ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాల్సిందే

cs shanti kumari about single use plastic - Sakshi

పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ 

స్వచ్ఛంద నిషేధం పాటించి ఆదర్శంగా నిలవాలి 

సీఎస్‌ శాంతికుమారి 

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్‌ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్‌ షాప్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌ రాజీవ్‌ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

 ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం 
శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్‌ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్‌ శర్మ ఆవిష్కరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top