వ్యవ'సాయం' కావాలి

special  story to  Agriculture - Sakshi

కవర్‌ స్టోరీ

వేల ఏళ్ల నాటి మన వ్యవసాయ సంస్కృతికి గత యాభయ్యేళ్లలో అసలు ఏమైంది? మనదైన సుసంపన్న సేద్య జ్ఞానాన్ని వదిలేశాం. కంపెనీల మాయాజాలానికి బలిపెట్టాం... పంట భూముల ఆరోగ్యంతోపాటు, మన ఆరోగ్యాన్నీ చేజేతులా చేజార్చుకున్నాం. స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాం. కానీ, పరాయి విత్తనాన్ని పట్టుకొని.. మన వారసత్వం విత్తన సంపదను వదిలేశాం. మనవైన ఆహార పంటలను కాదని అమ్మకానికి పనికొచ్చే పంటలను పండిస్తున్నాం... ఇప్పుడు ఎక్కడున్నాం? మనకు మనమే పరాయివాళ్లమైపోయాం! రసాయనాలు కుమ్మరిస్తూ నేలతల్లి ఊపిరిని నిలువునా తీసుకుంటున్నాం. మన అన్నదాతల ఉసురును మనమే తీసుకుంటున్నాం.  వాతావరణ మార్పుల యుగంలో ఎడతెగని అప్పులు, ఆత్మహత్యలు, అలవికాని రోగాలను ఎలాగోలా జయించకపోతే మనుగడే మిగలదు.  ఇంతకీ ఏం చెయ్యాలి? ఎటు అడుగెయ్యాలి?.. ఇటువంటి మౌలిక ప్రశ్నలకు సూటిగా సమాధానాలు వెదుకుతున్నారు మట్టి పెళ్ల మనసెరిగిన ప్లాంట్‌  డాక్టర్‌ శ్యామసుందరరెడ్డి...  

సేద్యం పంచభూతాల సంగమం. నింగి, నేల, నిప్పు, గాలి, వాన. వ్యవసాయదారుడు విత్తనాన్ని నేర్పుగా ఓర్పుతో ఈ పంచభూతాలకు అనుసంధానిస్తాడు. ఆరుగాలం శ్రమించి ఆహారోత్పత్తి చేస్తాడు. పైరు పచ్చని పంటపొలాలు, పరుగులు తీసే ఆలమందలు, మనసులు మురిసే మానవ సంబంధాలతో సుఖసంతోషాలమయమైన నాటి గ్రామ సీమలలో రైతులే కథానాయకులు. ఇతర వృత్తులవారు సందర్భానుసారం రైతులకు సేద్య ప్రక్రియలో తమవంతు సహకారాన్ని బేషరతుగా అందించేవారు. పంట చేతికొచ్చిన తర్వాత రైతులు తమకు వ్యవసాయంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహాయం చేసిన వారికి తమ ఫలసాయంతో న్యాయమైన వాటా పంచి ఇచ్చేవారు. స్వతంత్ర భారతదేశాన్ని ఆహారకొరత నుండి గట్టెక్కించి, స్వయం సమృద్ధి సాధించిపెట్టిన ‘హరిత విప్లవం’, తదనంతర కాలంలో భారతీయ రైతుల పాలిట పెనుశాపంగా మారి ఆత్మహత్యల పరంపరకు తెరలేపింది. ఎన్నో శతాబ్దాలుగా చెక్కుచెదరని భారతీయ రైతుల ఉత్పత్తి సామర్థ్యం.. కొన్ని దశాబ్దాల కాలంలో తునాతునకలైపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను సహస్ర శతాబ్దాలుగా తమ భుజస్కంధాలపై మోసిన మన రైతులు.. నేడు రెక్కలు తెగిన పక్షులు. 

మునుపటికాలంలో రైతులు పలు రకాల వస్తువులను ఉత్పత్తి చేసుకొని, తమకవసరమైన ఒకటో, రెండో వస్తువులను మార్కెట్లో కొనుక్కునేవారు. కానీ నేడు అధికశాతం రైతులు ఒకటో, రెండో పంటలు పండించి, తమ సకల అవసరాలకు మార్కెట్‌పైనే ఆధారపడుతున్నారు. ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ అన్నట్టుగా తాము పండించిన ఉత్పత్తులను గంపగుత్తగా టోకు ధరలకు, కారు చౌకగా ధారపోసి, తమకు కావలసిన వస్తువులను ముందుగానే నిర్ణయించి ముద్రించిన అధిక ధరలకు కొనుగోలు చేయక తప్పని దుస్థితిలోనికి నేడు మన రైతులు నెట్టబడ్డారు. ఒకప్పుడు స్వచ్ఛమైన విషరహిత తాజా ఆహారోత్పత్తులను సమృద్ధిగా ఆస్వాదించిన మన గ్రామ సీమలు, నేడు విష రసాయనాలు చల్లిన కూరగాయలు, మందులతో మగ్గిన పండ్లు, యాంటీబయోటిక్స్‌ సహాయంతో పెంచిన కోళ్లు, కోడిగుడ్లు, కల్తీ నూనెలు, సింథటిక్‌ పాలు వంటి ప్రమాదకరమైన ఆహారాన్ని తినవలసివస్తున్నది. తత్ఫలితంగా ఒకనాడు భాగ్యవంతుల రోగాలుగా పరిగణించబడే క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు నేడు గ్రామ సీమలలో కాయకష్టం చేసుకు బతికే సామాన్యుల ఇళ్లలోకి కూడా జొరబడ్డాయి. పేదింటిలో అనారోగ్యం అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే. సమాజంలో పేదరికం కంటే రోగం బహు ప్రమాదకరం. 

చిన్న రైతు చేతిలోనే భవిత భద్రం 
ఏయేటికాయేడు అప్రతిహతంగా పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం సమకూర్చడానికి వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యాంత్రీకరించడం, వ్యవస్థీకరించడం తప్పనిసరి అన్నది ఒక వాదన. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలలో తెలుస్తున్నదేమిటంటే, చిన్న సన్నకారు రైతులు 25 శాతం కన్నా తక్కువ వనరులతో 70 శాతం ఆహారాన్ని పండిస్తున్నారు. 750 కోట్ల ప్రపంచ జనాభాలో 500 కోట్లకు పైగా ప్రజలు రైతులు పండించిన ఆహారంపైనే ఆధారపడుతున్నారు. వాతావరణ మార్పులను, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఆహారోత్పత్తి చేయగల సామర్థ్యం చిన్న, సన్నకారు రైతులలో చాలా ఎక్కువ. ఇది వారు పంటల జీవ వైవిధ్యం ద్వారా సాధిస్తారు.  

కార్పొరేట్‌ వ్యవసాయం తస్మాత్‌ జాగ్రత్త
కార్పొరేట్‌ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయిన ఆహారంలో ప్రతి రూపాయి విలువకు, పరోక్షంగా సమాజం మరో రెండు రూపాయలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇందులో వనరుల దోపిడీ, కాలుష్యం కారణంగా పర్యావరణం ఒక వంతు చెల్లిస్తే, ప్రజలు రాయితీలు, వృథా కారణంగా మరో వంతు చెల్లిస్తున్నారు.  కార్పొరేట్‌ రసాయనిక వ్యవసాయం 70 శాతం వనరులను ఉపయోగించి 30 శాతం ఆహారోత్పత్తిని మాత్రమే చేస్తుంది. ఇందులో 90 శాతం నాలుగైదు పంటలు మాత్రమే (గోధుమ, మొక్కజొన్న, సోయా..)! కార్పొరేట్‌ వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యంలో 50 శాతం కన్నా ఎక్కువ భాగాన్ని పశువులు, కోళ్ల మేతగా వాడుతున్నారు. మరో 28 శాతం ఆహారం నిల్వలో, రవాణాలో, వాడకంలో వృ«థా అవుతున్నదని అంచనా. ఏకరీతి జన్యువులు, ఒకే రకం పంటలు సాగయ్యే విస్తారమైన క్షేత్రాలు చీడ పీడల ఉధృతికి దారితీస్తాయి. ప్రతికూల పరిస్థితులలో తీవ్రమైన పంట నష్టం జరిగి, దుర్భిక్షం తాండవించగలదు. 

వాన నీటి సంరక్షణ: అదే జగతికి శ్రీరామరక్ష
హరిత విప్లవకాలంలో పెరిగిన సాగునీరు అత్యంత ముఖ్యమైనది. ఇందులో సింహభాగం అంటే 60 శాతం భూగర్భ జలవనరులు. మూడింట రెండు వంతుల వ్యవసాయోత్పత్తులు నేటికీ భూగర్భజల వనరులపై ఆధారపడినవే. కానీ నానాటికీ క్షీణిస్తున్న భూగర్భ జలమట్టాలు భావితరాల మనుగడకు పెనుసవాళ్లే్ల విసురుతున్నాయి. నదీ జలాలు అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర జల వివాదాలకు దారితీస్తున్నాయి. కావున, వాన నీటిని పొలాల్లో ఎక్కడికక్కడ ఒడిసిపట్టడం మినహా మరో గత్యంతరం లేదు. భారతదేశంలో తలసరి నీటి లభ్యత 1,600 ఘ.మీ. కానీ తలసరి నిల్వ సామర్థ్యం 200 ఘ.మీ. మాత్రమే. చాలా దేశాలలో తలసరి నీటి నిల్వ సామర్థ్యం 900 ఘ.మీ. పైనే.

అన్నదాతను ముంచిన హరిత విప్లవం
స్వతంత్ర భారతదేశాన్ని ఆహారకొరత నుండి గట్టెక్కించి స్వయం సమృద్ధి సాధించిపెట్టిన ‘హరిత విప్లవం’, తదనంతర కాలంలో భారతీయ రైతుల పాలిట పెనుశాపంగా మారి ఆత్మహత్యల పరంపరకు తెరలేపింది. కనీసం ఐదువేల సంవత్సరాలు చెక్కుచెదరని భారతీయ రైతుల ఉత్పత్తి సామర్థ్యం కేవలం యాభై సంవత్సరాల హరితవిప్లవ కాలంలో తునాతునకలైపోయింది. హరిత విప్లవ చోదకాలైన హైబ్రిడ్‌ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు రైతులను స్వాయత్తత కలిగిన ఉత్పత్తిదారుల స్థితి నుండి బహుళజాతి సంస్థల వినియోగదారులుగా మార్చివేశాయి. పెట్టుబడుల పర్వంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోసాగారు. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు, చీడపీడల విజృంభణ, కూలీల కొరత, మార్కెట్‌ అనిశ్చితి, దళారుల దోపిడీ మొదలైనవి రైతుల ఆదాయంలో అస్థిరతను నింపాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను సహస్ర శతాబ్దాలుగా తమ భుజస్కంధాలపై మోసిన మన రైతులు.. నేడు రెక్కలు తెగిన పక్షులు. 

జన్యు మార్పిడి పంటలు... ఎండమావులు... 
జన్యు మార్పిడి పంటలు, శాస్త్ర సాంకేతికత పరంగా అద్భుతాలే అయినా, వాటివల్ల రైతులకు ఒరిగింది మాత్రం శూన్యం. బహుళజాతి సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ జన్యు మార్పిడి పంటలు పర్యావరణానికి, మానవ మనుగడకు విసురుతున్న సవాళ్లు ఆషామాషీవి కావు. శనగపచ్చ పురుగును సమర్థవంతంగా నివారించగలిగిన జన్యుమార్పిడి బోల్‌గార్డ్‌పత్తి, గులాబిరంగు కాయ తొలుచు పురుగు ఉధృతికి నేడు అతలాకుతలమౌ తున్నది. గ్లైఫొసేట్‌ కలుపుమందును నిర్వీర్యం చేయగల జన్యువులను చొప్పించిన సోయా, మొక్కజొన్న, పత్తి, ఆవా, బీట్‌రూట్, ఆల్ఫా ఆల్ఫా పంటలలో కొన్ని రకాల కలుపు మొక్కలు గ్లైఫొసేట్‌కు లొంగడం మానేశాయి. అంతే కాకుండా, వేరే కలుపు మందులను కూడా గ్లైఫొసేట్‌తో కలిపి పిచికారీ చేయవలసి వస్తోంది. జన్యుమార్పిడి పంటల వల్ల రైతులు, విత్తన సార్వభౌమత్వాన్ని కోల్పోతున్నారు. అంతే కాకుండా పంట రకాలలో జన్యు వైవిధ్యం నశించిపోతున్నది. 

ఇదొక మహమ్మారి
గ్లైఫొసేట్‌ కలుపునాశిని 1974వ సంవత్సరంలో విడుదలైనప్పటి నుండి నేటి వరకు తొంభై లక్షల టన్నుల నికర విషం ప్రపంచ వ్యాప్తంగా పంటపొలాలలో చల్లబడింది. అందులో అరవై లక్షల టన్నులు గత పది సంవత్సరాల కాలంలోనే పిచికారీ అయ్యింది. ఏటా దీని వాడకం 20 నుండి 30 శాతం పెరుగుతూ ఉంది. అంటే దాదాపు ఒకటిన్నర నుండి రెండు లక్షల టన్నుల నికర విషం ఏటేటా అదనం. దాదాపు నలభై సంవత్సరాలు మనుషులకు, పశువులకు అత్యంత సురక్షితమైనదిగా పరిగణించబడిన ఈ కలుపునాశిని, నేడు క్యాన్సర్‌ కారకంగానే కాక, అనేకానేక రోగాలకు పరోక్షంగా కారణ భూతమైనట్లుగా నిర్ధారించబడినది. క్యాన్సర్, అల్సర్, కిడ్నీ వ్యాధులు, ఆటిజం, అల్జీమర్స్, మధుమేహం, రక్తపోటు, ఇలా ఒకటేమిటి సర్వరోగాలు సంప్రాప్తించగలవు. గ్లైఫొసేట్‌ శరీరంలో అత్యధికంగా కిడ్నీలలోనూ తర్వాత లివర్‌లోను పోగవుతుందని పరిశోధకులు తేల్చారు. భార లోహాలను కలిగిన నీరు లేదా కలుషితమైన నీటిని తాగే ప్రజల మూత్రపిండాలలో గ్లైఫొసేట్‌ ఈ భారలోహాలను బంధించి మలినాల వడపోతకు అవరోధం కల్పిస్తుంది. దీర్ఘకాలంలో మూత్రపిండాలకు తీవ్రమైన హాని కలుగుతుందని పరిశోధకులు సూత్రీ కరించారు. మరోవైపు గ్లైఫొసేట్‌ పిచికారీ చేసిన నేలల్లో సూక్ష్మజీవులు నశించి, భూములు నిర్జీవమైపోతున్నాయి. బహుళజాతి సంస్థలు పలురకాల పంటలలో జన్యుమార్పిడి చేసి గ్లైఫొసేట్‌ వాడకాన్ని అనివార్యం చేస్తున్నారు.

నవ్విన నాపచేలే పండుతాయి...
నేడు మనం వరి, గోధుమ, మొక్కజొన్న పంటలను విస్తారంగా పండిస్తున్నాం. కానీ భవిష్యత్తులో సారవంతమైన భూములు, సాగునీటి లభ్యత తగ్గిపోతాయి. వాతావరణంలో మార్పులు, ఏకరీతిపంటలు, చీడపీడల ఉధృతి ఈ పంటల ఉత్పత్తి ఉత్పాదకతలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. పెరిగిన జనాభా అవసరాలననుసరించి సాగుకు యోగ్యం కాని భూములలో కూడా వ్యవసాయం చేయవలసి వస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా మనం నిర్లక్ష్యం చేస్తున్న జొన్న, సజ్జ, రాగి, కొర్ర, అరిక, సామా లాంటి చిరుధాన్యాలే భవిష్యత్తులో ఆహార భద్రతకే కాదు, ఆరోగ్య భద్రతకు కూడా చిరునామాలు. ఈ పంటలు వాతావరణమార్పులను నీటి ఎద్దడిని తట్టుకోగలవు. ఇప్పుడు మనం వాడుతున్న సాగునీటిలో మూడవ వంతు సరిపోతుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల అవసరం లేదు. చాలా తక్కువ కాలంలో కోతకు వస్తాయి. మధుమేహం, అధిక బరువు వంటి రోగాలకు చవకైన, చక్కటి పరిష్కారం ఈ చిరుధాన్యాలు. పర్యావరణానికి కూడా ఇవి మేలు చేయగలవు. ఉదాహరణకు జొన్న పంట తన వేర్ల ద్వారా కొన్ని రసాయనాలను మట్టిలోకి విడుదల చేసి నత్రజని గాలిలోకి ఆవిరికాకుండా నీటిలో కరిగి వెళ్లిపోకుండా బంధించివేస్తుంది. తత్ఫలితంగా ఓజోన్‌ పొరకు నష్టం కలిగించగల N20 ఉత్పత్తిని నిలువరిస్తాయి. దీనిని BNI (Biological Nitrification Inhibition) 

 ఇదే భవిష్యత్‌ వ్యవసాయం
మనుషులకు ఆధారం మట్టి. మట్టికి ఆధారం సేంద్రియ కర్బనం. ఒక ఎకరం పొలంలో సాధారణంగా వంద మెట్రిక్‌ టన్నుల సేంద్రియ కర్బనం ఉంటుంది. ఇది ఒక శాతం మాత్రమే. అనగా ఒక ఎకరం పొలంలో (30 సెం.మీ/ నాగలి చాలు) సుమారుగా లక్ష మెట్రిక్‌ టన్నుల మట్టి ఉంటుంది. సేంద్రియ కర్బనం సాగుచేస్తున్న భూములలో 0.5 శాతంగాను బీడు భూములలో 2 శాతంగాను ఉంది. హరితవిప్లవం తర్వాత సాగుభూములలో సేంద్రియ కర్బనం 0.25 శాతం అంతకన్నా తక్కువకు పడిపోయింది. దీనిని సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా కనీసం పది రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. కర్బన ఉద్గారాల ద్వారా వాతావరణ కాలుష్యానికి కారణమౌతున్న సంస్థలు, దేశాలు, కర్బన ఉద్గారాలను నిలువరిస్తున్న సంస్థలు, దేశాల వద్ద ‘కర్బన రుణధనం’ సేకరిస్తాయి. నేడు ప్రతి కిలో కర్బన రుణధనం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక రూపాయిగా ఉంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా కర్బన రుణధనం పొందడానికి అర్హులు.

సాటిలేని సేంద్రియ వ్యవసాయం
భూసార సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు, ప్రజారోగ్య భద్రతకు సేంద్రియ వ్యవసాయం సాటి లేనిది. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వలన నేలలు జీవం కోల్పోయి నిస్సారమవుతాయి. ఉప్పు తిన్న మనుషులకు దాహం ఎలా తీరదో, రసాయనిక ఎరువులు వాడిన నేలలు కూడా దాహార్తితో తపిస్తూ ఉంటాయి. వాన నీరు నేలలోకి ఇంకక భూమిపై పరుగులు పెడుతుంది. సారవంతమైన మట్టి, వాన నీటిలో కరిగి కొట్టుకుపోతుంది. ఫలితంగా మరింత రసాయన ఎరువుల వాడకం అవసరం అవుతుంది. దాని మూలంగా భూమిలో సేంద్రియ కర్బనం అంతరించిపోతుంది. వెరసి, ఖర్చుపెరగడమే కాదు, దిగుబడులు తగ్గిపోతాయి. కావున సమగ్ర సేంద్రియ సాగు ద్వారా మాత్రమే సమాజం దీర్ఘకాలం మనగలుగుతుంది.

ఆకలి కంటే పెద్ద సమస్య
ఆకలి, పోషకాహార లోపం సమస్యలను అధిగమించిన అమెరికా, బ్రెజిల్, చైనా, చిలీ వంటి దేశాలలో అధిక బరువు, ఊబకాయం సవాలుగా మారింది. నేడు ప్రతి నలుగురిలో ఒకరు ఇందులో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. భారతదేశం లాంటి వర్ధమాన దేశాలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువ. 2030 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది (400 కోట్లు) అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటారని అంచనా. 

మారక తప్పని ఆహారపు అలవాట్లు
2050 నాటికి ప్రపంచ జనాభా 910 కోట్లు చేరుకుంటుందని అంచనా. వారికి సరిపడా ఆహారోత్పత్తి జరగాలంటే మరో 70 శాతం వనరులు అదనంగా అవసరం. కానీ అప్పటికి మరో 30 శాతం వనరులు నిర్వీర్యమవుతాయి. అంటే 2050 నాటికి ఇప్పుడున్న వనరుల కంటే రెట్టింపు వనరులు అవసరం. ఇది దాదాపు అసాధ్యం. అటువంటి పరిస్థితుల్లో మన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం శుద్ధ శాకాహారం. నేడు ఉత్పత్తి అవుతున్న ఆహార ధాన్యాలు నేరుగా మనుషుల నోటికి చేరితే, 2050 వరకు సహజ వనరులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా పెరుగుతున్న జనాభాను పోషించవచ్చు. కానీ నేడు పండిస్తున్న ధాన్యంలో 36 శాతం పశువుల మేతకు, మరో 9 శాతం ఇంధనాల తయారీకి ఉపయోగించబడుతోంది.

మాంసాహారం మరింత ప్రియం
ఒక కిలో గొడ్డు మాంసం ఉత్పత్తి చేయడానికి అవసరమైన భూమి, నీటితో 60 కిలోల గోధుమలు ఉత్పత్తి చేయవచ్చు.
ప్రతి వంద క్యాలరీల శక్తినిచ్చే ధాన్యంతో ఉత్పత్తి చేయగల మాంసాహారాలు:
 కోడిమాంసం    12 క్యాలరీలు/ 100 క్యాలరీలకు
 పంది మాంసం    10 క్యాలరీలు / 100 క్యాలరీలకు
 చేపలు / రొయ్యలు    9 క్యాలరీలు / 100 క్యాలరీలకు
 గొడ్డు మాంసం    6 క్యాలరీలు / 100 క్యాలరీలకు
 పాలు    44 క్యాలరీలు / 100 క్యాలరీలకు
 గుడ్లు    22 క్యాలరీలు / 100 క్యాలరీలకు
కావున.. భవిష్యత్తులో మాంసాహార ఉత్పత్తుల పైన తీవ్రమైన ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top