
టైటానిక్ నౌక మునిగిపోతున్నప్పుడు లైఫ్‌బోట్‌లలోకి మొదట మహిళల్ని, పిల్లల్ని ఎక్కించారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఎంతమంది ఉన్నారో మొదట చెప్తారు. ప్రతిచోట, ప్రతి ప్రమాద సందర్భంలో మహిళలకు, పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. పిల్లలు నిస్సహాయులు, మహిళలు తమ దేహధర్మాల కారణంగా చొరవ చూపలేనివారు అనే భావన వల్ల ఈ ప్రాధాన్యం లభించి ఉండొచ్చు.
అలా కాకున్నా, మానవజన్మలోని ఒక మంచి సంప్రదాయం ఇది. బలహీనులకు రక్షణ, భద్రత కల్పించడం. అయితే ‘అవసరం అయి’ కల్పించడం వేరు. ‘అవసరం అనుకుని’ కల్పించడం వేరు. అవసరమై రక్షణ, భద్రత కల్పిస్తే ఎవరికైనా సంతోషమే కానీ ‘అవసరం అనుకుని’ పురుషులు, ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కవచాలను, భద్రతా వలయాలను ఏర్పరుస్తున్నప్పుడు అవి తమ అవకాశాలకు, ఆసక్తులకు, అభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయని మహిళలు భావించడం సహజమే.
కఠినమైన పరిస్థితుల్లోకి, ప్రతికూలమైన పరిసరాల్లోకి స్త్రీలను అనుమతించకపోవడం వారి భద్రత కోసమే కావచ్చు. అయితే కఠినమని, ప్రతికూలం అని ఎవరికి వాళ్లకు అనిపించాలి. అలా అనిపించనప్పుడు ఆ పరిస్థితుల్లోకి, పరిసరాల్లోకి వారిని అనుమతించకపోవడం భద్రత కల్పించడం అవదు. ఆశల్ని నిర్బంధించడం అవుతుంది. ఎవరు మాత్రం ఇష్టపడతారు? భద్రత కోసమే అయినా ఆశలు బందీలైపోతుంటే!
నేటికీ కొన్ని దేశాల్లో మహిళలు డ్రైవింగ్ చెయ్యడానికి లేదు. స్టేడియంకు వచ్చి మ్యాచ్‌లు చూడ్డానికి లేదు. మతపరమైన లాంఛనాలలో పాల్పంచుకోడానికి లేదు. వీటిలో కొన్ని వారి రక్షణ కోసమే అని చెప్పుకున్నా.. ఆచారాల్లో, సంప్రదాయాల్లో కూడా వారి భాగస్వామ్యాన్ని తిరస్కరించడం వారి ఆశల్ని నిర్బంధించడమే అవుతుంది. జపాన్‌లో మహిళల్ని నిరోధించే ఇలాంటి ఆచారమే ఒకటి ఉంది. బుల్‌ఫైటింగ్ రింగులలోకి ఆడవాళ్లను రానివ్వరు. మంచిదే కదా, ఎద్దులతో వాళ్లు తలపడటం దేనికి! అయితే అందుకు కాదు రానివ్వకపోవడం. బుల్‌ఫైటింగ్ మొదలవ్వడానికి ముందు ఆ రింగ్‌ని ఉప్పునీటితో, మద్యంతో శుద్ధి చేస్తారు.
ఇక ఆ శుద్ధస్థలంలోకి మహిళలు అడుగుపెట్టడానికి లేదు. పెడితే వలయం అపవిత్రం అయిపోతుందట! పోటీకి ముందు యజమానులు ఎవరి ఎద్దును వారు తీసుకొచ్చి ప్రదర్శించే వలయం అది. ఇన్నాళ్లూ అక్కడికి మహిళల్ని రానివ్వకూడదని నిబంధన ఉండేది. శుక్రవారం ఆ నిబంధనను తొలగించారు. తొలిసారిగా అకీకో మొరియమ అనే మహిళ తన ఎద్దును ఆ శుద్ధస్థలంలోకి తెచ్చి వలయం అంతా తిప్పింది. ఆ సమయంలో ఆమె.. ఆశల్ని నిర్బంధించే రక్షణ నిబంధనలకు, లైంగిక వివక్షాపూరిత ఆచారాలకు ముకుతాడు తగిలించి లాక్కెళుతున్నట్లుగా చిరునవ్వులు చిందిస్తూ ఉంది.