ఆర్టికల్‌ 370 జమ్మూకశ్మీర్‌కు అవసరమా?

Is Article 370 Required For Jammu And Kashmir - Sakshi

భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ దేశానికి ఇచ్చిన మహా ప్రసాదమే ‘‘ఆర్టికల్‌ 370’’.  ఆయన ఏ ఉద్దేశ్యంతో దీనిని ప్రవేశపెట్టారో గానీ, దేశ సమగ్రతకు భంగం కలిగేలా, తీవ్రవాదానికి ఊతమిచ్చేలా ఇది తయార య్యింది. అప్పటి జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత షేక్‌ అబ్దుల్లా, భారత ప్రధాని నెహ్రూ, కశ్మీర్‌ సంస్థాన రాజు హరి సింగ్, ఆస్థాన దివాన్‌ గోపాలస్వామి అయ్యంగార్‌ల మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే ఈ ‘‘ఆర్టికల్‌ 370’’. 

డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ భారత రాజ్యాం గాన్ని రచించినప్పటికీ, ఆర్టికల్‌ 370ని మాత్రం ఆయన రూపొందించలేదు. కశ్మీర్‌ రాజు హరి సింగ్‌ దివాణంలో దివాన్‌గా పని చేసిన గోపాల స్వామి అప్పట్లో కశ్మీర్‌ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న షేక్‌ అబ్దుల్లా, ఇతర కశ్మీర్‌ నేతలతోనూ, భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, హోం మంత్రి సర్దార్‌ పటేల్‌తోనూ విస్తృతమైన చర్చలు జరిపి ఈ ఆర్టికల్‌ 370 ని తయారు చేసారు. గోపాలస్వామి ఈ ఆర్టికల్‌ 370ని తీసుకురావడానికి ముఖ్య కారణం తమ ఆస్థానం, తమ రాజుగారి పరిపాలనను పాక్షికంగా సజీవంగా ఉంచాలని తలచి, స్వామిభక్తితో తయారు చేశారు, అందులో భాగంగానే కశ్మీర్‌ భూభాగాన్ని మిగిలిన అన్ని రాజ్యాల భూభాగాల మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా ఉంచాలని, భారత ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గిస్తూ తమ రాజుకు కొన్ని విశిష్ట అధికారాలను కట్టబెట్టాలని తలచి ఆర్టికల్‌ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌ భారత్‌లో విలీనం అయినప్పటికీ జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి అందే విధంగా ఈ అధికరణను రూపొందించారు. 

కశ్మీర్‌ ప్రజల మనుగడ కోసం, వారి హక్కుల కోసం తీసుకొచ్చిన ఆర్టికల్‌ 370 వారికి ఉపయోగపడకపోగా అది పాకిస్తాన్‌ ఉగ్రవాదుల పాలిట వరంగా అవతరించింది పాకిస్తాన్‌ ఉగ్రవాదులు అక్కడ పాగా వేసి అటు జమ్మూ కశ్మీర్‌ ప్రజలను సుఖంగా బతకనీయకుండా, ఇటు భారత్‌ని టార్గెట్‌ చేస్తూ దాడులకు దిగడానికి ఈ ఆర్టికల్‌ 370 ఒక రాజమార్గంలా ఉపయోగపడుతోంది. ఉగ్రవాదులు తమ స్థావరాలను శాశ్వతంగా జమ్మూకశ్మీర్‌లో ఏర్పరచుకోవడానికి, దాడులకు ప్లాన్‌ చేసుకోవడానికి భారతదేశమే స్వయంగా ఈ ఆర్టికల్‌ 370 రూపంలో అమూల్యమైన ఆయుధాన్ని ఉగ్రవాదుల చేతిలో పెట్టిం దని చెప్పాలి. ఈ సమస్యకు మధ్యే మార్గం అనే సొల్యూషన్‌ లేదని, ఆర్టికల్‌ 370 వల్ల భారత్‌ ఇప్పటికీ నష్టపోయింది చాలని, నిర్ద్వంద్వంగా ఆ అధికరణను రద్దు చేసి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్ట వ్యవస్థ కిందికి కశ్మీర్‌ను తీసుకురావాలన్నదే మోదీ ప్రభుత్వ ఆలోచనలా కనిపిస్తోంది.

ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ముఖ్యమంత్రి రాజీనామా, గవర్నర్‌ పాలనను విధించి, కశ్మీర్‌ అడ్డాగా ప్రజల ప్రాణాలను తీస్తూ, అమాయకులైన ముస్లిం యువతను తీవ్రవాద ఉచ్చులోకి దింపుతూ కశ్మీర్‌ను రావణ కాష్టంలా మండిస్తున్న వేర్పాటు వాద, తీవ్రవాదులను సైనిక చర్యల ద్వారా అదుపులోకి తీసుకోవడం లాంటి పరిణామాలు వీటికి అద్దం పడుతున్నాయి. ఇది ముమ్మాటికీ స్వాగతించాల్సిన విషయం, అలా స్వాగతించకుండా మొండి ధైర్యంతో దేశానికి పట్టిన తీవ్రవాద భూతాన్ని వదిలించే దిశగా ముందడుగు వేస్తున్న మోదీ లాంటి ప్రధానిని అడ్డుకోవడం, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడమే అవుతుందని మేధావి వర్గం, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

అలా ఉగ్రవాదుల పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌ పార్టీలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రజలందరూ వారికి తగు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైం దని, దేశ రక్షణ, సార్వభౌమత్వం కన్నా వారికి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారని, కొందరు విశ్లేషకులు, యువత అభిప్రాయపడుతున్నారు.


గుండోజు శ్రీనివాస్‌, వ్యాసకర్త ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు
మొబైల్‌ : 99851 88429

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top