ఉపేక్షిస్తే ఇక ఉపద్రవాలే!

Dileep Reddy Writes Guest Column Governments Neglecting Environment - Sakshi

సమకాలీనం

స్థానిక పాలనా సంస్థల నిర్వాకాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ ఒప్పందాల వరకు పర్యావరణానికి అంతటా విఘాతాలే! నిజాయితీగా పర్యావరణ పరి రక్షణ జరుపడానికి ప్రభుత్వాలే అతి పెద్ద ప్రతిబంధకాలు. రాజకీయ విధాన నిర్ణ యాలు–అమలే అవరోధాలు. ఇది అన్ని స్థాయిల్లో జరుగుతోంది. ‘ఆవులు చేలో మేస్తే దూడలు గట్టున మేస్తాయా...?’ అన్న చందంగా కార్పొరేట్లు, కంపెనీలు, పరిశ్రమలు, జన సమూహాలు... ఇలా ఎవరికి వారు విచ్ఛల విడిగా కాలుష్య కారకాలవుతున్నారు. వెరసి సమస్య రోజురోజుకూ జఠిలమౌతోంది. శాస్త్రవేత్తల అంచనాల్ని మించి భూతాపోన్నతి హెచ్చుతోంది. వాతావరణ మార్పులు వేగం పుంజుకున్నాయి. ధృవపు మంచు అసాధారణంగా కరుగుతోంది. సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. 

తీర నగరాలు ప్రమాదపు అంచుకు జారుతున్నాయి. వర్ష రుతుక్రమం మారి వ్యవసాయ రంగం వికటిస్తోంది. ఎడారీకరణ వేగం పుంజుకుంది. అంతటా ప్రతి కూల ప్రభావం పడి ఆహారోత్పత్తి మందగిస్తోంది. ఇబ్బడి ముబ్బడి వినియోగంతో శిలాజ ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రత్యా మ్నాయ–పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి నత్తనడకన సాగుతోంది. అంత తేలిగ్గా నశించని ప్లాస్టిక్‌ భూమి, సముద్రం అని హద్దుల్లేకుండా సర్వత్రా వ్యాపిస్తోంది. ఇంటా బయటా గుట్టలుగా పేరుకుపోతోంది. ఇతరత్రా వ్యర్థాల నిర్వహణ కూడా దేశంలో నిరాశాజనకంగా ఉంది. భవిష్యత్తు భయం పుట్టిస్తోంది. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) ప్రతి పాదించిన పదిహేడు సుస్థిరాభివృద్ది లక్ష్యాల (ఎస్డీజీ) సాధనవైపు అడుగులు తడబడుతున్నాయి. న్యాయస్థానాలు కల్పించుకొని మంద లిస్తే తప్ప చలించని స్థితిలో ప్రభుత్వాలున్నాయి. 

అంతర్జాతీయ, జాతీయ ఒప్పందాలు, చట్టాలు, రాజ్యాంగ నిర్దేశాల ప్రకారం ప్రతిదీ నిర్వహించాల్సింది, నియంత్రించాల్సింది ప్రభుత్వాలే! అవి సక్ర మంగా నడిస్తేనే కార్పొరేట్లు అదుపాజ్ఞల్లో ఉంటాయి. పౌర సమాజం బాధ్యతగా వ్యవహరిస్తుంది. అంతే తప్ప, అన్నిసార్లూ న్యాయస్థా నాలే పరిస్థితి చక్కదిద్దాలంటే, సరైన నిర్వహణతో ఆదుకోవాలంటే అదంత తేలిగ్గా అయ్యేది కాదు. అంపైర్లు ఎన్ని మార్లని ఆటను ప్రభా వితం చేస్తారు...? ఆటగాళ్లు, జట్లు ప్రతిభ ప్రదర్శిస్తే తప్ప గెలు పోటముల్ని అంపైర్లే నిర్ణయించజాలరు. కానీ, చీటికి మాటికి న్యాయ స్థానాలు, న్యాయప్రాధికార సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తలెత్తుతోంది. వ్యర్థాల నిర్వహణ, ఇసుక విధానం, మొక్కల పెంపకం నుంచి అణు విద్యుదుత్పత్తి, అటవుల సంరక్షణ, భూతా పోన్నతి నిలువరించడం వరకు అన్నీ పెనుసవాళ్లే! పాలనా వ్యవస్థల సమర్థ నిర్వహణతోనే వాటిని ఎదుర్కొగలం. అందుకు, ఒక కొత్త జీవావరణ రాజకీయ సంస్కృతి అవసరం కనిపిస్తోంది.

సర్కార్లు చేస్తున్నది మేలా? కీడా?
తమ అధికారాల కోసం అరిచి అల్లరి చేసే ప్రభుత్వాలు, రాజ్యాంగ విహిత బాధ్యతల్ని విస్మరిస్తున్నాయి. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తోందని కేంద్రంపై పెడబొబ్బలు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాలు, మరోవంక స్థానిక సంస్థల్ని అన్ని విధాలుగా నిర్వీర్యం చేస్తుంటాయి. నిధులు, అధికా రాలు కల్పించకపోగా రాజ్యాంగం కల్పించిన వాటి అధికారాల్ని దొడ్డిదారిన లాక్కుంటాయి. సహజవనరుల పరిరక్షణ, వ్యర్థాల నిర్వ హణ, స్థానికంగా ఆదాయవనరుల పరికల్పన వంటి విషయాల్లో స్థానిక పాలనా సంస్థలకుండే అప్రతిహత అధికారాల్ని అవి కొల్లగొ డుతుంటాయి. ఈ నిర్వాకాలవల్ల గ్రామ పంచాయితీలకుండే నిర్ణయా ధికారం గాలికిపోతుంది. సహజవనరులకు విఘాతం కలిగించే ప్రభుత్వ విధానాల వల్ల తలెత్తే సామాజిక, పర్యావరణ ప్రభావాల అధ్యయనాలు కూడా సర్కారు జరిపించడం లేదు. 

జరిపినా, పలు నిర్బంధాల నడుమ వాటిని తూతూ మంత్రంగా ‘అయింద’ని పిస్తారు. గోదావరి నది వెంట 39 కిలోమీటర్ల నిడివి, 1400 హెక్టార్ల మేర (మేడిగడ్డ–అన్నారం బరాజ్‌ల వరకు) పూడిక తీసివేత పేరుతో ఇసుకు కొల్లగొట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తప్పుబట్టింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని బుధవారం తీవ్రంగా మందలించింది. ‘ఇది పూడిక తీసివేత కాదు, విధ్వంసం’ అంది. ఆ ముసుగులో నదిగర్భం నుంచి 4 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలించుకుపోవడాన్ని ఎన్జీటీ తీవ్రంగా పరిగణించింది. పర్యావరణ అనుమతి తీసుకోకపోవడం, పర్యావరణ ప్రభావాల అధ్యయనమే జరిపించకపోవడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో కీలకమైన పర్యావరణ చట్టాలేవీ రావడానికి ముందే, స్థానిక సంస్థల అధికారాలు–బాధ్యతలకు సంబంధించి... రాత్లమ్‌ మున్సిపా లిటీ కేసు (1980) విచారిస్తూ జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఓ గొప్ప మాట చెప్పారు. 

‘పబ్లిక్‌ న్యూసెన్స్‌..... అనేది చట్ట ప్రకారం అందించాల్సిన సామాజిక న్యాయానికే ఓ సవాల్‌’ అన్నారు. ‘.... పద్ధతి, మర్యాద, గౌరవంగా బతకడం అనేవి మానవహక్కుల్లో రాజీపడటానికి వీల్లేని అవిభాజ్య అంశాలని, వాటి పరిరక్షణ స్థానిక పాలనా సంస్థల ప్రాథ  మిక కర్తవ్యమ’ని ఆ తీర్పులో విస్పష్టంగా చెప్పారు. ‘స్వచ్ఛభారత్‌’ పేరుకే తప్ప, బాధ్యతాయుత కర్తవ్య నిర్వహణ స్థానిక సంస్థలు చేయట్లేదు. ప్రచార యావ తప్ప రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నదీ అంతంతే! పౌర సమాజం కూడా ఈ విషయంలో నిర్మాణాత్మక పాత్ర, బాధ్యత తీసుకోవాలి. చాలా చోట్ల అది జరగట్లేదు. ఫలితంగా ఆ కార్యక్రమమే మొక్కుబడిగా మారింది.

పెనుభూతాన్ని అడ్డుకునేదెలా?
మనిషి దైనందిన జీవితంలో భాగమైన ప్రమాదకర ప్లాస్టిక్కును నియంత్రించడం ఎలా? ఈ సమస్య ప్రపంచమంతటికీ ఓ సవాల్‌ విసురుతోంది. కరిగించి, మరో రూపంలో తిరిగి వాడడం సాధ్యపడే మందపు ప్లాస్టిక్‌తో పెద్దగా ఇబ్బంది లేదు. పునర్వినియోగం లేకుండా ఒకేసారి వాడి–పాడేసే పలుచని ప్లాస్టిక్‌ అత్యంత ప్రమా దకారి. రోజువారీ అనేకానేక అవసరాలకు విచ్చలవిడిగా మనం వీటిని వాడుతున్నాము. చేతి సంచులు, కప్పులు, పార్శిల్‌ కవర్లు, ప్యాకింగ్‌కు వినియోగించే ర్యాపర్లు, రవాణా అయ్యే ఎలక్ట్రానిక్‌ వస్తువుల భద్రతకు వాడే సన్నని వ్యాక్యూమ్‌ కవర్లు.. ఇలా వివిధ రూపాల్లో పలుచని ప్లాస్టిక్‌ ఉంటోంది. ఇది కరగదు, తరగదు, నాశన మవకుండా వేయి సంవత్సరాల పైనే మనుగడలో ఉంటుంది. 

దీంతో రకరకాల ఇబ్బందులున్నాయి. భూమిపైన, భూపొరల్లో, వివిధ జల వనరుల్లో, సముద్ర గర్భంలో గుట్టలుగా పేరుకుపోతూ మనిషి మను గడకు సవాల్‌గా మారింది. ఆహారంతో పాటు తక్కువ పరిమాణం, సూక్ష్మ రూపంలో ఇది జంతువుల, మనుషుల కడుపుల్లోకి వెళు తోంది. కేన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకూ కారణమౌతోంది. ప్రధాని మోదీ, జాతినుద్దేశించి పది రోజుల కింద ‘మనసులో మాట’ చెబుతూ ప్లాస్టిక్‌ పెనుభూతంపై విరుచుకుపడ్డారు. ‘హానికర ప్లాస్టిక్‌ రహిత భరతమాత’ను తీర్చిదిద్దుకోవాలని జాతికి పిలుపునిచ్చారు. పునర్వినియోగం లేని తక్కువ మందపు ప్లాస్టిక్‌ ఉత్పత్తిని నిషేధించ    బోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సంకేతాలిచ్చారు. మనిషి పరిణామ–ప్రగతి క్రమంలో ప్లాస్టిక్‌ క్రియాశీల భూమిక నిర్వహిం చింది. కానీ, కాలక్రమంలో చెడ్డ ప్లాస్టిక్‌ వల్ల ఉపయోగకరమైన మంచి ప్లాస్టిక్‌కూ అపకీర్తి వస్తోందని, సర్కారు ప్రచారంలోకి తెచ్చిన ఒక వీడియో టాక్‌లో కేంద్ర మంత్రి జావదేకర్‌ అన్నారు. 

50 మైక్రాన్‌ల లోపు మందపు ప్లాస్టిక్‌ చేతి బస్తాలు, స్ట్రాలు, కప్పులు, కవర్లు తది తరాల్ని అక్టోబరు 2 (గాంధీ జయంతి) నుంచి నిషేధించే ఆలోచన ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పౌర సమాజం సహకరించి ప్రత్యామ్నాయాల్ని వినియోగించాలని కోరారు. తక్కువ మందపు ప్లాస్టిక్‌ వినియోగంపైనే ఇన్నాళ్లు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో నిషేధం ఉండేది. అసలు ఉత్పత్తే లేకుంటే వినియోగం ఉండదు కదా! ఉత్పత్తినెందుకు నిషేధించరు? అనే ప్రశ్న జనసామా న్యంలో ఉదయించేది. ప్లాస్టిక్‌ను నిషేధించడం, లేదా అందుకోసం ఒక చట్టం తీసుకురమ్మని ఆదేశించడం తాము చేయజాలమని సుప్రీంకోర్టు 2016 (కరుణ సొసైటీ కేసు)లో స్పష్టం చేసింది. అది కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత అనేది న్యాయస్థానం ఉద్దేశం. కఠిన నిబంధనలు, విధి విధానాలు రూపొందించుకొని అమలు చేయొ చ్చంది. బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ఇందుకు సరిపోయే చట్టాలు– నిబంధనలు తెచ్చి, పకడ్బందీగా అమలుపరచడానికి ఉన్నత న్యాయ స్థానం తీర్పేమీ అడ్డంకి కాదు.

కోట్లాది మందిని తరలించాల్సిందే!
సముద్ర తీర ప్రాంతాల జనావాసాలు భవిష్యత్తులో పెను ప్రమా   దాన్ని ఎదుర్కోబోతున్నాయి. కారణం, వేగంగా సముద్ర జలమట్టం పెరగటమే! నాగరికత వికాస క్రమంలో పెద్ద సంఖ్యలో జనుల వల సలకు గమ్యస్థానాలైన మహానగరాలెన్నో సాగరతీరాల్లోనే వృద్ధి చెందాయి. ఇప్పుడవే ప్రమాదంలో పడ్డాయి. కర్బన కాలుష్యాల క్రమం ఇలాగే ఉంటే, భూతాపోన్నతి ఇదే రీతిన పెరిగితే... సమీప భవిష్యత్తులోనే ధృవప్రాంతపు మంచు శిఖలు కరిగి సముద్ర మట్టాలు అసాధారణంగా పెరుగనున్నాయని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) ముసాయిదా పత్రమొకటి ఇటీవల వెల్లడించింది. ఈ ప్రమాద ప్రక్రియ ఇప్పటికే మొదలయిందని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఇది అత్యంత వేగంగా నష్టం కలిగిస్తుందన్నది నివేదిక సారం. ఉత్తర దక్షిణ ధృవాల్లోని గ్రీన్‌లాండ్, అంటార్కిటి కాలు వేగంగా కరిగిపోతున్నాయి. 

కర్బన ఉద్గారాలవల్ల, ఇతర కాలుష్యాల కారణంగా పెరిగే భూతాపొన్నతే ఈ మంచు ఖండాల్లోని ప్రస్తుత సంక్షోభానికి కారణం. ‘వాతావరణ మార్పులపై ఏర్పడ్డ అంతర్‌ప్రభుత్వాల కమిటీ’ (ఐపీసీసీ) ఇచ్చిన ప్రత్యేక నివేదిక ఇది. ఇప్పటికే మత్స్య సంపద తరుగుదల మొదలయింది. మానవ కారక కాలుష్యాన్ని తగు చర్యలతో నియంత్రించకుంటే, ఉత్తర ధృవపు మంచుకొండలు ఈ శతాబ్దాంతానికి కనీసం 30 శాతం కరిగి పోతా యనేది అధ్యయనం. అదే జరిగితే, 2050 నాటికి చిన్ని చిన్న దీవులు, కడలి తీరాల్లోని మహానగరాలు తీవ్ర ‘సముద్ర జల మట్టాల’ సమ స్యను ఎదుర్కోనున్నాయి. భూతాపోన్నతి 2 డిగ్రీలు మించి పెర క్కుండా కట్టడి చేసినా, 2100 నాటికి సముద్రమట్టాలు 43 సెంటీ మీటర్లు పెరుగుతాయనేది పరిశీలన. అప్పుడు సాగరతీరాల నుంచి 25 కోట్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఒక వైపు అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చు అంతర్జాతీయ రాజకీయ పరిణా మాల్నే శాసిస్తోంది. ముప్పిరిగొనే ఈ ప్రకృతి విపత్తులు ఇంకే విపరి  ణామాలకు దారితీస్తాయో తెలియదు! పాలకులు, ప్రభుత్వాలు, పౌరసమాజం సమన్వయంతో చొరవ చూపితేనే  సమస్య తీవ్రతను కట్టడి చేయగలవు.


వ్యాసకర్త: దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top