నయవంచన వీడని ‘నారా’గణం

Article On Chandrababu Supporting Media Hypocrisy - Sakshi

విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అఖండ ప్రజాతీర్పు పొందిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలిసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావలసిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంలోనే ఏపీ ప్రజలు అత్యవసరంగా భావిస్తున్న ప్రత్యేక హోదాతోపాటు విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన తదితర హామీలు, కేంద్రం నెరవేర్చాల్సిన బాధ్యత ఆవశ్యకతపై దాదాపు గంట పాటు వివరించి, వినతిపత్రం కూడా అందచేశారు. తర్వాత ఢిల్లీలోనే జాతీయ మీడియాతో భేటీలో తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ‘మన దురదృష్టం కొద్దీ కేంద్రంలో మనం కోరుకున్నట్లు ఎన్డీఏ 250 స్థానాలకు పరిమితం కాకుండా బీజేపీ కూటమికి 300 స్థానాలకు పైగా వచ్చాయి. మన అవసరం కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి లేదు. అయినా ఏపీకి ప్రత్యేక హోదా, తదితర హక్కుల సాధన కోసం మన కృషిని సాగిస్తాం. నేను మోదీజీని కలిసిన ప్రతిసారీ ఆ విషయమై ప్రస్తావిస్తూనే ఉంటాను’ అని జగన్‌ చెప్పారు. ఒక మార్క్సిస్టుగా నా దృష్టిలో దేశం విషయంలో ప్రస్తుత ప్రధాన వైరుధ్యం కేంద్రంలో బీజేపీ కూటమికి ప్రజలకు మధ్యనే! నావంటివారికి జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ జాతీయ మీడియా ముందు, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ‘మన దురదృష్టం కొద్దీ మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ వచ్చింది’ అని చెప్పడం ఒక సాహసమే అనిపించింది. ఏపీ ప్రజల ప్రయోజనాల పట్ల మొహమాటపడకుండా తన నిబద్ధతను, కర్తవ్యాన్ని స్పష్టంగా చెప్పడం అవసరమనే భావించి, అలా చెప్పారనిపించింది! 

ఇంకేం! వెన్నుపోట్ల పార్టీ అయిన చంద్రబాబు టీడీపీ అనుకూల మీడియా చానల్‌ ఒకటి ‘ప్రత్యేక హోదాపై జగన్‌ చేతులెత్తేసినట్లేనా? మన ఖర్మ అనుకోవలసిందేనా?’ అనే రీతిలో చర్చపెట్టింది. ఇంకో చానల్‌ మోదీని ఢీకొనేది ఎవరు? అది జగనా, చంద్రబాబా అన్న రీతిలో వారిరువురి ఫొటోలతో మరో ప్రోగ్రాం నిర్వహించింది. ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవనున్నదన్న రీతిలో, తనకూ, తన పాలనకూ ప్రజలు కనీవినీ ఎరుగని ఘోరపరాజయం కట్టబెట్టారు. ఆ ఆత్మన్యూనతా భావన నుంచి ఇంకా బాబు తేరుకోలేదు. మీడియా ముందుకు వచ్చి రాజకీయ కామెంట్‌ స్పష్టంగా ఇంతవరకూ చెప్పిందీ లేదు. ఇక ఆయన మోదీని ఢీకొనే ప్రశ్న ఎక్కడిది? అయినా ఢీకొనగల శక్తి ఏమి మిగిలింది కనుక? ఆయన పార్టీకి లోక్‌సభలో వచ్చిన స్థానాలే ముచ్చటగా మూడంటే మూడే. అందులోనూ గుంటూరునుంచి ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించిన గల్లా జయదేవ్‌ సీటు ఐదేళ్లూ పూర్తి కాకుండానే ఎన్నడైనా గల్లంతయ్యే అవకాశం ఉంది. ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌లు పదివేలు ఉండగా, వాటిని లెక్కించకుండానే అయిదువేల మెజారిటీతో జయదేవ్‌ జయించినట్లు చట్టవ్యతిరేకంగా ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఒకవైపు తాను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రకటించారన్న అంశంపై రుజువులతోసహా అక్కడ పోటీచేసిన వైఎస్సా ర్‌సీపీ అభ్యర్థి కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. విజయవాడ నుంచి చంద్రబాబు టీడీపీ తరపున వాస్తవంగా గెలిచిన కేశినేని నాని వంటి సాపేక్షికంగా అనుభవజ్ఞుడు ఉండగా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్‌నే చంద్రబాబు ప్రకటించారు. సహజంగానే ధర్మాగ్రహంతోనే తాను అవమానానికి గురైనట్లుగా భావించిన కేశినేని ట్విట్టర్‌లో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే చంద్రబాబు, పుండుమీద కారం చల్లినట్లు ఆ జయదేవ్‌నే కేశినేని వద్దకు రాయబారం పంపారు. అయినా కేశినేని లొంగలేదు. పైగా పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస బంధనాలు తప్ప అంటూ ట్వీట్‌ చేశారు. ఎవరిమీద పోరాటమో వేరే చెప్పాలా? ఇకపై ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇలాంటి స్థితిలో ఉన్న తన పార్టీ తరపున చంద్రబాబు మోదీని ఢీకొట్టడమా? ఆ ఛానల్‌ వారిది ఎంత కమ్మని కల?

ఇలాంటి మీడియాలే జగన్‌కి, బీజేపీకి లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేశాయి. చేస్తున్నాయి. కనుకనే ఢిల్లీ పత్రికాగోష్టిలో అలా మెత్తగా మాట్లాడారట జగన్‌. మోదీతో సమరశీల పోరాటం చేస్తామని జగన్‌ చెప్పాలని అనుకుంటున్నాయి కాబోలు. నాలుగేళ్లు నిర్లజ్జగా మోదీతో సహజీవనం చేసిన చంద్రబాబు విషయం వారెత్తరు. అయినా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రమ్మని మోదీని ఆహ్వానించేందుకు వెళ్లిన జగన్‌ పెళ్లికి వెళ్లి తద్దినం మంత్రాలు చదివినట్లు అప్పుడే శరభా శరభా దశ్సరభశరభా అంటూ బాలకృష్ణ వలే తొడగొట్టాలా? ఇలా కుంటి సవాళ్లు విసిరే చానళ్లకు కొంచమైనా ఇంగితజ్ఞానం ఉండాలి! 

ఇంతెందుకు, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ చేసిన ప్రసంగంలో ఒక్కసారైనా ప్రశంసాపూర్వకంగా అన్న సంగతి అటుంచి, మామూలుగానైనా మోదీ ప్రస్తావనను జగన్‌ తెచ్చారా? పైగా వైఎస్‌ జగన్‌ ఆదినుంచి తన వైఎస్సార్‌సీపీని తెలుగు ప్రజల ప్రయోజనాలు, పురోగమనం, శ్రేయస్సు ఇవే ధ్యేయంగా దిశానిర్దేశన చేస్తూ వచ్చారు. జగన్‌ సర్వమత సమానత్వానికి చిహ్నంగా తన ప్రమాణ స్వీకరణ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వాదం బహిరంగ వేదికపై స్వీకరించారు. ఒక సందర్భంలో తాను రోజూ బైబిల్‌ చదువుతాననీ చెప్పారు. కడపలో దర్గాకు వెళ్లారు. బీజేపీ వారు ఆనందించి, అభినందించే చర్యలేనా ఇవి? ముస్లిం మైనారిటీల పట్ల, దళితుల పట్ల, మహిళల పట్ల, వెనుకబడిన కులాలవారి పట్ల తనకున్న గౌరవాదరాభిమానాలు ప్రజలకు స్పష్టంగా తెలియాలనే వారిలో 5 గురికి ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చారు. తన మంత్రి వర్గంలో సైతం వారికి దాదాపు 60 శాతం మేరకు అమాత్య పదవులనిచ్చి ఆదరించారు. భారతదేశ వైవిధ్యాన్ని వివిధ జాతుల సముదాయంగా అంగీకరించలేని ఆరెస్సెస్, బీజేపీ వారికి జగన్‌ పాటిస్తున్న సర్వమత సమభావం, సామాజిక న్యాయం, సౌమ్యత నచ్చుతాయా? ఒకవేళ, మన తెలుగు జాతి మన సంస్కృతి మన సాంప్రదాయాలను మన మాతృభాష తెలుగును రోడ్డురోలరుతో, అఖండభారత్‌ పేరిట చదును చేయాలని, మతతత్వ శక్తులు యత్నిస్తే, జగన్‌ మన జాతి ప్రజల తరపున పోరాడనని చెప్పాడా? పైగా ఈ మోదీ ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన చరిత్ర వైఎస్సార్‌ సీపీకి ఉంది. ఇలా కాకుండా తమ నేత బాబులానే మనపార్టీ విజయం నూటికి వెయ్యిసార్లు నిజమని ఉత్తర కుమార ప్రతినలు చేయాలా? 

‘సామాజిక న్యాయం పాటించారు మంచిదే కానీ ఆయా మంత్రిత్వ శాఖలను నిర్వహించే అనుభవమూ, సామర్థ్యమూ వారికి ఉండాలి కదా’ అని వెన్నుపోట్ల పార్టీ విశ్లేషకులు కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయ్యా, తమ నేత 40 ఏళ్ల అనుభవం, అంతకుతగ్గ సామర్థ్యం ఉందని తామంతా భజన చేసిన వారే కదా! ఆయనగారి నిర్వాకం వల్లే కదా.. గత 55 ఏళ్ల పాలనలోనే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నడూ ఎరుగనంతటి అవి నీతిని, ఆశ్రితపక్షపాతాన్ని పాలక పార్టీ నేతల అహంకారాన్ని, నయవంచనను చవిచూసి అధోగతి పాలైంది. చివరకు అనుభవం, సామర్థ్యం అనే పదాలు వినగానే చంద్రబాబు ప్రగల్భాలు గుర్తుకొచ్చి జనాలు భయపడిపోతున్నారు!

మరోవైపున అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి పార్టీ ముఖ్యులకు మంత్రిపదవులు దక్కనందుకు చాలా మథనపడుతూ ఒక చానల్‌లో వెన్నుపోట్ల పార్టీ నేత ఒకరు మహా ఆవేదన చెందుతున్నారు? వారు పదవులు ఆశించేవారే అయితే ఆ స్థాయికి ఎదిగేవారు కాదు. ఇప్పుడున్న మంత్రివర్గంలో 90 శాతం మందిని రెండున్నర సంవత్సరాల తర్వాత మార్చి, పార్టీని పటిష్టపరిచే పనికి పంపుతానని జగన్‌ చేసిన ప్రకటనను కూడా ఈ చానల్స్‌ వక్రీకరించి, 2024 ఎన్నికలలో అవసరాల రీత్యా పైన పేర్కొన్నటువంటివారిని అప్పటి మంత్రివర్గంలోకి జగన్‌ తీసుకుంటారని వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి, మంత్రివర్గం ఎర్పర్చే సమయంలోనే తమకున్న పదివీకాలమెంతో చెప్పి పదవి అనేది గతంలోవలే వ్యక్తిగత అనుభవానికి కాదు, ప్రజలకు సేవ చేసి వారికి చేరువయ్యేందుకు మాత్రమేనని స్పష్టం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ తప్ప మరెవరైనా ఉన్నారా? అయినా అంబటి, భూమన, రోజా, ఆర్కే వంటివారి ప్రతిభ గురించి జగన్‌ కంటే ఈ చానల్స్‌కే ఎక్కువ తెలుసా? ఇలాంటి అసత్య ప్రచారాలతోటే మీడియా శివాజీ వంటి వృద్ధిలోకి రావలసిన సినీనటుడిని భ్రష్టుపట్టిం చింది. లగడపాటివంటి చంద్రబాబు నిగూఢ మిత్రులను గొప్ప మేధావులని పైకెత్తేసి ఆ క్రమంలో తమ అనుకూల పార్టీవారినే ముంచేశారు. ఇది ఏ స్థాయికి చేరిందంటే, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రయి, మిగిలిన రాజధాని, పోలవరం, పారిశ్రామిక ప్రగతి కొనసాగించేందుకు తగిన సమర్థులు అని ప్రజలు డిసైడ్‌ అయిపోయారని చెప్పించే చెప్పి బాబునే మునగచెట్టు ఎక్కించేశారు. చివరకు ఆ మునగ కొమ్మ విరిగిపడిన ఫలితంగా ఆ పార్టీ కూసాలే కదిలిపోయాయి. అంతకుమించి చంద్రబాబు ఇంతవరకు జనాలకు ముఖం చూపించలేకపోతున్నారు. 

కమ్యూనిస్టులు వాస్తవాన్ని దాచేందుకు అంగీకరించని చందాన, సాక్షి పత్రిక తాను వైఎస్సార్‌ ఆశయసాధనకు కృషి చేస్తానని స్పష్టం చేస్తూ, ఆ దివంగత నేత ఫొటోను తొలిపేజీలోనే ముద్రిస్తూనే, ప్రాముఖ్యమైన ఇతర వార్తలనూ అందిస్తోంది. మిగతా చానళ్లు కూడా అలా స్పష్టం చేస్తే బాగుంటుంది కదా! ఒకప్పుడు ప్రజాశక్తి పత్రికపై సుత్తీకొడవలి గుర్తు ఉండేది. అందువల్ల పత్రిక సర్క్యులేషన్‌ తగ్గుతోందని తర్వాత ఆ గుర్తును తీసేశారు. కానీ వైఎస్సార్‌ ఫోటోతో ప్రచురితమయ్యే సాక్షికి ప్రజాదరణ తగ్గిందా? పైగా పెరిగింది కూడా! ఇలాంటి పైపై మార్పులపై పార్టీల, పత్రికల పాఠకుల సంఖ్య, ప్రతిష్ట ఉండదు. ప్రజల మనోభావాలకు దూరంగా, స్వీయమానసిక దృక్పథంతో వ్యవహరిస్తే, ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా క్రమేపీ ప్రజలకు దూరమై కనుమరుగవుతుంది. మార్క్సిజాన్ని అన్వయించడం అప్పటి భౌతిక వాస్తవికతకు అనువుగా ఉండాలి. మార్క్స్‌ చెప్పిందీ అదే. 

మన రాష్ట్ర పరిస్థితిలో చంద్రబాబు నయవంచక పాలనను ఓడిం చడం.. అలాగే కేంద్రంలో జాతీయోన్మాద, మతతత్వ పార్టీ రాకుండా నిరోధించే యత్నం చేయడం.. ఇదే మార్క్సిస్టుల దిశగా ఉండాలి.  ప్రజానుకూల, సామాజిక న్యాయసాధనా దిశగా పురోగమించే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ప్రజల్లో ఎన్నో ఆశలు, తమ భవిష్యత్తు మెరుగ్గా ఉంటున్న భరోసా ఉంది. కావలసింది మన కమ్యూనిస్టులం ఐక్యమై ఆ భరోసా నిలబడేటట్లు, ఆ పురోగమనం దిశ మార్చుకోకుండా, తిరోగమనం చెందకుండా ప్రజలకు అన్నివేళలా, అండగా నిలబడటం! వర్గ దృష్టితోపాటు సామాజిక న్యాయాన్ని  నిలబెట్టాలి. చివరగా మన ఏపీ ప్రజానీకానికి వారు చూపించిన చైతన్యానికి, వైఎస్‌ జగన్‌ రూపంలో వారు ప్రస్తుతం సాధించిన అద్భుత విజయానికి కృతజ్ఞతాభివందనలు.


డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98480 69720

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top