ప్రజల మొగ్గు జగన్‌ వైపే | Sakshi
Sakshi News home page

ప్రజల మొగ్గు జగన్‌ వైపే

Published Wed, Apr 10 2019 1:45 AM

AP Vittal Article On Political War In Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును నిర్ణయించనున్న ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తప్పదని జాతీయ స్థాయి సర్వేలు మూకుమ్మడిగా తేల్చి చెప్పడం వాస్తవం. కానీ చంద్రబాబు శకుని రాజకీయ కౌటిల్యంపై ఏమరుపాటుగా ఉండరాదు. ఎలాగైనా ఈసారీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో బాబు ఏస్థాయికైనా వెళ్లి ఓటింగ్‌ ప్రక్రియను తారుమారు చేసే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటమి తన రాజకీయ జీవితానికి సమాధి కానుందన్న భయంతో బాబు చివరి క్షణంలో చేసే కుటిల పన్నాగాల పట్ల.. మార్పు కోరుతున్న రాష్ట్ర ప్రజానీకం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. 

ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠకు సాధికారికంగా తెరపడటానికి ఇంకా నెలా పదిహేను రోజులు ఉన్నప్పటికీ చంద్రబాబు ఉక్రో షం, ఆయన హావభావాలు, అప్రస్తుత ప్రసంగాలు, చెబుతున్న అబద్ధాలు, అన్నీ యూట ర్న్‌లతో గుంటలు, గతుకుల రోడ్డులో ప్రయాణంలాగా సాగుతూ ఆయన పుట్టి మునగబోతున్నదని అందరికీ అర్థం అవుతోంది. పరాజయం తప్పదని అర్థమవుతున్నా, పాత సినిమాల్లో కీ.శే. పేకేటి గారు ‘మనవాడు తల్చుకుంటే ఏమైనా చేస్తాడు’ అన్నట్లుగా ఇంకా ఏదో దింపుడు కళ్లం ఆశ మినుకు మినుకుమంటున్నట్లుంది! 

కానీ బాబు ఓటమిపై ఇంత తిరుగులేని ధీమా ఉండినా ఎక్కడో ఒక మూల కొంచెం అనుమానం లేకపోలేదు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో.. బాబును ఓడించాలి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలి అన్న దృఢ నిశ్చయం పట్ల అనుమానం ఏమీలేదు. కానీ బాబు శకుని రాజకీయ కౌటిల్యంపైనే అనుమానం ఉంది. బాబు చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న పాలనా యంత్రాంగ పెద్దలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచి, ఎన్నికల కమిషన్‌ తీవ్ర చర్యలకు పూనుకున్నప్పటికీ, వాటితోనే నేటి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని భావించలేము. బాబు ఎంతో ఆశతో, పథకం పన్ని సాధారణ పాలనా విధానాలకు భిన్నంగా అడ్డదారిన ఇంటెలిజెంట్‌ ఏజెంటుగా కులదోస్తు ఏబీ వెంకటేశ్వరరావును నియమించుకుంటే,  వైఎస్సార్‌సీపీ ఆరోపణలను పరిశీలించిన ఈసీ ఆయనను బదిలీ చేసింది.

దాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై ధిక్కారంగా ప్రచారం చేసి, ఒక ఉద్యోగి తరపున బాబు ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి అక్కడ కూడా భంగపడి చివరకు ఈసీ ఆదేశానికి తలవంచింది. బాబు తన అతి తెలి వితేటలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే మార్చాల్సిన పరిస్థితిని కల్పించుకున్నారు. ఇంతకీ ఆ ఇంటెలి జెంట్‌ ఏజెంటు పదవి నుంచి వెంకటేశ్వరరావును తొలగించిన తర్వాత కూడా రెండు రోజుల వరకు ఆయనకే ఆ శాఖలో కింది ఉద్యోగులు తమ వద్ద ఉన్న సమాచారం రూల్స్‌కి విరుద్ధంగా అందజేశారని సమాచారం. వీటన్నిం టినీ వైఎస్సార్‌సీపీ ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే బాబు రాజ్యాంగ విరుద్ధమైన దూకుడుకు బ్రేక్‌ పడింది. ఎన్నికల మేనేజ్‌మెంట్‌ పేరిట చాలా దురాలోచనతో కూడిన దూరదృష్టే బాబు కుటిల రాజకీయం! 

ఈ ఎన్నికల్లో ఓటమి తన రాజకీయ జీవితానికి సమాధి కానుందన్న భయం బాబులో ఎంత తీవ్రంగా ఉందో ఇటీవల ఆయన ప్రసంగాలు వింటుంటే అర్థం అవుతూనే ఉంది. ‘ఈ ఎన్నికల్లో మీకు, కార్యకర్తలకు ఖర్చులకోసం 5 రూపాయలు నా జేబులోంచి ఇచ్చినా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అందుకే నేను ఒకటే ఆలోచించాను. నా చేతిలో డబ్బు పైసా తీయకుండానే ప్రభుత్వం ద్వారా (ఈ ఎన్నికల ముందు) మీ బ్యాంకు ఖాతాల్లో పడేట్టు పసుపు కుంకుమ అనో, అన్నదాత సుఖీ భవ అనో వివిధ పథకాల పేరుతో డబ్బు జమ అయ్యేట్టు వేయిస్తున్నాను. (అంటే రేపు ఎన్నికలలో నా పార్టీకి ఓటు వేసేందుకు ముందుగా డబ్బులు పంచుతున్నాను అని స్పష్టం చేసినట్లే) నేనిచ్చిన డబ్బులు తీసుకుని నాకు ఓటెయ్యకుండా ఉంటారా! నా డబ్బులు తీసుకుని ఇళ్లలో తొంగుంటారా!’ అని నిర్లజ్జగా దబాయించి మరీ అడి గారు.  అయితే బ్యాంకులలో ఆ డబ్బులు జమ అవుతాయో లేదా ఒకవేళ డబ్బులు పడినా బ్యాంకులు ఆ డబ్బులను చెల్లిస్తాయో చెల్లించవో! లబ్ధిదార్ల గత బకాయిల పేరుతో జమ చేసుకుంటాయోమో? అనే భయాలు ప్రజల్లో ఉన్నందున చివరకు ఈ ప్రయత్నం కూడా వట్టి హుళక్కి అవుతుందేమోనని బాబు దిగులుపడుతున్నారు.

ఇక ప్రచార పర్వం ముగిసినట్లే కదా! అయినా బాబు మాత్రం సాధికారికంగా, టీడీపీ ఘోరపరాజ యాన్ని ఈసీ ప్రకటించేవరకూ తన కుటిల ప్రయత్నాలను మానుకోరు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ప్రజలు తమ ఇష్టానుసారం ఓటింగులో పాల్గొనకుండా చూడటం మొదటిది. డబ్బులు పంచేటప్పుడే మాకు ఓటెయ్యకపోయినా సరే, పోలింగులో పాల్గొనకుండా ఉంటే చాలు అని ఒప్పందం చేసుకున్నారు బాబు పార్టీవాళ్లు. డబ్బులు తీసుకున్నవాళ్ల చేత ఒట్టు వేయించుకుని ఉన్నా ఆ ప్రమాణాలను నమ్మే రోజులు కావని తెలుసు కనుక పోలింగ్‌ బూత్‌కి వెళ్లకుండా భౌతికంగా నిర్బంధించే దుష్ప్రయత్నాలకూ టీడీపీ వెనుకాడదు. స్థానిక వైఎస్సార్‌సీపీ ముఖ్యులను ఒక పదిమందిని గృహనిర్బంధం చేసే దుర్మార్గానికి కూడా తెరతీయవచ్చు. మారిన పరిస్థితుల్లో పోలీసుల మీద ఆధారపడటం సరిపోదని భావించి తమ పార్టీ వాళ్ల చేతనే దౌర్జన్యానికి ప్రేరేపించవచ్చు. కనుక ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు కీలకమైన ఓటింగ్‌ సక్రమంగా స్వేచ్ఛగా జరిగేందుకు పోలింగు బూత్‌ స్థాయిలో యువశక్తి తమ వంతు కృషి చేయాలి. 

ఎలాగూ తాము గెలిచే పరిస్థితి లేదనీ, ప్రజాతీర్పుతో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడం అనివార్యమనే నిర్ణయానికి వస్తే బాబు తన చాణక్య అనుభవంతో ప్రజాతీర్పు సవ్యంగా రాకుండా దుర్నీతికి సిద్ధపడినా ఆశ్చర్యం లేదు. తన అర్హతకు మించి స్థానమిచ్చిన తన  మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి, పదవీ భ్రష్టుడిని చేసిన కృతఘ్నతా చరిత్ర బాబుది. అలాంటి వాడు జగన్‌ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఎన్ని పన్నాగాలైనా పన్నే ప్రయత్నం చేస్తారు. తామే అలజడులు, అల్లర్లు, అరాచక పరిస్థితులు సృష్టించి ఎన్నికలు సజావుగా జరిగే వాతావరణం లేనట్లు తప్పుడు ప్రచారం చేసేందుకు వెనుకాడరు. ఇటీవలే జగన్‌ బాబాయి వివేకానందరెడ్డిని ఇంట్లోనే హత్య చేసి ఆ పాపం జగన్‌ పార్టీ వారిపై నెట్టే ప్రయత్నం చూశాం కదా. ఇందుకు స్థానిక పోలీసు యంత్రాంగాన్ని వాడుకున్న తీరు ఎరిగినదే! 

అయితే అయిదేళ్లలో చంద్రబాబు, ఆయన అంతేవాసుల అధికార అహంకారాన్ని స్వయంగా చవిచూసిన సాధారణ ప్రజానీకం సైతం ఈ అరాచకత్వం పట్ల అసహనంతో అసహ్యంతో ఉన్నారు. కనుక గతంలో వలే కేవలం ప్రేక్షక పాత్రకే వారు పరిమితం కారు. కాబట్టి ప్రజాభీష్టం మేరకు సవ్యంగా ఎన్నికలు జరిగి, అక్రమార్కులను, అవి నీతిపరులను అధికార అహంకారులను, వారికి తోడ్పడే ముసుగువీరులను అందరినీ ఓడించి, ప్రజా సంక్షేమానికి తెలుగు ప్రజల పురోభివృద్ధికి వైఎస్సార్‌సీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజయం చేకూర్చగలరని ఆశ, విశ్వాసమే కాదు. ఆచరణలో అనుభవం కానున్న వాస్తవం.

వ్యాసకర్త : డాక్టర్‌ ఏపీ విఠల్‌, మార్క్సిస్టు విశ్లేషకులు

మొబైల్‌ : 98480 69720

Advertisement
 
Advertisement
 
Advertisement