పెట్టుబడుల మత్తులో పెద్దలు

ABK Prasad writes on GES and Investments - Sakshi

రెండో మాట

ఇక్కడ బిచ్చగాళ్లు, సామాన్య జనాభా, నిరుద్యోగులు, అన్నార్తులు లేరనీ, పేదవాళ్ల గుడిసెలు లేవనీ చాటుకోవాలన్న తాపత్రయం పాలకులలో కనిపించింది. ఇవాంక కళ్లు కప్పేందుకు చేసిన ఈ పనులన్నీ ప్రజలను అవమానించేవే. ఎవరి రాకకోసమో బిచ్చగాళ్లను ఎక్కడికో తరలించడమే కాదు. పలు రకాల పేర్లతో పన్నులు వసూలు చేస్తున్నా హైదరాబాద్‌ రోడ్ల సంగతే పట్టని నేతలు, ఇవాంక రాకతో ఆగమేఘాల మీద కోట్ల రూపాయలు వెదజల్లి వాటికి మరమ్మతులు చేయించారు.

‘రకరకాల విదేశీ వస్తు సముదాయాన్నీ, సర్వీసులనూ దేశంలోకి దింపేసి, అవి కరువైతే జనజీవితం ఒట్టిపోతుందని నమ్ముతున్న పాలకులు ప్రజలను తలవంచుకుని సరిపెట్టుకునే గొర్రెల్లా భావిస్తున్నారు. అంతేతప్ప ఈ దేశంలో చిన్నారులు, కుటుంబాలు, సమాజం లేదా ప్రపంచం ఏ దిశలో ప్రయాణిస్తున్నదో ఆలోచించేందుకు మెదడుకు పనిచెప్పగల స్థితిలో లేకుండా చేశాం. ఎందుకని? మన సామాజిక సంబంధాలన్నింటినీ లాభాల వేటలో ఉన్న మార్కెట్‌ శక్తులకు అప్పచెప్పాం. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేనికున్నాయంటే, వస్తు దాహపు మహమ్మారిని సాకడానికి ఎదురుచూస్తున్నాయి. నయా ఉదారవాద సామ్రాజ్యవాద శకం ప్రతిచోట నిర్బంధ పాలనా వ్యవస్థలను, భయానక వాతావరణాన్ని నెలకొల్పుతున్నది. ఈ దుష్పరిణామం కుటుంబ జీవితాలలోకీ, తల్లీబిడ్డల ఆత్మీయ బంధాలలోకీ ప్రవేశించి చిందరవందర చేస్తోంది. వ్యాపారం పేరిట వచ్చి వ్యవహారం చక్కబెట్టిన చందంగా ఈ మకిలి అందరినీ కాలుష్యం పాల్జేస్తున్నది.’ - (సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి యశోధరా బాగ్చీ గ్రంథం ‘ఇంటరాగేటింగ్‌ మదర్‌హుడ్‌’ను సమీక్షిస్తూ మిహిర్‌ భట్టాచార్య రాసిన వాక్యాలు, 10.11.17)

ఇటీవల హైదరాబాద్‌లో మూడురోజుల పాటు జీఈఎస్‌ (గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్, ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సమావేశం) జరిగింది. ఈ సదస్సు తీరు, చర్చల సరళిలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్థిక సలహాదారు హోదాలో హాజరైన ఆయన కుమార్తె ఇవాంకకు లభించిన స్వాగత సత్కారాలు గమనిస్తే ఒక చారిత్రక అంశం గుర్తుకొస్తుంది. ఇండియా సంపదను కొల్లగొట్టడానికి వచ్చిన ఈస్టిం డియా కంపెనీ తీరుతెన్నులు తలపుకొస్తాయి. అమెరికా గుత్త పారిశ్రామికవేత్తలకు, బహుళజాతి సంస్థలకు దేశ సంపదను దోచుకోవడానికి దారులు విస్తృతమవుతున్నాయని భావించవలసి వస్తున్నది. సాక్షాత్తు డొనాల్డ్‌ ట్రంప్‌ సదస్సుకు హాజరైనట్టే ఆయన కుమార్తె ఇవాంకకు స్థానిక ప్రభుత్వాలు స్వాగతసత్కారాలు లభించాయి. గతంలో నాటి అధ్యక్షుడు క్లింటన్‌ పర్యటించినప్పుడు చంద్రబాబునాయుడి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, నేడు చంద్రశేఖరరావు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక్క మాదిరిగానే ఉన్నాయి. పెట్టుబడులను ఆశించవచ్చు. కానీ అమెరికా అధ్యక్షునికీ, ఆయన సలహాదారుకీ(ఇవాంక అమెరికా అధ్యక్షుని సలహాదారు అన్న సంగతి ఇటీవలి వరకు తెలియదు) తేడా లేని రీతిలో మైమరిచిపోవడమే ఎబ్బెట్టుగా ఉంది.

స్వతంత్ర పాలకుల తీరు ఇదేనా!
ఇక్కడ బిచ్చగాళ్లు, సామాన్య జనాభా, నిరుద్యోగులు, అన్నార్తులు లేరనీ, పేదవాళ్ల గుడిసెలు లేవనీ చాటుకోవాలన్న తాపత్రయం పాలకులలో కనిపిం చింది. ఇవాంక కళ్లు కప్పేందుకు చేసిన ఈ పనులన్నీ ప్రజలను అవమానించేవే. ఎవరి రాకకోసమో బిచ్చగాళ్లను ఎక్కడికో తరలించడమే కాదు. పలు రకాల పేర్లతో పన్నులు వసూలు చేస్తున్నా హైదరాబాద్‌ రోడ్ల సంగతే పట్టని నేతలు, ఇవాంక రాకతో ఆగమేఘాల మీద కోట్ల రూపాయలు వెదజల్లి వాటికి మరమ్మతులు చేయించారు. గోల్కొండ సాక్షిగా జరిగిన మరొక తంతు–అక్కడ ఏర్పాటైన విందులు. అంతర్జాతీయ అతిథుల కోసం గోల్కొండ చుట్టుపక్కల ఉండే సామాన్య కుటుంబాల వారినీ, గుడిసె వాసులనీ రెండురోజుల పాటు బయటకు రానివ్వలేదు. ఇలాంటి నిర్బంధం మన పరువును బజారుకు ఈడ్చుకోవడమేనని పాలకులు భావించడం లేదు. ఈ విందుల కోసమే అక్కడి చిన్న చిన్న దుకాణాల షట్టర్లు తెరుచుకోలేదని కూడా చానళ్లు వెల్లడించాయి. ఇంతకు మించి తెలుగువారికి తలవంపులు తెచ్చిన పరిణామం కూడా ఉంది. ‘అమ్మా! ఇవాంకా! నీవు మా పేటలకు, వీధులకు పర్యటనకు వస్తే అయినా, వసతులు, రోడ్లు మెరుగుపడతాయేమోనని ఆహ్వానిస్తున్నాం!’ అని మొర పెట్టుకోవలసి వచ్చిందంటే ఒక స్వతంత్ర దేశ, రాష్ట్రాల పాలకులు సిగ్గు పడవద్దా! ఇందుకు ఇవాంక ట్వీట్‌ ద్వారా స్పందిం చిన తీరు ఏలా ఉంది? ‘మీ రోడ్ల గురించి నేను ప్రధాని మోదీతో మాట్లాడతా’నని.

తీరుమారని నరేంద్ర మోదీ
సదస్సుకు 150 దేశాల ప్రతినిధులు వస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రధానంగా కనిపించినవారు అమెరికా, ఇండియా పారిశ్రామికవేత్తలే. సదస్సులో ప్రసంగించిన మోదీ, ‘ఆర్థిక సంస్కరణలలో విధానాలు పారదర్శకంగా ఉండాలనీ, చట్టబద్ధంగా ఉండాలనీ చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెలుగొందాలంటే ‘సరిసమాన ప్రతిపత్తి’లో వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. కానీ అందుకు ఆయన సూచించిన మార్గం మాత్రం అస్పష్టం. పైగా రెండర్థాలకు తావిచ్చే నినాదాలిచ్చారు– ‘రండి, ఇండియాలో తయారు’ (మేకిన్‌ ఇండియా) చేయండి అని ఒకమాట, ‘ఇండియాలో పెట్టుబడులు పెట్టండి’ అని మరో మాట చెప్పారు. మోదీ పదవీ స్వీకారం చేసిన తరువాత జరిపిన తొలి విదేశీ పర్యటనలో ఇచ్చిన పిలుపు ‘వాస్కోడిగామాలై తరలి రండి’ అనే. దానికీ, హైదరాబాద్‌ సదస్సులో చేసిన తాజా ప్రకటనకూ తేడా లేదు. హైదరాబాద్‌ సదస్సులోనే గమనించదగిన విధాన ప్రకటన కూడా మోదీ చేశారు– ‘విదేశీ పెట్టుబడుల కోసం మా ప్రభుత్వం అన్ని నియంత్రణలను (రెగ్యులేషన్స్‌) సడలిస్తుంది, ఔత్సాహికుల కోసం (స్టార్టప్స్‌) ఊతం ఇచ్చే విధానంపై దృష్టి కేంద్రీకరిస్తుంది’ అన్నారు. ‘21 రంగాలలో విదేశీ గుత్త పెట్టుబడులకు ఆటంకంగా ఉన్న 87 శాతం నిబంధనలను, అంటే 1,200 రకాల చట్టాలను రద్దు చేస్తున్నాం’’ అంటూ మొదటిసారి బయటపడ్డారు.

ఈ బాగోతాన్ని ప్రపంచ ప్రసిద్ధ పాత్రికేయురాలు చిత్రా సుబ్రహ్మణ్యం (గతంలో దిహిందూలో పనిచేశారు) 1997 నాటికే ‘అమ్మకానికి ఇండియా’– ‘ఇండియా ఫర్‌ సేల్‌’ అన్న గ్రంథంలో ఎండగట్టారు. అలా చెప్పడమంటే, నీ వర్తమానం నీ కళ్లముందే బుగ్గిపాలవుతుండగా నీ గతం గురించి వేదాల్ని అడిగి తెలుసుకోమన్నట్టూ, నీ భవిష్యత్తు గురించి ప్రపంచబ్యాంకును జోస్యం చెప్పమని కోరినట్టూ ఉంటుందని ఆమె వ్యంగ్యంగా చెప్పారు. అమెరికా అయితే అన్ని షరతులను భారత ప్రభుత్వం అంగీకరిస్తేనే విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడులను ఇండియాలోకి అనుమతిస్తామని పట్టుబడుతోంది. ఇందుకు కారణం ఉంది. రేపోమాపో అమెరికాను తోసిరాజనబోతున్న దేశం చైనా. దక్షిణాసియాలో భారత ఇరుగు పొరుగుతో సంబంధాలకు విఘాతంగా సోషలిస్టు చైనాకు వ్యతిరేకంగా పన్నిన ‘వ్యూహాత్మక కూటమి’లోకి ఇండియాను లాగడానికి అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ ఉచ్చులో ఇరికిం చడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నానికి మన పాలకులు పరోక్షంగా తోడ్పడటం ఆత్మహత్యాసదృశమవుతుంది. ఆసియావాసుల్ని ఆసియావాసులపైకే ఉసిగొల్పాలని అమెరికా పాలకులు చాలాకాలంగా ఎత్తుగడలు వేస్తున్నారు. తెలిసో, తెలియకో ఉపాధి కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయ సంతతివారు కొందరు వర్తక–వ్యాపార ప్రయోజనాల పేరిట ట్రంప్‌ విధానాలకు కొమ్ముకాస్తూ ‘వ్యూహాత్మకంగా భారత్‌–అమెరికాలు సన్నిహిత సంబంధాలను కొనసాగించాల్సిందే’నని కోరుకుంటున్నారు. భారతదేశం సహా అనేక ఆసియా, ఆఫ్రికా బడుగు దేశాలన్నీ అమెరికాకు ఇవ్వదేలిన రుణాలన్నీ చెల్లిపోయినా సరే, చెల్లనట్టుగా అమెరికా వ్యవహరించడం విశేషం. మన ఆర్థిక వ్యవస్థల పెరుగుదలకు, తగ్గుదలకు అంతర్జాతీయ రేటింగ్‌ గుత్త సంస్థలు ‘మదింపు’లు వేస్తూ మనల్ని రుణగ్రస్థులంగానే చిత్రిస్తున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థను ‘సైనిక–పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ’గా మార్చినట్టుగానే, భారత ఆర్థిక వ్యవస్థను కూడా కార్పొరేట్‌–పారిశ్రామిక సైనిక రక్షణ వ్యవస్థగా మలచాలని అమెరికా వ్యూహ రచన చేస్తోందని మరవరాదు.

అమెరికా పెట్టుబడులే శరణ్యమా!
ఆసియాలో అమెరికా రక్షణ వ్యూహంలోకి ఇండియాను గుంజే వ్యూహం ఉంది. ఇందులో భాగంగానే ‘అమెరికా–ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ’ అధ్యక్షుడు ముఖేష్‌ ఆఘీ ‘అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం వల్లనే ఇండియాలో ఔత్సాహిక పారిశ్రామికులు కంపెనీలు పెట్టుకోగలుగుతారు, నడుపుకోగలుగుతారని’ బాహాటంగా ప్రకటించారు. ఆ సడలింపులు అమలులోనికి రానంతకాలం అమెరికా ప్రత్యక్ష పెట్టుబడులు భారీ స్థాయిలో రావని కూడా చెప్పారాయన. చివరికి అమెరికాతో చెట్టాపట్టాలు కట్టి సాగుతున్న మోదీ స్నేహితులు అంబానీ, ఆదానీల చర్యలు కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఎలాంటి ఏవగింపులకు, నిరసనలకు గురికావలసి వచ్చిందో మరచిపోకూడదు. అన్నింటికన్నా విషాదం మరొకటి ఉంది. స్వతంత్ర ఆర్థిక వ్యవస్థలుగా వర్ధమాన దేశాలు అవతరించి, నిలదొక్కుకోవడానికి తగిన బ్లూప్రింట్‌ను సుప్రసిద్ధ ‘సౌత్‌ కమిషన్‌’ తయారుచేసింది. ఈ నివేదికకు పురుడు పోయడంలో టాంజానియా అధ్యక్షుడు జూలియస్‌ నైరేరికి చేదోడు వాదోడుగా నిలిచినవారు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌. ఆ తరువాత పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో డాక్టర్‌ సింగ్‌ ఆర్థికమంత్రి అయిన తరువాత సౌత్‌ కమిషన్‌ నివేదికను ‘గంగ’లో కలిపారు. పీవీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన తరువాతనే ఆ ఇద్దరు కలసి ప్రపంచబ్యాంకు ‘సంస్కరణ’లకు బేషరతుగా 1991లో తలలూపారు. ఈ పరిణామాన్ని ఆహ్లాదంగా చూసినవారు బీజేపీ పాలకులు. ఆ సంస్కరణలను ‘భగవద్గీత’గా భావించి దేశాన్ని మరింతగా ముంచడానికి ఈ పార్టీ పాలకులు సయితం వెనుకాడక పోవడమే గొప్ప వైచిత్రి.

సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచబ్యాంకు సంస్థలకు వైస్‌ ప్రెసిడెం టుగా 20 ఏళ్లుగా పనిచేసి, దాని చర్యలతో మొహం మొత్తిన డాక్టర్‌ డేవిడ్‌సన్‌ బుదూ పదవికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ బ్యాంకు షరతుల భారాన్ని మోసి బ్యాంకు సంస్కరణలను ఆఫ్రికా దేశాల్లో అమలు జరుపుతూ తనకు చూపించిన దారుణ మనో వేదనను ఆ రాజీనామా లేఖలో ఇలా కన్నీళ్లతో ప్రపంచ ప్రజలకు నివేదించాడు: ‘ఈ సంస్కరణలను దేశాలపై రుద్దడంలో నా చేతులు రక్తసిక్తమయ్యాయి, ఈ సంస్కరణలవల్ల ప్రజలు అనుభవించిన దారుణ ఫలితాలను కళ్లారా చూశాను, ఈ నా మలినమైన చేతుల్ని కడుక్కోడానికి దేశాల నదీజలాలు చాలవుగాక చాలవు’ అన్నాడు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది మన అలిశెట్టి వేసిన ఆర్ద్రమైన ప్రశ్న: ‘‘అన్నంమెతుకునీ/ఆగర్భ శ్రీమంతుణ్ణీ/వేరుచేస్తే శ్రమ విలువేదో తేలిపోదూ?!’’


- ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top