స్వాతంత్య్ర ఫలాల్లోనూ వెనుకబాటు

Dasu Suresh Article on Number of BCs in Parliament - Sakshi

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం. స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత వంటివన్నీ స్వాతంత్య్రంతో సాకారం అవుతాయనుకున్నారు. భారతదేశంలో సామాన్యుడికి అవసరమైన విద్య, వైద్య, ఉద్యోగాలు, వనరులపై సాధికారత సాధ్యమవుతుందనుకున్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగ నిర్మాణంతో మన హక్కులు పరిరక్షింప బడతాయనుకున్నారు. కానీ నేటి భారతదేశ సమకాలీన ఆరి్థక రాజకీయ సామాజిక వాతావరణంలో భారత స్వాతంత్య్ర మూల సిద్ధాంతం విస్మరించబడి ధనికులు ఇంకా ధనికులుగా మారుతుంటే, పేదవారు దుర్భర పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నారు.

నేడు ప్రపంచపటంలో అఖండంగా వెలిగిపోతున్న భారతావని, సాంకేతిక ఎదుగుదలతో అద్భుతాలను సృష్టిస్తూ అంతరిక్షంలో చంద్రయాన్‌ లాంటి వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తోంది.  ఇంకోపక్క బాలలపై హత్యాచారాలు, బలహీనులపై బల వంతుల దోపిడీ, పీడన, సమాన హక్కులు సాకారమవ్వకపోవడం, ఆదివాసులపై, దళితులపై దాడులు, రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, జల వివాదాలు, దిగజారుతున్న విద్యా, వైద్య ప్రమాణాలు స్వతంత్ర  భారతావనిని తీవ్రంగా బాధిస్తూనే వున్నాయి.

భారత రాజ్యాంగంలో భారతీయుడిగా పేర్కొన్న ప్రతి మనిíÙకి ఒకే ఓటు, ఒకే విలువ,సమానత్వం అనేవి స్వతంత్ర  భారతావనిలో చాలా ఉన్నతమైన అవకాశాలు.. భారతదేశం ముందు ఎన్నడూ ఎరుగని ఒక మహోన్నత అవకాశం ఈ సామాజిక సమానత్వం ద్వారా భారత పౌరులకు సిద్ధించాయి. కానీ స్వాతంత్య్రానంతరం పాత సంస్థానాధీశులు, రాజులు, రాజ ఉద్యోగులు, అడ్వకేట్లు, విద్యావంతులు సింహభాగం పొందుతూ రావడం జరిగింది. తదనంతరం బడుగు బలహీన అణగారిన వర్గాలకు విద్య, పరిపాలన, రాజకీయ వ్యవస్థలలో సమాన నిష్పత్తిలో అవకాశాలు లేనందున వారి కోసం పూలే,  అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్‌ రామస్వామి నాయకర్, రామ్‌ మనోహర్‌ లోహియా మండల్‌ వంటివారు కృషి చేశారు.

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని 18 రాష్ట్రాల నుండి బీసీల నుండి ఒక లోక్‌ సభ సభ్యుడు కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం. 12 వందలకు పైగా బీసీ కులాలు ఇప్పటికీ సంచార జాతులుగా జనాభా లెక్కలకు దూరంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా బతుకుతున్నారు. ప్రజలకు విద్య, వైద్యం రాజ్యాంగబద్ధంగా ఉచితంగా ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ ఇది ఆచరణలో మాత్రం ఇప్పటికీ అంతంతమాత్రంగానే వుంది. దేశ జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు పార్లమెంటులో 14 శాతం కూడా వాటా రాలేదు. దేశంలో 2600  బీసీ కులాలు ఉండగా 2550 బీసీ కులాలు పార్లమెంటు గేటు దాటలేదు.. దేశంలోని 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుండి బీసీ కులానికి చెందిన పార్లమెంటు సభ్యులు కూడా లేరు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలలో 10% ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్లో బీసీలకు లేదు. దేశంలో ప్రస్తుత ప్రభుత్వంలో 545 పార్ల మెంటు స్థానాలకు కేవలం 96మంది సభ్యులు మాత్రమే బీసీలు వున్నారు. ప్రజాస్వామ్య వ్యవ స్థలో కొన్ని వర్గాలు అధికారం చేజిక్కించుకోవడానికి ధనబలాన్ని, అంగబలాన్ని విస్తృతంగా  ఉపయోగిస్తున్నాయి. ఈ సందర్భంలో దేశ ప్రజల మధ్య వ్యత్యాసాలు తగ్గి ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి ప్రభుత్వాలు అధికారంలోకి వచి్చనప్పుడే అన్ని వర్గాల మధ్య అంతరాలు తగ్గి  భారత స్వతంత్ర అభీష్టం సిద్ధిస్తుంది.

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం ఒక ఉత్సవంగా జరుపుకొని సెలవుగా ప్రకటించినంత మాత్రాన మన బాధ్యత తీరదు. స్వాతంత్య్రం ద్వారా మనకు సిద్ధించిన ఫలాలను అనుభవిస్తూ,  బాధ్యతలు నిర్వహిస్తూ, విధి విధానాలను పాటిస్తూ కులం, మతం, వర్గం, లింగం అన్ని అంశాలను సమాన ప్రతిపత్తిలో ఆదరించినప్పుడే స్వాతంత్య్రానికి అసలైన గౌరవం.

వ్యాసకర్త జాతీయ బీసీ అధికార ప్రతినిధి,
కన్వీనర్, బడుగు బలహీనవర్గాల
రాజకీయ ఐక్య వేదిక ‘ 91773 58286

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top