ఆపన్నుల బాసటకు ఆర్భాటమేల?

Article On Naveen Patnaik Response Over Cyclone Fani - Sakshi

ఫొని తుపాను విరుచుకుపడినప్పుడు తన ప్రజలకు తక్షణ సహాయ సహకారాలను అందించడంలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తీసుకున్న చర్యలు యావద్దేశం ప్రశంసలను పొందుతున్నాయి. ఏపీ సీఎం బాబులాగా తన చుట్టూ అధికారుల్ని తిప్పుకుంటూ, పచార్లు కొడుతూ ప్రజల దృష్టిని ప్రచార ఆర్భాటం కోసం ఆకర్షించుకోవడానికి పట్నాయక్‌ ఆస్కారం ఇవ్వలేదు. ఒడిశా లోతట్టు ప్రాంతాల్లోని 10 వేల గ్రామాల నుంచి, 12 లక్షల మంది ప్రజల్ని 4 వేల సురక్షిత కేంద్రాలకు, 860 ఉచిత ఆహార సదుపాయ కేంద్రాలకు జయప్రదంగా లక్షమంది అధికారులు తరలించగలగడానికి పట్నాయక్‌ చుట్టూ అధికారులు వందిమాగధుల్లా నాట్యం ఆడకపోవడమే ప్రధాన కారణమని గుర్తించాలి.

వేసవిలో తుపానులు రావటం అందులో అరుదైన ప్రకృతి వైపరీత్యం. కానీ మారిన వాతావరణ పరిస్థితుల్లో, వేసవి కాలాన్ని కూడా తుపానులు విడిచిపెట్టడం లేదు. గత 43 సంవత్సరాల్లో ఎదురైన తుపానుల్లో ‘ఫొని’ వేసవి తుపాను దేశంలోనే అత్యంత బలీయమైన దృశ్యం. బంగాళాప్రాంతం నానాటికీ వేడెక్కిపోతున్న ఫలితంగానే ఈ అసాధారణ పరిణామం’’. – భారత వాతావరణ శాఖ ప్రకటన

‘‘ఈసారి భారత వాతావరణ శాఖ చేసిన ముందస్తు హెచ్చరికలు, భారీ జన నష్టాన్ని నివారించడానికి దోహదం చేశాయి. ఆ సంస్థ ఈ సారి ఆచి తూచినట్లు చేసిన అంచనా జననష్టాన్ని అదుపు చేయగలిగింది.  ఫలి తంగా అధికారులు తుపాను ధాటికి గురి కానున్న ప్రాంతాల ప్రజల్ని ముందస్తు వ్యూహంతో, తక్కువ జననష్టంతో సురక్షిత కేంద్రాలకు చేర్చి రక్షించడానికి దోహదం చేసింది’’ – ఐక్యరాజ్యసమితి ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ సంస్థ కితాబు.

వాన బడాయి చవిటి పర్రమీద’ అన్నట్లుగా వాతావరణ కాలుష్యంపై ప్రపంచ దేశాలు ఎన్ని అంతర్జాతీయ సమావేశాలు నిర్ణయించుకున్నా, జనాల ఉనికిని,  ఉసురునూ పంటల్నీ, పంట పొలాలను, పారిశ్రామిక వాడల్ని పలు వర్గాల జనావాసాల్ని అతలాకుతలం చేసి, భారీ ధన ప్రాణ నష్టాలకు దారి తీస్తాయి అకాల వర్షాలూ, తుపానులూ. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలను చుట్టుముట్టిన తిత్లీ తుపా నుకూ, కొన్ని రోజుల క్రితం పొరుగు రాష్ట్రమైన ఒడిశాను పెనవేసుకుని భారీనష్టానికి పగబట్టి మరీ గురిచేసిన ఫొనికీ నష్ట విస్తృతిలో పెద్ద తేడా ఉంది. అయితే ఏ ప్రకృతి వైపరీత్యం ఉన్న ఫళాన విరుచుకుపడినా,  దాని నివారణకు, నష్టాల వ్యాప్తి నియంత్రణకు స్థానిక ప్రభుత్వాలు సర్వసన్నద్ధంగా ఉండాల్సిన ధర్మం పాలకులదీ, అధికారులదీ. నష్టాలను అంచనా కట్టడంలోనే కాదు, వాటిని దొరికిందే అదనుగా భావించి పాలకులు, వారి అవినీతి ప్రవర్తన స్థాయిని బట్టి సంబంధిత అధి కారులు వాస్తవాలను కేంద్రానికి సహాయార్థం సమర్పించడంలో కూడా చొరవ, నిజాయితీ అవసరం. ఇక్కడ అన్నింటికంటే ప్రధానమైన అంశం.. వాతావరణ శాఖ ఫలానా తుపాను విరుచుకుపడబోతున్నదని ప్రకటించిన మరుక్షణమే ఆ ఉపద్రవం ఘటిల్లడానికి ముందే తొలి ఇరవైనాలుగు గంటలలోనే తుపానుకు గురికాగల ప్రాంతాలనుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు, సహాయక కేంద్రాలకు హుటాహుటిన తరలించే చైతన్యం పాలకుల్లో ఉండాలి.

ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో 1970లలో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన తుపాను సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్త వహించిన ఆనాటి పాల కుల మూలంగా, 72 గంటల ముందుగానే అమెరికా వాతావరణ సంస్థలు అంత దూరంనుంచి మన బంగాళాఖాతం జలాల్లో రగులు తున్న, మసులుతున్న, సుడులు తిరుగుతూ పైకి ఎగసిపడుతున్న జ్వాలా తోరణాన్ని పసిగట్టి హెచ్చరించినా పట్టించుకోకుండా నిద్రావ స్థలో ఉన్న నాటి రాష్ట్ర పాలకుల అలసత్వం వల్ల దివిసీమ గ్రామాలను 12 అడుగుల ఎత్తున ముంచివేసి 10నుంచి, 12 వేలమంది నిండు ప్రాణాలను నిమి షాల్లో బలిగొన్నది. అలాంటి దారుణ విషాద ఘట్టాన్ని చవిచూడకుండా ఒడిశా ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వాతా వరణ శాఖ హెచ్చరికలు ప్రారంభమైన మరుక్షణం నుంచి శరవేగాన కదిలి, అధికార యంత్రాంగాన్ని తనచుట్టూ తిప్పుకోకుండా తుపాను నష్టనివారణ పనులకు వారిని హుటాహుటిన సంబంధిత ప్రాంతాలకు తరలించి ప్రజల రక్షణకు, పునరావాస, సదుపాయాల కల్పనకు ప్రాధా న్యమివ్వడంతో యావత్తు దేశ ప్రజల ప్రశంసలకు పాత్రులయ్యారు. ముఖ్యమంత్రి తన చుట్టూ అధికారుల్ని తిప్పుకుంటూ పచార్లు కొడుతూ ప్రజల దృష్టిని ప్రచార ఆర్భాటం కోసం ఆకర్షించుకోవడానికి పట్నాయక్‌ ఆస్కారం ఇవ్వలేదు. అధికారుల్ని స్వేచ్ఛగా రంగంలోకి దించి, తాను మాత్రం హెలికాప్టర్‌లో వెళ్లి నష్టాలకు గురైన ప్రాంతాలలో పర్యటించి, నష్టాన్ని అంచనా కట్టడానికి అధికారులతో సంప్రదించడానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం– పరమ ఆచరణ సాధ్యమూ నికార్సయిన వైఖరిగా మనం భావించాలి. ఇంతవరకు హుదూద్‌ తుపాను బీభత్సంవల్ల ఆంధ్ర ప్రదేశ్‌లోని బాధిత ప్రాంతాల పంటలకు, ఆస్తులకు, ప్రజలకు వాటిల్లిన నష్టాన్ని ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం అందించిన రూ. 1,600 కోట్ల సహాయానికి లెక్క జమా చూపలేదని ఈ క్షణం దాకా కేంద్రం ఫిర్యాదు చేయడాన్ని స్థానిక పాలకులు సిగ్గుగా, రాష్ట్రానికి తలవంపులుగా చంద్ర బాబు భావించడం లేదు. 

ఇప్పుడు పడగవిప్పి ఒడిశాకు భారీ నష్టం కలగజేసిన ‘ఫొని’ మాత్ర మేకాదు, రానున్న రోజుల్లో కాలుష్య వాతావరణం వ్యాప్తిని అరికట్టడా నికి శ్రద్ధ వహించని ప్రపంచ పాలకుల వైఫల్యం కారణంగా ఆ కాలుష్యం రానున్న రోజుల్లో వచ్చే సాధారణ వర్ష రుతువు చక్రగతిని కూడా భారీ ఎత్తున నిరోధించే అవకాశం ఉందని ‘నేచర్‌’ అనే అంతర్జాతీయ సాధి కార పరిశోధనా పత్రిక హెచ్చరిస్తోందని మరచిపోరాదు. ‘ఫొని’ వల్ల కలి గిన నష్టం ఒడిశాలో ఎంత తీవ్రస్థాయిలో ఉందంటే–లోతట్టు ప్రాంతా ల్లోని 10 వేల గ్రామాల నుంచి, 12 లక్షల మంది ప్రజల్ని 4 వేల సురక్షిత కేంద్రాలకు, 860 ఉచిత ఆహార సదుపాయ కేంద్రాలకు జయప్రదంగా లక్షమంది అధికారులు తరలించగలగడం ముఖ్యమంత్రి పట్నాయక్‌ చుట్టూ అధికారులు వందిమాగధులా ‘హల్లీసకం’ (నాట్యం) ఆడకపోవ డమే ప్రధాన కారణమని గుర్తించాలి. ఎందుకంటే, వసుంధర (భూమి) సౌందర్యానికి మూలం వానలు గదా. అందుకే ‘వరిపొట్టుకు పుట్టెడు నీరు’ కావాలన్న సామెత వచ్చింది. మనకు ఇంగ్లిష్‌ నెలలపట్టీ వచ్చి, తెలుగు వెలుగు నుంచి తప్పుకుని అక్కడ ‘మరక’ లేదు, ఇక్కడ ‘మచ్చ’ లేదనడానికి బదులు వ్యాపారకర్తల నోట్లో తెలుగు ‘నో మచ్చ’ ‘నో మరక’ అన్న అవతారం ఎత్తింది. తెలుగు పదాల వాడకానికే ‘నామోషీ’ అవుతున్నప్పుడు తెలుగు మాసాలు, రుతువులు, తిథులు, నక్షత్రాలు, దిక్కులు తెలియకుండా ‘దిక్కులు’ చూడ్డం ఆనవాయితీగా మారింది. రత్న శాస్త్రం మాదిరిగా వర్ష శాస్త్రం కూడా ఉంది.

ఆకాశంలో పుట్టిన మబ్బుల ఆకారాన్ని, రంగుల్ని బట్టి ఉరుములూ, మెరుపులూ చూసి, వానలు కురిసే తీరుతెన్నుల్ని అంచనా కట్టారు ప్రాచీనులు. ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరైన వరాహమిత్రుడు మబ్బులు చెట్ల ఆకారంలో కన్పించినా, నిగనిగలాడుతూ, తెల్లతెల్లగా వెలిమబ్బుల్లా కన్పించినా అలాంటి మబ్బులు నేలపైన అధికంగా వాన కురిపిస్తాయట. వాటి ఆకా రాలను వర్ణిస్తూ ఆయన మేఘాల సమూహాన్ని రకరకాలుగా వర్ణించడం ఒక విశేషం: అతనికెలా అనిపించిందట? ఆ మేఘాలు ఒక్కో కోణంలో ఒక మంచంలా, ఒక సింహంలా, ఏనుగు కుంభ స్థలంలా, ఒక విసనకర్ర (వింజామరం)లా, చంద్రబింబపు సొగసులా, గుడి గోపురంలా, వెండి కొండలా, ఓ చెరువులా, ఓ కొలనులా, గొడుగులా, మొసళ్లలా, దేవతా విమానాల్లో కనిపించాయట. మేఘాలు ఉంటే ధ్వనిని బట్టి అవి కురిసే మబ్బులా అరిచే మబ్బులా అని ఆయా మబ్బు రంగుల్ని బట్టి ఆయా ప్రాంతాల ప్రజల్లో పెరిగే కలహాలను కూడా ఊహించగలిగేవారట. విత్త నాలు జల్లాల్సిన కాలాల్ని, అందుకు అనుకూలించే కార్తెల్ని, నక్షత్రాల్ని పేర్కొనేవారు, ధాన్యాదుల తరగతుల్ని బట్టి, వేసే పైరుల్నిబట్టి పంట ‘జాతకం’ లెక్క గట్టేవారు, కోతల కాలాల్ని నిర్ణయించేవారు.

భారత వాతావరణశాఖ అయినా ఈ ఏడాది నిక్కచ్చిగా ఉజ్జాయింపున సరిగానే తుపానుల అవకాశాన్ని అంచనా వేసినా, ఫ్రెంచి పరిశోధకులు మాత్రం  సముద్రజలాల ఆధారంగా ఏర్పడే మెరైన్‌ మేఘాలు వాతావరణ మార్పులవల్ల వేడెక్కిపోతున్న భూమివల్ల వ్యాపించే సెగ నుంచి మానవు లకు రక్షణ కవచంగా తోడ్పడవచ్చునని ఊహిస్తున్నారు. సముద్ర ఉపరి తలంపై ఏర్పడే ఈ మేఘాలు వేడెక్కిపోతున్న వాతావరణంలో మరి రెండుమూడు రెట్లు పెరిగిపోయే బొగ్గుపులుసు వాయువుల్ని ఒక మేరకు చెదరగొట్టవచ్చునని కూడా వారు అంచనా వేశారు. ఈ ప్రమాదకర దృశ్యాన్ని వివరిస్తూ ఆ శాస్త్రవేత్తలు ‘మనకు తెలియని ఈ ప్రమాదకర వాతావరణం వాకిళ్లు తెరుచుకుని ఉందన్న వాస్తవాన్ని మరవరాదని’ కూడా హెచ్చరిస్తున్నారు. మన దేశం ఇరుగు పొరుగు దేశాలలో వచ్చే వేసవి తుపానులు వాయుగుండాలుగా గానీ, లేదా క్రమంగా అల్ప పీడ నం గానీ ఏర్పడవచ్చు. ఇలాంటి బాపతు తుపానులు 35 శాతం సంభ  వమని కూడా వారు చెబుతున్నారు. అయితే వీటిలో అత్యంత భీకర రూపం దాల్చి వినాశనం సృష్టించగలవిగా ఉంటే 7 శాతానికి మించవు. 

మన ఆలోచనలు, మనసులు, సభలు, సమావేశాలు అరుణారుణం కావచ్చుగానీ, మేఘం మాత్రం అరుణారుణం అయితే మాత్రం అతి తక్కువ వర్షం పడుతుందట. కనుకనే బహుశా మన ప్రాచీనులు పొలంలో విత్తనాలు చల్లడానికి (బీజావాపన) అనుకూలించే కార్తెల జాబితాను ఎంచుకుని ‘ఉత్తర’తో మొదలయ్యే మూడు నక్షత్రాలున్న (ఉత్తర ఫల్గుని, ఉత్తారాషాడ, ఉత్తరాభాద్ర) రోజున పొలంలో విత్తనాలు చల్లితే ఆయా ధాన్యాల రాబడి ఇబ్బడిముబ్బడిగా ఉంటుందని ఒక విశ్వాసం. కాగా ప్రపంచ విజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా సంస్థలు శాఖోపశాఖలుగా పెరిగి వాటితోపాటు విత్తన పరిశోధనలు కూడా తామ రతంపరగా వృద్ధి అవుతున్న ఆధునిక యుగంలో ఏ పంట వంగడమైనా అంటూ సొంటూ అన్న భేదం తొలగిపోయింది. అందుకే అన్నారు– ‘అదను ఎరిగి సేద్యం, పదును ఎరిగి పైరు’ అని!


-ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
 
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top