పరాకాష్టకు చేరిన సంక్షోభం

Article On Farmers Suicide In Punjab - Sakshi

విశ్లేషణ

ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి, సహకార బ్యాంకులలో రైతులు చేసిన అప్పుల్లో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ పంజాబ్‌లో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్యలోనే 645 మంది రైతులు అప్పుల వల్ల కలుగుతున్న అవమానాలను భరించలేక దారుణంగా జీవితాలను ముగించుకున్నారు. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు, సూక్ష్మరుణ కల్పన సంస్థల ఏజెంట్లు, బ్యాంకింగేతర ద్రవ్య సంస్థలు కలిసి రైతుల ఊపిరిని తీసివేస్తున్నాయి. రుణభారం మోయలేక పంజాబ్‌లో మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసుకోవడం అరుదైన ఘటన. ఇది పంజాబ్‌లో వ్యవసాయ సంక్షోభం పరాకాష్టకు చేరిందనడానికి సూచిక. వ్యవసాయ మెషినరీని అమ్మడానికి మాత్రమే కార్యాచరణలోకి దిగుతున్న ప్రభుత్వం.. మరోవైపున రైతుల ఆత్మహత్యలకు ఏవి కారణాలో తెలుసుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదన్నది నాకు అర్థం కాని ప్రశ్నే. 

లవ్‌ప్రీత్‌ సింగ్‌ ఎన్నో కలలతో బతుకుతున్న యువ రైతు. కుటుంబ వారసత్వంగా రూ. 8 లక్షల అప్పు తన నెత్తిమీద ఉందని తెలిసి కూడా వ్యవసాయంలో తన అదృష్టం పరీక్షించుకోవాలని భావించాడు. కానీ అప్పు తీర్చలేకపోవడంతో చివరికి జీవితాన్ని ముగించుకున్నాడు. అతడి వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. బర్నాలా జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్‌ సింగ్‌ ఆత్మహత్య పంజాబ్‌ మొత్తంగా ప్రకంపనలు సృష్టించింది. మూడు తరాలుగా వీరి కుటుంబంలో అయిదుగురి వ్యవసాయ సంక్షోభం బలిగొంది. ఒకటిన్నర సంవత్సరం క్రితం తన తండ్రి కుల్వంత్‌ సింగ్‌ ఉరివేసుకుని జీవితం చాలించాడు. పంజాబ్‌ ప్రభుత్వం రుణమాఫీ తొలి విడత పంపిణీని ప్రారంభించడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఈ విషాదం చోటు చేసుకుంది. అంతకుముందు లవ్‌ ప్రీత్‌ సింగ్‌ తాత కూడా ఇలాగే ఆత్మహత్య పాలయ్యాడు. ఎకరాకు సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించి 8 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాం. కానీ 2017లో పెనుతుపాను వల్ల గోధుమపంట పూర్తిగా దెబ్పతింది. దాన్నుంచి మేం కోలుకోలేకపోయాం అంటూ లవ్‌ప్రీత్‌ సింగ్‌ తల్లి మీడియాకు చెప్పింది. 

రుణభారం మోయలేక పంజాబ్‌లో మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసుకోవడం ఇదే మొదటి ఘటన కాబోలు. గతంలో ఇక్కడ తల్లిదండ్రులు, వారి కుమారులు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జరిగాయి కానీ ఆర్థిక సంక్షోభం ఒక రైతు నుంచి అతడి తదుపరి రెండు తరాల వరకు ప్రభావం చూపిందంటే ఇది ఎంత ఉపద్రవకరమైన ఘటనో స్పష్టంగా బోధపడుతుంది. జస్వంత్‌ సింగ్‌ అనే మరొక రైతు తన అయిదేళ్ళ కుమారుడిని తన వీపుకు కట్టుకుని నీటి కాలువలోకి దూకిన ఘటన నాకు గుర్తుకొచ్చింది. నీటి రూపంలోని సమాధిలోకి తన చిన్నారి కుమారుడిని కూడా తన వెంట తీసుకుపోవడం అన్యాయం అని తనకు తెలుసు కానీ తన నెత్తిమీద ఉన్న రూ. 10 లక్షల రుణాన్ని తన కుమారుడు ఎన్నటికీ తీర్చలేడని తెలుసు కాబట్టే ఈ చర్యకు పాల్పడుతున్నానని నోట్‌ రాసి మరీ కాలువలో దూకాడాయన. 

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి, సహకార బ్యాంకులలో రైతులు చేసిన అప్పుల్లో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ పంజాబ్‌లో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ సంవత్సరంలో జనవరి నుంచి జూలై మధ్యలోనే 645 మంది రైతులు అప్పుల వల్ల కలుగుతున్న అవమానాలను భరించలేక దారుణంగా జీవితాలను ముగించుకున్నారు. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు, సూక్ష్మరుణ కల్పన సంస్థల ఏజెంట్లు, బ్యాంకింగేతర ద్రవ్య సంస్థలు కలిసి రైతుల ఊపిరిని తీసేస్తున్నాయి. దీంతో వారు వేరే మార్గం లేకుండా ఆత్మహత్యల దారి పడుతున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ రూపొందించిన డేటా ప్రకారం 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2019 ఆగస్టు 31 లోగా 1280 మంది రైతులు, వ్యవసాయ కూలీలు పంజాబ్‌లో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుస్తోంది. 

దేశ గోధుమ ధాన్యాగారంగా పేరొందిన పంజాబ్‌ వాస్తవానికి కొన్నేళ్లుగా రైతు ఆత్మహత్యల మృత్యు శయ్యగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఆత్మహత్యలకు తెలియని కారణాలేవీ లేవు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు రుణాల మాఫీ పథకం ప్రారంభించినప్పటి నుంచి రూ.4,609 కోట్ల వ్యవసాయ మొండిబకాయలను రద్దు చేసింది. ఈ పథకం ద్వారా ఇంతవరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన 5,61,886 మంది రైతులు లబ్ధి పొందడం వాస్తవమే. అయితే భవిష్యత్తులో తాము ఇంకా బకాయిపడి ఉన్న మొండి రుణాలను రద్దు చేస్తారనే ఆశ లేశమాత్రంగా కూడా లేకపోవడంతో రైతులు మరో మార్గం చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పంజాబ్‌లో అధికార పార్టీ రైతులు సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, ప్రైవేట్‌ బ్యాంకులు, ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న వ్యవసాయ రుణాలను మొత్తంగా తీర్చి వేస్తానని వాగ్దానం చేసింది. ప్రభుత్వం కూడా దీన్ని ఇప్పుడు తృణీకరించలేదు కానీ ఈ రుణాలను మొత్తంగా తీర్చాలంటే రూ. 90,000 కోట్లు అవసరం అవుతుంది. ఇంతమొత్తం తన వద్ద లేదంటూ పంజాబ్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది.

2019 వరకు పంజాబ్‌లో జరిగిన రైతు ఆత్మహత్యలను పరిశీలిస్తే, ప్రతి రోజూ సగటున ముగ్గురు రైతులు బలవుతున్నారని స్పష్టమవుతుంది. 2017–18లో వరి ఉత్పత్తిలో అత్యుత్తమ ఫలితాలను సాధించినందుకు గానూ ప్రతిష్టాత్మకమైన క్రిషి కర్మాన్‌ అవార్డును అందుకున్న పంజాబ్‌లో మరోవైపున ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూండటమే పరమ విషాదకరమైన అంశం. 2009–10 నుంచి సెంట్రల్‌ పూల్‌కి వరిని అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రం పంజాబ్‌. 2010–11లో మాత్రమే పంజాబ్, ఆంద్రప్రదేశ్‌ కంటే వెనుకబడింది. ఇక గోధుమ విషయానికి వస్తే 2008–09 నుంచి పంజాబ్‌ జాతీయ ధాన్య నిధికి గోధుమను అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా రికార్డును నెలకొల్పుతోంది. అంటే మన దేశ ఆహార నిల్వల్లో 37.83 శాతం వాటా పంజాబ్‌ నుంచే వస్తోందన్నమాట. తన భూభాగంలోని  98 శాతం వ్యవసాయ యోగ్యంగా ఉంటూ, గోధుమ, వరి ఉత్పత్తిలో అధిక వాటాను కేంద్ర పూల్‌కి సమర్పిస్తూన్న పంజాబ్‌లో పెరుగుతున్న పంటల ఉత్పాదకతకు, తీవ్రమవుతున్న వ్యవసాయ దుస్థితికి మధ్య అంత అగాధానికి కారణమేమిటనేది బహుశా ఎవరూ వివరించలేరేమో..

ఇప్పుడు క్రిషి కర్మాన్‌ అవార్డు కోసం నిర్దేశించిన మూడు వర్గీకరణలకేసి చూద్దాం. అత్యధిక ఉత్పత్తిని సాధిస్తున్నందుకు 55 మార్కులను కేటాయించారు. రెండోది, రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధించడం కోసం ప్త్రత్యేక చొరవను తీసుకుంటున్నందుకు 30 మార్కులు విధించారు. చివరగా ఆహార ధాన్యాల అభివృద్ధి పథకాలకు అయ్యే వ్యయం కోసం 15 మార్కులను రిజర్వ్‌ చేశారు.. పంజాబ్‌లో వ్యవసాయ సంక్షోభం నిరంతరం ఎందుకు కొనసాగుతోందో ఇప్పుడు స్పష్టంగా బోధపడుతోంది. రైతులు పండిస్తున్న పంటల నుంచి 50 శాతాన్ని వారి సంక్షేమానికే కేటాయించేలా ప్యాకేజీని రీడిజైన్‌ చేసి ఉంటే ఈ ఉత్పాతం కొనసాగేది కాదు.  తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతు సమాజానికి స్వావలంబనతో కూడిన జీవితానికి హామీ కల్పించేలా ప్రభుత్వ విధానాలు ఇకనైనా దృష్టి పెట్టాలి.

ప్రభుత్వాలు వరుసగా లక్ష్యంగా విధిస్తున్న రికార్డు పంటను ఉత్పత్తి చేయడంకోసం నిరంతరం కృషి చేస్తున్న రైతుల సంరక్షణకు పాటు పడకుండా ఎలాగైనా సరే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంమీదే ప్రభుత్వ విధానాలు దృష్టి పెడుతున్నంత కాలం పంజాబ్‌ రైతుల దుస్థితి మారదు గాక మారదు. కొన్ని అధ్యయనాల ప్రకారం తృణధాన్యాలైన గోధుమ, వరి, జొన్న పంటల్లో పంజాబ్‌ ప్రపంచస్థాయి ఉత్పత్తి ప్రమాణాల్లో అగ్రగామిగా ఉంటోంది. కానీ అదే పంజాబ్‌ తన రైతుల పాలిట సమాధిగా మారుతోంది. మరొక ఉదాహరణ తీసుకుందాం. పొలాల్లోని చెత్తను తగులబెట్టడాన్ని నిరోధించడానికి  పంజాబ్‌ 6,400 రైతు బృందాలను ఏర్పర్చి వారికి మెషీన్లను ఇవ్వడానికి పూనుకొంది. పంట కోతలు పూర్తయ్యాక పొలంలో మిగిలే వరి దంట్లను ఎందుకు తగులబెట్టకూడదో రైతులను ఎడ్యుకేట్‌ చేయడానికి కూడా ప్రభుత్వం పూనుకుంటోంది. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు, రాష్ట్ర వ్యవసాయ శాఖకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రైతుల బృందాలతో నిత్యం సంబంధాల్లో ఉంటారు.

అత్యధిక సబ్సిడీతో అందించే మెషీన్లను అమ్మడానికి 6,400 రైతు బృందాలను ఏర్పర్చారు. అదే సమయంలో తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, వ్యవసాయదారుల ఆత్మహత్యలకు ఏవి కారణాలో తెలుసుకునేందుకు ఇలాంటి బృందాలను ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ సమాచారాన్ని పూర్తిగా సేకరించి కార్యాచరణకు ప్రభుత్వం ఎందుకు పూనుకోదు? వ్యవసాయ మెషినరీని అమ్మడానికి మాత్రమే కార్యాచరణలోకి దిగుతున్న ప్రభుత్వం.. మరోవైపున ఇంత పెధ్ద మానవీయ కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడం కోసం ఎందుకు పూనుకోదు?


దేవీందర్‌ శర్మ  

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top