగా సుష్మానే ఎంచుకోవాలని బీజేపీ/ఆరెస్సెస్‌ నాయకత్వం నిర్ణయించుకుని ఉంటే ఏం జరిగేదన్నది చర్చనీయాంశం. ఆమె నరేంద్రమోదీ కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు. అదే జరిగి ఉంటే ఆమె నాయకత్వంలో ఎలాంటి బీజేపీ అవతరించి ఉండేదన్నది కూడా చర్చనీయాంశం.మోదీకి బదులుగా సుష్మా బీజేపీ నాయకత్వంలోకి వచ్చి ఉంటే అనేది మంచి చర్చకు తావిచ్చి ఉండేది. క్రికెట్‌లాగే రాజకీయాల్లోనూ ప్రతి స్టార్‌ కూడా ఒక కపిల్‌ దేవ్‌లా, సచిన్‌ టెండూల్కర్‌లా కాలేరు. వదలడానికి వీలులేని వ్యక్తి అయినప్పటికీ కీర్తి, అధికారానికి చేరువ కాలేకపోయిన రాహుల్‌ ద్రావిడ్‌ వంటి పాత్రను కూడా కొంతమంది పోషిం చాల్సి ఉంటుంది. ఒక రాజకీయ నేతగా సుష్మాస్వరాజ్‌కి కూడా ఈ వర్ణనే సరిగ్గా సరిపోతుంది.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekarGupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top