అవును... దీపిక అన్నీ చెప్పేసింది! | Sakshi
Sakshi News home page

అవును... దీపిక అన్నీ చెప్పేసింది!

Published Sun, Jun 7 2015 1:01 AM

అవును... దీపిక అన్నీ చెప్పేసింది! - Sakshi

ఇంటర్వ్యూ
దీపికా పదుకొనె... బాలీవుడ్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న ఓ కెరటం. అందానికి కుర్రకారు చెప్తోన్న నిర్వచనం దీపిక. ప్రతిభకు విమర్శకులు ఇస్తోన్న నిర్వచనం దీపిక. అలాంటి దీపిక కొన్ని ముఖ్యమైన అంశాలను తనదైన శైలిలో నిర్వచించింది. తన ఆలోచనల్లో ఉన్న లోతుని, భావాల్లో ఉన్న స్పష్టతని ఇలా బయటపెట్టింది.
 
వయసంటే:
ఆపితే ఆగనిది. ఆగకుండా సాగిపోయేది.
 
మనసంటే:
మనసు గురించి చాలామంది చాలా రకాలుగా వర్ణిస్తుంటారు. నాకు తెలిసినంత వరకూ మనసు మన నేస్తం. అందుకే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దానికి తగ్గట్టుగానే అది రియాక్ట్ అవుతుంటుంది. మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది.
 
ప్రేమంటే:
ఒక అద్భుతమైన ఫీలింగ్. దాన్ని అనుభవిస్తేనే అందులోని ఆనందం అర్థమవుతుంది. ప్రేమంటే కేవలం లవర్స్ మధ్యనో, భార్యాభర్తల మధ్యనో ఉండేది కాదు. అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, ఫ్రెండ్స్... ఇలా ఇద్దరు వ్యక్తులను దగ్గర చేసేది, దగ్గరగా ఉంచేది ఏదైనా ప్రేమే.
 
పెళ్లంటే:
ఇద్దరు వ్యక్తులను స్నేహితులుగా, భాగస్వాములుగా మార్చేది. ఒకరి కోసం ఒకరు బతికేంతగా ఒక్కటి చేసేది.
 
అందమంటే:
మనసు. అది అందంగా లేనప్పుడు ముఖం ఎంత అందంగా ఉన్నా ఉపయోగం లేదు. నీ అందాన్ని చూసి దగ్గరయ్యేవాళ్లు అది పోయాక దూరమైపోతారు. కానీ నీ మనసును మెచ్చి వచ్చేవాళ్లు నువ్వు పోయేదాకా నీతోనే ఉంటారు.
 
లక్ష్యమంటే:
ప్రతి మనిషికీ తప్పకుండా ఉండాల్సినది. లక్ష్యమనేది లేకపోతే మన లైఫ్ ఎటు పోతుందో తెలియదు. మనం ఎటు సాగుతున్నామో మనకే అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఒక లక్ష్యమనేది ఉండాలి.
 
కాంపిటీషన్ అంటే:
మనల్ని మోటివేట్ చేసేది. ఒకరితో పోల్చుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. వాళ్లు బాగా పని చేస్తున్నారు అనుకున్నప్పుడే మనం వాళ్లకంటే బాగా చేయాలి అనే పట్టుదల పెరుగుతుంది. అయితే అవతలివారిని ఓడించాలి అన్న పంతంతో పని చేయడం మాత్రం నాకు నచ్చదు.
 
క్రమశిక్షణ అంటే:
ఓ పద్ధతి. మన నడవడికను నియంత్రించేది. అయితే మా అమ్మానాన్నలు నన్ను క్రమశిక్షణగా పెంచాలి - అనుకునేవారే గానీ ఏ విషయంలోనూ రిస్ట్రిక్ట్ చేసేవారు కాదు. ఏ రోజూ వాళ్లు నా మీద చెయ్యి ఎత్తలేదు. ఇలా చేస్తే బాగుంటుంది అంటూ సున్నితంగా చెప్పేవారు. నా దృష్టిలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాల్సిన విధానం అదే.
 
కృషి అంటే:
మనం ఏమిటి అనేది ఎదుటివాళ్లకు చెప్పేది. మన ప్రతిభ, మనం పని చేసే విధానం మనకు విజయాల్ని తెచ్చిపెడతాయి. మనల్ని పదిమందికి దగ్గర చేస్తాయి.
 
విజయం అంటే:
మనం చేసిన పనికి లభించే ఉత్తమ ఫలితం. అయితే విజయాన్ని చూసి ఎప్పుడూ గర్వపడకూడదు.  నా మనసు నన్ను నాకు ఎప్పుడూ స్టార్‌గా చూపించదు. నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయివే అని చెబుతూంటుంది. నేనూ అదే నమ్ముతాను. నా వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరికి నచ్చిన ఫీల్డ్‌లో వాళ్లున్నారు. వాళ్ల వాళ్ల పనులు చేసుకుంటూ పోతున్నారు. నేనూ అంతే తప్ప ప్రత్యేకమేమీ కాదు.
 
జీవితమంటే:
మన చేతుల్లో లేనిది. చాలామంది అంటారు... జీవితాన్ని మనకు నచ్చినట్టు మలచుకోవచ్చు అని. మనం ఎంత మలచినా చివరికి మనకేది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. అందుకే నేను ఎప్పుడూ సింపుల్‌గా, నార్మల్‌గా జీవించడానికే ప్రయత్నిస్తాను.

 
Advertisement
Advertisement