స్టాలిన్ మనవాడు కాదు! | Stalin is not our country man | Sakshi
Sakshi News home page

స్టాలిన్ మనవాడు కాదు!

Sep 6 2015 10:11 AM | Updated on Sep 3 2017 8:52 AM

స్టాలిన్ మనవాడు కాదు!

స్టాలిన్ మనవాడు కాదు!

తాము రూపొందించిన మ్యాక్ పీసీల డిజైన్‌ను, ఆపరేషన్‌ను మైక్రోసాఫ్ట్‌వాళ్లు కాపీ కొడుతున్నారని యాపిల్ ఐఎన్‌సీ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ తరచూ వాపోయేవాడు.

తాము రూపొందించిన మ్యాక్ పీసీల డిజైన్‌ను, ఆపరేషన్‌ను మైక్రోసాఫ్ట్‌వాళ్లు కాపీ కొడుతున్నారని యాపిల్ ఐఎన్‌సీ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ తరచూ వాపోయేవాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మ్యాక్ పీసీ వినియోగదారుల కన్నా మైక్రోసాఫ్ట్ యూజర్లే ఎక్కువమంది ఉన్నారనేది నిజం. సినిమాల విషయంలో అయినా ఇంతే. కాపీ కొట్టామా, ఎవరి థాట్‌నో లేపుకొచ్చామా అనేది పాయింట్ కాదు. ఎంత అందంగా కాపీ చే శామా, ఎంత బాగా లాభపడ్డామా అనేదే ముఖ్యం. ఈ సత్యాన్ని గ్రహించి తన కెరీర్‌ను అందంగా మలచుకున్నాడు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. కొన్ని విదేశీ సినిమాల నుంచి సంగ్రహిం చిన కథ, కథనాలు, సీన్లతో ‘గజిని’ సినిమాని రూపొందించి గుర్తింపు సంపా దించుకున్న ఈ దర్శకుడి ఇతర సినిమాల్లో కూడా కాపీ ఛాయలు కనిపిస్తూంటాయి. అందుకు ‘స్టాలిన్’ ఒక పెద్ద సాక్ష్యం!
 
మెగాస్టార్ చిరంజీవి, త్రిష హీరో హీరోయిన్లుగా... ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో నటించిన చిత్రం స్టాలిన్. అప్పటికే మురుగదాస్ ‘గజిని’ హిట్‌తో ఊపు మీదుండటంతో... ‘స్టాలిన్’ భారీ అంచనాల మధ్యన విడుదలయ్యింది. చిరంజీవి హీరో కాబట్టి ఈ సినిమా కథ విషయంలో దాస్ చాలా కసరత్తే చేసి ఉంటాడని అందరూ అనుకొన్నారు. నిజమే.. దర్శకుడు విదేశీ సినిమాలు చూసి ‘స్టాలిన్’ను తయారు చేయడంలో చాలా కసరత్తే చేశాడు. ‘‘సహాయం పొందినప్పుడు... సాయంగా నిలిచిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలపడం కాదు, ఆ స్ఫూర్తితో మరో ముగ్గురికి సహాయం చేయాలి.
 
 ఆ ముగ్గురూ ఒక్కొక్కరిగా మరో ముగ్గురికి సాయం చేస్తే, ప్రపంచమంతా ఒకరికి ఒకరిగా సాయంగా నిలిచినట్టు అవుతుంది’’ అనేది స్టాలిన్ ఆలోచన. ఆర్మీలో సేవలందించి వచ్చిన అతడు ఈ సిద్ధాంతాన్ని తన స్నేహితుల ద్వారా, తన సాయం పొందిన వారి ద్వారా ప్రచారం లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో మొదట చేదు అను భవాలే మిగిలినా... ఆ తర్వాత మాత్రం సానుకూల ఫలితాలు వస్తాయి. కథనం లోని మాస్ మసాలా ఎలిమెంట్స్ సంగతి ఎలా ఉన్నా... ఈ పాయింట్‌ను సందే శంగా ఇవ్వదలిచారు. అయితే ఈ ఆలోచన మురుగదాస్ సొంత ఆలోచనా కాదు, కల్పించినదీ కాదు. దీని అసలు హక్కుదారులు వార్నర్ బ్రదర్స్ సంస్థవారు. వాళ్లు తీసిన ‘పే ఇట్ ఫార్వార్డ్’ అనే హాలీవుడ్ సినిమా మూల కథనం ఇది.
 
‘వెన్ సమ్ వన్ డస్ యూ ఏ బిగ్ ఫేవర్, డోంట్ పే ఇట్ బ్యాక్... పే ఇట్ ఫార్వార్డ్’ అనే థీమ్‌తో రూపొందిన ‘పే ఇట్ ఫార్వార్డ్’ చిత్రం...  సంచలన విజయం సాధించింది. కథ మొత్తం ఏడో తరగతి చదివే ట్రెవర్ మెక్ కీన్ అనే పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. ట్రెవర్ వాళ్ల సోషల్ టీచర్ ఓ రోజు క్లాసులో పిల్లలందరికీ ఒక అసైన్‌మెంట్ ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని మంచివైపు నడిపించే ఓ గొప్ప ఆలోచనను చెప్పమంటుంది. అప్పుడు ట్రెవర్ మదిలో మెదిలిన ఆలోచనే ‘పే ఇట్ ఫార్వార్డ్’. ఎవరి దగ్గరైనా సాయం పొందినప్పుడు ఆ వ్యక్తి ఆ స్ఫూర్తితో మరో ముగ్గురికి సాయం చేసి, ఆ ముగ్గురూ మరో ముగ్గు రికి సాయం చేసుకుంటూ పోతే కొన్నాళ్లకు ఈ ప్రపంచమంతా మంచితనమే నిండి పోతుంది అని చెప్తాడు ట్రెవర్. తర్వాత ట్రెవర్ ఆలోచన ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది, సమాజంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది అనేది తెరపై చూడాల్సిందే.
 
 ఈ కథాంశాన్ని మురుగదాస్ తెలివిగా వాడుకున్నారు. ఏడో తరగతి పిల్లాడిని మిలిటరీ మేజర్‌ని చేశారు. పైగా ఆ పాత్రకు మెగాస్టార్‌ని ఎంచుకున్నారు.  2000 సంవత్సరంలో వచ్చిన అక్కడి సందేశాత్మక చిత్రాన్ని... 2006లో ఇక్కడ ఒక కమర్షియల్ సినిమాగా రూపొందిం చడంలో విజయవంతం అయ్యారు. ఇటీవలే ఈ కథాంశం బాలీవుడ్ వారిని కూడా ఆకర్షించింది. సల్మాన్‌ఖాన్ హీరోగా ‘జయహో’గా రీమేక్ అయ్యింది. తెలుగువారు తీసినా, హిందీవారు రీమేక్ చేసినా... ఎవరు ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని రకాల మసాలాలు దట్టించినా... కథాంశం మాత్రం అదే. దాన్ని రూపొందించిన క్రెడిట్ హాలీవుడ్‌దే!
 - బి.జీవన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement